ఇకపై సహించేది లేదు.. మేమేంటో చూపిస్తాం!

by GSrikanth |
ఇకపై సహించేది లేదు.. మేమేంటో చూపిస్తాం!
X

దిశ, తెలంగాణ క్రైంబ్యూరో: ‘న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న సహచరుడి కుటుంబానికి నైతిక స్థైర్యం ఇవ్వటానికి ప్రయత్నిస్తే మాపై కేసులు పెడతారా? ఏదో నేరం చేసినట్టుగా సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులిస్తారా?’ అని హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటి వరకు కనీసం ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. చివరకు తమ వేతనాల్లో నుంచి ప్రతీనెలా కొంత మొత్తాన్ని మినహాయించుకొని ఫండ్​ ఏర్పాటు చేసి చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తామంటే దానికి కూడా ఒప్పుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారుల తీరుపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని పలువురు హోంగార్డులు చెప్పారు. దీనికోసం నేడే జేఏసీ సమావేశాన్ని జరుపుకోనున్నట్టు తెలిపారు. చాంద్రాయణగుట్టలో హోంగార్డుగా పని చేస్తున్న రవీందర్​రెడ్డి మృతి పట్ల నిరసన వ్యక్తం ఘటనలో పలువురు హోం గార్డులకు 25న సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు.

నోటీసులు అందుకున్న 5 రోజుల్లో విచారణ అధికారి ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్లో సూచించారు. దీనిపై హోంగార్డులు మండిపడుతున్నారు. న్యాయ పోరాటం చేస్తాం.. హోంగార్డు సంఘానికి చెందిన ఓ నాయకుడితో మాట్లాడగా ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారుల తీరుపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అవసరమైతే మాలో ఓ 5 మంది ఉద్యోగాలకు రాజీనామా చేసి హోంగార్డుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామన్నారు. సమస్యల గురించి ప్రశ్నిస్తే ఆన్​ రికార్డ్​ మీరు స్వచ్ఛందంగా పని చేయటానికి వచ్చారు, నోరు తెరిస్తే ఉద్యోగాల్లో నుంచి ఊస్ట్​ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్​లో హోంగార్డులకు నెలకు రెండు అధికారిక సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. వారికి ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేస్తున్నారని, అమ్మ ఒడి వంటి పథకాలను అందచేస్తున్నారని చెప్పారు. ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. తెలంగాణ వస్తే కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్న కేసీఆర్ ​ఇప్పుడు తమ పొట్టలపై కొడుతున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక్కరోజు ఉద్యోగానికి వెళ్లకున్నా ఆ రోజు జీతం కట్​ చేస్తున్నారని చెప్పారు.

మా డబ్బులు ఇచ్చుకుంటామన్నా..

చాలీచాలని జీతాలు, పర్మినెంట్​కాని ఉద్యోగాలు, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా చాలామంది హోంగార్డులు అనారోగ్యాల బారిన పడి చనిపోతున్నట్టుగా హోంగార్డుల సంఘానికి చెందిన మరో నాయకుడు చెప్పారు. గడిచిన అయిదేళ్లలో 2‌‌02 మంది మరణించినట్టు తెలిపారు. ఇలా చనిపోయిన వారికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం ఇవ్వలేదన్నారు. తమ వేతనాల్లో నుంచి ప్రతీనెలా రూ.300 మినహాయించి ఫండ్​గా ఏర్పాటు చేసి ఎవరైనా చనిపోతే రూ.1‌‌0లక్షలు ఇవ్వండని పోలీసు ఉన్నతాధికారులతో మొర పెట్టుకున్నా అదేం కుదరదని చెబుతున్నారన్నారు. అందుకే సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించినట్టు తెలియచేశారు.

Advertisement

Next Story