- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు.. ఎర్రటి ఎండలో రైతుల అరిగోస
దిశ, రంగారెడ్డి బ్యూరో: కష్టాన్ని నమ్ముకొని ఆరుగాలం పంట పండిస్తే కొనుగోలు చేసే దిక్కులేకపాయె. చేతికొచ్చిన పంట అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి తీసుకోస్తే రోజులు గడిచినా గింజ కూడా కొనుగోలు చేయని వైనం. బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుందామంటే పండించిన పంటకు గిట్టుబాటు రాకపాయే. ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి. మీ కష్టానికి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. కానీ కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి ఆలోచిస్తే అటు ప్రభుత్వం.. ఇటు రైతులు చెప్పే మాటలకు పొంతన లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యం తీసుకొచ్చి 9 రోజులౌతున్నా. తేమ శాతం లేదు. తడిసిన ధాన్యం పేరుతో కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వరి సాగును బట్టి ఎంత ధాన్యం వస్తుంది. ఎన్ని గన్నీ బ్యాగులు అవసరం ఉంటుంది. ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాల నుంచి రోజుకు ఎంత సేకరించాలనే ఆలోచనతో జిల్లాలోని అధికారులు అడుగులు వేస్తారు. అందుకు తగ్గట్టుగానే ధాన్యం సేకరణలో వేగవంతం చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ నత్తనడకనే ఉంది. ఒక్కోక్క కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తుంది. రోజూ నిర్వాహకులు ఇవాళ, రేపు అంటూ కాలం గడుపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. కానీ ఇప్పటి వరకూ కేవలం 5 వేల మెట్రిక్ టన్నులను సేకరించడం విడ్డూరంగా ఉంది.
రికార్డు స్థాయిలో వరి సాగు...
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా రైతులు వరి సాగు చేశారు. గతంలో పడిన వర్షాలకు చెరువులు, కుంటలల్లో నీరు నిల్వ ఉండడంతో భూగర్భ జలాలు అందుబాటులో ఉండడంతో రైతులు వరి వేశారు. ఈ యాసంగి పంటలను దృష్టిలో పెట్టుకొని సివిల్ సప్లయ్ అధికారులు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వచ్చే వరి ధాన్యాన్ని అంచనా వేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నులు, వికారాబాద్ లక్షా 75వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే గన్నీ బ్యాగులు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ కూడా ఇన్ని మెట్రిక్ టన్నులు సేకరించలేదని అధికారులు వివరిస్తున్నారు. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగు చేశారు.
ధాన్యం సేకరణ శూన్యం...
జిల్లాలో ధాన్యం సేకరణ అంచనాకు అనుగుణంగా రంగారెడ్డిలో 37, వికారాబాద్‌లో 155 చొప్పున కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేశారు. అయితే రంగారెడ్డి జిల్లాలో 60వేల మెట్రిక్ టన్నులు, వికారాబాద్‌లో లక్షా 75వేల మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకూ రంగారెడ్డిలో 4 వేలు, వికారాబాద్‌లో 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేశారు. ఈ పద్ధతిని వరి సేకరణ జరిగితే కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం వెనక్కి వెళ్లాల్సిన దుస్థితిని ప్రభుత్వమే కల్పించినట్లు అవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమైతున్నాయి.
ప్రైవేట్ వైపు రైతుల మొగ్గు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద నిబంధనలు అమల్లో ఉన్నందున మెజార్టీ రైతులు ప్రైవేట్‌గా అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ధరతోపాటు సకాలంలో డబ్బులు చేతికి అందుతుండడం, రవాణా ఖర్చులు మిగిలిపోతుండడంతో ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో బస్తాకు 3 కిలోలు తగ్గిస్తున్నారు. దాంతోపాటు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు సకాలంలో డబ్బులు చేతికి రాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు నేరుగా రైతుల పొలాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దాంతోపాటు వారికి వెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. తరుగు అసలే తీయడం లేదు. దానికితోడు రవాణా కర్చులు కూడా మిగిలిపోతున్నాయి. ధరలో కూడా వ్యత్యాసం ఉంటోంది. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 2060 ఏ గ్రేడ్‌కు చెల్లిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు రూ. 2300 వరకు చెల్లిస్తున్నారు. డబ్బులు ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లిస్తుండడంతో చాలామంది రైతులు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు మరో 15రోజుల్లో ప్రారంభం కానున్నాయి. వీరంతా ఎటువైపు వెళ్తారనేది వేచి చూడాలి. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆశించినమేర ధాన్యం సేకరించడం లేదు.
తొమ్మిది రోజులైతంది..
నేను ఒక్కదానే ఇక్కడ ఉంటాను.. నా పిల్లలు పట్నంలో ఉన్నారు. పండించిన ధాన్యం అమ్మేందుకు నానా కష్టాలు పడుతున్నా. తొమ్మిది రోజులైంది అమనగల్లు మార్కెంట్‌కు తీసుకచ్చి. ఇప్పటి వరకూ నా పంట కొనలేదు. ఒక సీరియల్ నెంబర్ లేదు. ఎప్పుడు వస్తుందో తెల్వదు. ఈ ధాన్యం కాపాడుకోవడానికి పడిగాపులు కాస్తున్నా. ఇంకా రెండు రోజులు చూస్తా లేకుంటే బయటి అమ్ముకుంటాను.
–నాగమ్మ, చింతలపల్లి గ్రామం, అమనగల్లు
సంచులు లేక పడిగాపులు
సంచులు లేక రోజుల తరబడి ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సంచులు లేవు ధాన్యం సేకరణ నిలిపివేశామని నిర్వాహకులు చెప్తున్నారు. ప్రతి రోజూ గడిచేందుకు దేవుడిని కోరుకుంటున్నాం. వాతావరణం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందోననే భయం. ధాన్యం కొనుగోలు చేయకపోతే అకస్మాత్ గా వర్షం వస్తే ఇక నెలపాలైతుంది.
–బాణావత్ సోమ్లా నాయక్, పల్గు తండా
ఎండకు సచ్చిపోతున్నాం
కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవు. తాగేందుకు నీళ్లు లేవు. సంచుల పేరుతో కాలయాపన చేస్తున్నారు. పంట పండించడం ఒక ఎత్తుతైతే ధాన్యం అమ్ముకోవడం కష్టంగా మారిపోయింది. ప్రభుత్వం చెప్పే మాటాలకు ఇక్కడ జరిగే పద్దతికి తేడా లేకుండా పోయింది. అందరూ రైతులను మోసం చేయడమే తప్పా కాపాడేనాథుడే లేడు.
–దేవరకొండ వెంకటేశ్వర్లు, సుద్దపల్లి