వచ్చేవారం రాష్ట్రానికి హై పవర్ కమిటీ.. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై రివ్యూ

by Shiva |
వచ్చేవారం రాష్ట్రానికి హై పవర్ కమిటీ.. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై రివ్యూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రీజనల్‌ రింగ్ రోడ్డు ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం జులై మొదటి వారంలో రాష్ట్రానికి నేషనల్ హైవే అథారిటీ కమిటీ వస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఇందు‌కోసం అన్ని అంశాలతో అధికార యంత్రంగం సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి సూచించారు. న్యాక్‌లో జాతీయ రహదారులపై శుక్రవారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రీజనల్‌ రింగ్ రోడ్డు, ఎన్‌హెచ్‌-65, మన్నెగూడ, ఆర్మూర్-మంచిర్యాల జాతీయ రహదారులపై చర్చించారు.

మన్నెగూడ రహదారికి మార్గం సుగమం చేసేందుకు నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యూనల్ ఆదేశానుసారం 915 చెట్లను రీ లొకేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు సంస్థ 300 చెట్లను రీ లొకేట్ చేసేందుకు సిద్ధంగా ఉందని, మిగతా 615 చెట్లను అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ అధికారులు రీ లొకేట్ చెయ్యాల్సి ఉందన్నారు. దీన్ని వెంటనే ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ ఆర్వో రజాక్‌ను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్-విజయవాడ హైవేని గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్-ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులకు ఆగస్టులో కొత్త టెండర్స్ పిలుస్తామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం భూసేకరణ, పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ఎల్బీ నగర్-మల్కాపూర్ 6 లైన్ పనులకు అడ్డుగా ఉన్న వాటర్ లేన్, ట్రాన్స్కో అధికారులతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. వారంలో సమస్యలలు అన్ని కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్‌హెచ్-645‌ను గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మించేందుకు డీపీఆర్ కూడా సిద్ధంగా ఉందని తెలిపిన మంత్రి ఆర్ఆర్ఆర్ విషయంలో మరింత చురుగ్గా పనులు చేయాలని అన్నారు. ఒక్క ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభమైతే రాష్ట్రానికి ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, డిస్నీ ల్యాండ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పడి రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధిస్తుందని అన్నారు.

ఇక ఆర్మూర్-మంచిర్యాల్ జాతీయ రహదారి కోసం 630 హెక్టార్ల భూమి కావల్సి ఉండగా ఇప్పటికే 530 హెక్టార్లు సేకరించామని చెప్పిన అధికారులు మిగతా పనులను ఈ నెలలో పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు. వీటితో పాటు ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లై ఓవర్ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు టెండర్లు ఫోర్ క్లోజ్ చేసి కొత్త టెండర్లు పిలుస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా సంస్థలను ఖరారు చేసి ఫ్లైఓవర్ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఎల్బీనగర్-మల్కాపూర్ రోడ్డులో మన్నెగూడ వద్ద ప్రమాదకరంగా ఉన్న మలుపు వద్ద నిర్మించాల్సిన బ్రిడ్జి సమస్యల గురించి మంత్రికి అధికారులు వివరించగా పరిష్కారం హామీ ఇచ్చారు. మనం నిర్మించే ప్రతీ రోడ్డు ప్రజలకు ఉపయోగపడాలని.. రోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో పొతున్న అమాయకుల ప్రాణాలను కాపాడాలని సూచించారు. ప్రభుత్వం నిర్మించాల్సిన రోడ్డు మూలంగా ప్రజల ప్రాణాలు పోతే.. ఇక ప్రభుత్వం ఉండి ఎందుకని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, సెక్రటరీ హరీష్, ఐఏఎస్, ఎన్‌హెచ్‌ఆరోవో రజాక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.. ప్రజల ప్రాణాలు పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులకు మంత్రి సూచించారు. వేగంగా పనులు చేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చన్నారు.



Next Story