Harish Rao: ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే: హరీశ్ రావు

by Ramesh N |
Harish Rao: ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే: హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కృష్ణా జలాల కేటాయింపు విషయంలో ఇరు రాష్ట్రాల వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (Brijesh Kumar Tribunal) ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన విజయం అని హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచి కేసీఆర్ చేసిన వాదనతో ట్రిబ్యునల్ ఏకీభవించడం వల్ల నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ కొట్లాడి సాధించిన విజయాన్ని సైతం తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ భావ‌దారిద్య్రానికి నిదర్శనం అన్నారు. ఇది (Congress) కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఏపీ పునర్విభజన చట్టం, సెక్షన్ 89ని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తెచ్చిందన్నారు. కృష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే, దాన్ని సరిదిద్దడానికి పదేళ్ల కాలం పట్టిందన్నారు.

ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం

నీటి వాటాల్లో తెలంగాణ హక్కులు సాధించేందుకు ఆనాడు కేసీఆర్ సీఎం హోదాలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు హాజరై వాదనలు వినిపించారని, దీంతో తెలంగాణకు న్యాయం దక్కే అవకాశాలు మెరుగు పడ్డాయని గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం 2015లోనే నాటి కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్ కి రిఫర్ చేయడానికి అంగీకరించిందన్నారు. తెలంగాణ దశాబ్దాలుగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను కోల్పోయిందన్నారు. కనుక సెక్షన్ 3 కింద విచారణ త్వరితగతిలో పూర్తి చేసి న్యాయమైన వాటా వచ్చే విధంగా చేయాలని ట్రిబ్యునల్ ను బీఆర్ఎస్ పక్షాన విజ్ఞప్తి చేశారు. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు పటిష్టమైన వాదనలు వినిపించేలా నిష్ణాతులైన న్యాయవాదులను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నదీ జలాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, నీటి వాటా కోసం రాజీలేని పోరాటం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమని ప్రకటించారు.

Next Story