కేసీఆర్‌కి ఇష్టమైన ఆలయం ఇదేనటా! ఉద్యమం కూడా.. హరీశ్‌రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Ramesh N |   ( Updated:2025-02-11 12:44:19.0  )
కేసీఆర్‌కి ఇష్టమైన ఆలయం ఇదేనటా! ఉద్యమం కూడా.. హరీశ్‌రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రామిస్ డే (Promise Day) సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట కొనాయిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకోవడం రేవంత్‌రెడ్డికి చేతకాదన్నారు. చబ్బీస్ జనవరికి రైతు భరోసా అందరు రైతులకు ఇస్తామన్నారు.. ఇప్పటివరకు పూర్తి చేయలేదని అన్నారు. వానాకాలం రైతు బంధు ఎగబెట్టి రూ.8 వేల కోట్ల రూపాయలు రైతుల కందకుండా చేశారని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో కుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని విమర్శించారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొట్టారని తెలిపారు. కర్ణాటక, తెలంగాణలో (Congress) కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఓడగొట్టారని తెలిపారు. ఈ రోజు ఫిబ్రవరి 11 ప్రామిస్ డే.. ఈ ప్రామిస్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌కి ఇష్టమైన ఆలయం ఇదేనటా!

ఇక, కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత (KCR) కేసీఆర్‌కి ఇష్టమైన ఆలయం కోనేరుపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఆలయం నుంచే ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కేసీఆర్ ఏ ముఖ్య కార్యక్రమాన్ని అయినా ఈ దేవాలయం నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. ఆయన మూడు కోట్ల 60 లక్షల రూపాయలతో దేవాలయాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చే విధంగా చూడాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 15 నెలలుగా దేవాలయాలకు నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. కొత్తగా ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయలేదని, గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను కూడా నిలిపివేశారని ఆరోపించారు.

Next Story