అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు

by Anjali |   ( Updated:2023-05-30 01:53:52.0  )
అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు
X

దిశ, రాజేంద్రనగర్: ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు దశాబ్దాలుగా అద్దె కొంపల్లోనే మగ్గుతున్నాయి. అధికార పార్టీ కార్యాలయాలు ప్రజాప్రతినిధుల కార్యాలయాలు మాత్రం ప్రభుత్వ స్థలంలో సకల సౌకర్యాలతో అలరారుతున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం, శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, రాజేంద్రనగర్ సబ్ రిజిస్టర్ కార్యాల యం దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రాంతీయ రవాణా కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వందలాది మంది వస్తుంటారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వినియోగదారులతో పాటు సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైనే తమ వాహనాలను పార్క్ చేస్తుండడంతో పలు సందర్భాల్లో ట్రాఫిక్ కూడా జామ్ అవుతూ గొడవలు కూడా జరుగుతున్నాయి.

రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

1996లో రాజేంద్రనగర్ కు సబ్ రిజిస్ట్రార్ కార్యాయలం మంజూరైంది. తాత్కాలికంగా అంటూ అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటికీ అదే అద్దె భవనంలో కొనసాగుతుంది. సబ్ రిజిస్ట్రార్‌తో పాటు 15 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. కార్యాలయం అద్దె నెలకు ₹20 వేలకు పైనే చెల్లిస్తున్నారు. ఆఫీస్ చుట్టూ సుమారు 30 మంది డాక్యుమెంట్ రైటర్లు తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యాలయాన్ని ప్రభుత్వ స్థలంలో సొంత భవనంలో ఏర్పాటు చేసి షట్టర్ల నిర్మాణం చేపడితే డాక్యుమెంట్ రైటర్ల నుంచి అద్దె కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సొంత భవనం ఏర్పాటు చేయాలన్న ఆలోచన అధికారులకు కానీ ప్రజా ప్రతినిధులకు కానీ రాకపోవడం దురదృష్టకరం.

జిల్లా ప్రాంతీయ రవాణా కార్యాలయం

రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం మూడు దశాబ్దాల క్రితం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి అత్తాపూర్ చౌరస్తాలోని ఓ అద్దె భవనంలో ఏర్పాటైంది. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి ఉప్పరపల్లి చౌరస్తాకు మార్చారు. పదేళ్లుగా ఉప్పరపల్లి చౌరస్తాలో కొనసాగుతున్న ప్రాంతీయ రవాణా కార్యాలయానికి రూ. 80 వేలు అద్దె చెల్లిస్తుంది ప్రభుత్వం. దాదాపు 30 మందికి పైగా సిబ్బంది ఇందులో పనిచేస్తుంటారు. నిత్యం వందలాది మంది కార్యాలయానికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వారికి కనీసం బైక్ పార్కింగ్ కు కూడా స్థలం లేకపోవడం గమనార్హం. తమ వాహన రిజిస్ట్రేషన్ కోసం వాహనంతో సహా ఇక్కడికి వచ్చే వారి కష్టాలు చెప్పనలవిగా ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు పార్కింగ్ రుసుం వసూలు చేస్తూ తమ స్థలంలో నిలుపుకుంటున్నారు. రవాణా శాఖ కార్యాలయాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించడంతోపాటు షటర్ల నిర్మాణం చేపడితే ఏజెంట్ల ద్వారా అద్దె రూపంలో ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉంటుంది.

ఎక్సైజ్ పోలీస్ స్టేషన్

అక్రమ మద్యం, గుడుంబా, సారా లాంటి వాటి నివారణకు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రాజేంద్రనగర్ లో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మొదట ఈ పోలీస్ స్టేషన్ ను జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ భవనంలో ఏర్పాటు చేశారు. సిబ్బందికి భవనం సరిపోకపోవడంతో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను ఉప్పరపల్లి చౌరస్తాలోని ఓ ప్రైవేట్ భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి అంటే రెండు దశాబ్దాలుగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రైవేట్ భవనంలోనే కొనసాగుతుంది. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న విభాగాల్లో ఎక్సైజ్ ఒకటి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ 40 ఏళ్లుగా సొంత భవనం లేకపోవడం విచారకరం.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం

రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నదే తడువుగా స్థలాలను సేకరించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అంతే రెవెన్యూ అధికారులు స్థలాలను చూపించడం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం సకల సౌకర్యాలతో భవన నిర్మాణాలు పూర్తవడం ఆగమేఘాల మీద జరిగిపోయింది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ఇన్ని కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం గవ్వ రాబడి లేని ఎమ్మెల్యేల క్వార్టర్స్ ను మాత్రం సకల హంగులతో నిర్మించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

Advertisement

Next Story