Hot News: కాపాడండి ప్లీజ్..! ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఓ ఉన్నతాధికారి

by Shiva |
Hot News: కాపాడండి ప్లీజ్..! ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఓ ఉన్నతాధికారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సెక్రటేరియట్‌లో వెలుగు చూసిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోళ్ల స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. తన మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్నట్లు తెలిసింది. అందుకే నాలుగు రోజులుగా అక్కడే మకాం వేసినట్లు సమాచారం. అవకతవకల గురించి విజిలెన్స్ నివేదిక​రాష్ట్ర ప్రభుత్వానికి అందిన రాత్రికి రాత్రే సదరు ఉన్నతాధికారి ఢిల్లీ పయనమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినట్లుగా తెలిసింది. విజిలెన్స్​నివేదికలో తన అక్రమాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు గుర్తించిన ఉన్నతాధికారి.. ప్రభుత్వం తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ నివేదికను కోల్డ్​స్టోరేజీలో పెట్టేలా​ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు టాక్. వాస్తవానికి విజిలెన్స్​నివేదికకు ముందే తన పాత్రపై ప్రస్తావన తప్పక ఉంటుందని భావించిన సదరు ఉన్నతాధికారి తరుచుగా ఢిల్లీలోని కాంగ్రెస్​పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని తెలిసింది.

ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు?

సచివాలయానికి చెందిన పరికరాలు, వస్తువులు కొనుగోలులో ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఇష్టారీతిన కొనుగోళ్లు చేసినట్లు విజిలెన్స్​అధికారులు తమ విచారణలో గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించలేదని, వందల కోట్ల వ్యవహారాలను ఇష్టారీతిన చేశారని నివేదిక పేర్కొన్నారు. అత్యవసర పనులు పేరిట నామినేషన్​ విధానంలో చిన్న చిన్న వస్తువుల సరఫరా అంటూ వాటిని విడగొట్టి సరఫరా చేసేలా చేసినట్లు తెలిసింది. చిన్న పనులకే చాలా రూల్స్ చెప్పే అధికారులు వందల కోట్ల వ్యవహారంలో ఎందుకు రూల్స్ పాటించలేదని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి ఇలా తప్పు చేస్తుంటే ప్రభుత్వ వ్యవస్థలోని మిగిలిన అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ స్కామ్ వెనక ఎవరు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొనుగోళ్లకు సంబంధించి లావాదేవీలు జరగగా.. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే దీనిపై విచారణకు ఆదేశించింది. విజిలెన్స్​నివేదికలో సచివాలయానికి సంబంధించిన కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్​పరికరాల కొనుగోలులో కనీస నిబంధనలు కూడా పాటించలేదని విచారణలో తేలింది.

నో టెండర్స్.. అమాంతం అంచనా పెంచేసి..

వందల కోట్ల పరికరాలను కొనుగోలు చేసినా వాటికి ఎలాంటి టెండర్లను పిలవలేదు. కొనుగోలు చేసిన వాటికి సంబంధించి అడ్డగోలు ధరలను కోట్ చేసినట్లు బిల్లులు సమర్పించారు. ఎలక్ట్రానిక్​పరికరాల కొనుగోలుకు ముందుగా రూ.180 కోట్ల వరకు అవుతాయని అంచనా వేశారు. తీరా కొనేసరికి రూ.320 కోట్ల వరకు బిల్లులో చూపించారు. దీనిపై విచారణ జరుగుతుండగానే అటు కొనుగోలు చేసిన శాఖ అధికారులు, ఇటు ఆర్థికశాఖ కలిసి సంబంధిత మంత్రికి చెప్పకుండానే పెద్ద మొత్తంలో నిధులను ఒకేసారి విడుదల చేసినట్లు తెలిసింది. బిల్లులు విడుదలయ్యాక ఉన్నతాధికారులు, సదరు మంత్రి ఆశ్చర్యపోయినట్లు సమాచారం.

నిధుల విడుదల ఆపాలని చెప్పినా..

ఈ బిల్లులను ఉన్నతాధికారులు పెండింగ్‌లో పెట్టాలని సూచించినా ఫైల్​చకచకా కదిలింది. ఉన్నతాధికారులకు తెలీకుండానే నిధులు విడుదలయ్యాయి. ఓవైపు ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా విడుదల చేస్తారని ఉన్నతాధికారులు ఆర్థిక శాఖను ప్రశ్నించినట్లు సమాచారం. చిన్న చిన్న బిల్లుల కోసం నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధుల విడుదల వెనక ఎవరైనా పెద్దల హస్తం ఉందా? అసలేం జరుగుతుంది? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ పెద్దల ఒత్తిడితో బదిలీ స్టాప్..

సదరు అధికారిని తను విధులు నిర్వహిస్తున్న శాఖ నుంచి ప్రభుత్వం బదిలీ చేయాలని ఆలోచన చేసినా ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిళ్తు, రిక్వెస్టులు రావడంతో ఆ బదిలీ కాస్త నిలిచిపోయింది. సుదీర్ఘకాలంగా ఒకే శాఖలో పాతుకపోయిన ఆయన్ను బదిలీ చేయాలని ప్రభుత్వం కూడా భావించింది. గత ప్రభుత్వంలో ఓ కీలక నేతకు అతి దగ్గరి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందినట్లు తెలిసింది. కాంగ్రెస్​ప్రభుత్వం రాగానే ఆయన్ను బదిలీ చేస్తారని అంచనా వేశారు. కానీ, ఆయన్ను కదిలించలేకపోయారు. బీఆర్ఎస్‌లో ఓ వెలుగు వెలిగి కాంగ్రెస్‌లోనూ అదే స్థాయిలో కొనసాగుతున్న ముగ్గురు సీనియర్​ఐఏఎస్‌‌లలో సదరు ఉన్నతాధికారి కూడా ఒకరుగా ఉన్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed