‘గృహలక్ష్మి’ ఎఫెక్ట్.. మహిళలకు సరికొత్త తిప్పలు!

by GSrikanth |   ( Updated:2023-08-09 06:40:46.0  )
‘గృహలక్ష్మి’ ఎఫెక్ట్.. మహిళలకు సరికొత్త తిప్పలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ స్కీమ్ మహిళలకు సరికొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ స్కీమ్ కింద సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.3 లక్షలు సాయంగా అందించనున్నది. మహిళ పేరు మీదే డబ్బులు ఇస్తామని మార్గదర్శకాల్లో జూన్ 21న ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళలు వారి పేరు మీద ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. కానీ ఈ స్కీమ్‌తో ఆ సర్టిఫికెట్ తీసుకోవడం అనివార్యంగా మారింది. దీంతో ‘మీ సేవ’ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మరి కొద్ది మంది మండలాఫీసులకు క్యూ కడుతున్నారు. స్కీమ్ కింద వచ్చే సాయం కోసం గడువు తక్కువగా ఉండడంతో ఆ లోపే ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందడం వారికి కత్తిమీద సాములా మారింది.

ఒక్కో జిల్లాలో ఒక్కో తీరులో షెడ్యూల్

‘గృహలక్ష్మి’ పథకానికి అప్లై చేయాలంటే పట్టణ ప్రాంతాల్లో గరిష్ట వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర లక్షకు మించి ఉండొద్దని ప్రభుత్వం సీలింగ్ విధించింది. ఆ ప్రకారం మహిళలు ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందాల్సి ఉన్నది. ఇప్పటికే చాలా పథకాలకు మహిళలు ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం తలెత్తలేదు. కానీ ఈ స్కీమ్‌ కేవలం మహిళలకు మాత్రమే ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఒకే తరహా విధానాన్ని అమలు చేయడం లేదు. దీని బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పడంతో ఒక్కో డిస్ర్టిక్‌లో ఒక్కో తీరులో షెడ్యూల్ ఖరారైంది.

దళారులను ఆశ్రయిస్తున్న మహిళలు

దరఖాస్తు చేసుకోడానికి ఐదారు రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో అంత తక్కువ సమయంలో ఇన్‌కమ్ సర్టిఫికెట్లు తీసుకోవడం మహిళలకు సవాలుగా మారింది. దీంతో వారు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు బ్రోకర్లు కనీసంగా రూ.1,000 డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది.

దరఖాస్తుల సమర్పణ మరో సమస్య..

ఏదో విధంగా ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందిన లబ్దిదారులు దరఖాస్తును భర్తీ చేసి కలెక్టరేట్‌లో లేదా మున్సిపల్ ఆఫీసులో సమర్పించడం మరో సమస్యగా మారింది. ఈ స్కీమ్ కోసం కేవలం ఇన్‌కమ్ సర్టిఫికెట్ మాత్రమే కాక ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు (సొంత స్థలమేనని ధృవీకరించేలా), ఓటరు గుర్తింపు కార్డు (నిర్దిష్టంగా ఆ గ్రామంలోనే ఉన్నట్లుగా ప్రూవ్ చేసేందుకు), ఇంటి పన్ను రశీదు లేదా కరెంటు బిల్లు రశీదు, రేషన్ కార్డు తదితరాలను అప్లికేషన్‌తో పాటు జత చేయాల్సి వస్తున్నది. వీటిని రెడీ చేసుకోడానికి సమయం పడుతున్నది. ఏదేని పరిస్థితుల్లో ఆ స్థలం జీవో 58, 59 పరిధిలోకి లోబడి లేదా అసైన్డ్ లాండ్ తదితర పద్ధతుల్లో పొందితే వాటి వివరాలూ జోడించాల్సి వస్తున్నది.

ఒక్కో జిల్లాలో ఒక్కో తీరులో..

స్కీం దరఖాస్తు ప్రొఫార్మా ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉన్నది. భూపాలపల్లి జిల్లాలో కేవలం ఆరు అంశాలకు మాత్రమే పరిమితమైతే మరికొన్ని జిల్లాల్లో 12 అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి వస్తున్నది. ఇంకొన్ని జిల్లాల్లో ఏకంగా 22 వివరాలు సమర్పించాల్సి వస్తున్నది. ఓటరు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నంబర్లు, వాటి జీరాక్సు ప్రతులతో పాటు బ్యాంకు అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లాంటివి ఇవ్వాల్సి వస్తున్నది. ప్రభుత్వం ద్వారా ఈ స్కీమ్ కోసం అందించే సాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నందున వీటిని సమర్పించడం తప్పనిసరి. దీనికి తోడు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి జీవో 59 ద్వారా లబ్ధి పొందినట్లయితే ఈ స్కీమ్‌కు అర్హత ఉండదు.

దీంతో అలాంటి లబ్ధి పొందలేదని దరఖాస్తుదారు స్వయంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటున్నది. ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటుంటే ఆ అడ్రస్‌ ఇవ్వడంతో పాటు ఎంతకాలం నుంచి ఉంటున్నారో.. ఆ ఇంటి స్వభావం, అద్దె ఎంత చెల్లిస్తున్నారో ధృవీకరించాలి. ఒంటరి మహిళ లేదా వితంతువు అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ధృవీకరించాల్సి ఉంటుంది. దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్‌ జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకుంటున్న మహిళలు వారి మొత్తం కుటుంబ ఆదాయానికి సంబంధించిన సర్టిఫికెట్‌ కూడా సమర్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ పథకం ద్వారా ఎలాంటి లబ్ధి పొందినా ఆ డిటెయిల్స్ దరఖాస్తులో పేర్కొనడం తప్పనిసరి. కుటుంబ సభ్యుల వివరాలు కూడా పేర్కొనడం దరఖాస్తుదారుల బాధ్యత.

గడువు పెంచే ఆలోచనలో ప్రభుత్వం?

సర్టిఫికెట్లు పొందడం మహిళలకు సంక్లిష్టంగా మారింది. దీంతో దరఖాస్తు చేసుకోడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్లింది. దీంతో ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరిగి గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

Read More : FLASH: మొదటి విడతలో వాళ్లకే ఫస్ట్ ప్రయారిటీ....గృహలక్ష్మి పథకంపై మంత్రి వేముల కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed