Cotton Purchases : పత్తి రైతులకు శుభవార్త.. కొనుగోళ్లు పునఃప్రారంభం! ఎక్కడెక్కడంటే?

by Ramesh N |
Cotton Purchases : పత్తి రైతులకు శుభవార్త.. కొనుగోళ్లు పునఃప్రారంభం! ఎక్కడెక్కడంటే?
X

దిశ, డైనమిక్/ తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం పత్తి (కాటన్) (Cotton Farmers) రైతులకు శుభవార్త చెప్పింది. పత్తి కొనుగోళ్లు పున:ప్రారంభం అవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) వైఖరికి నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు (Cotton Purchases Stopped) ఆపివేయాలని రాష్ట్ర కాటన్ మిల్లర్లు, ట్రేడర్లు సంక్షేమ సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో సీసీఐ కేంద్రాలతో పాటు మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులోనూ కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే రైతుల సంక్షేమం, ప్రాధాన్యతల దృష్ట్యా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో సీసీఐ సీఎండీ లలీత్‌ కుమార్, రాష్ట్ర కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం ఆధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, ఇతర సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీసీఐ ద్వారా కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు పై జిన్నింగ్ మిల్లర్ల అభ్యంతరాలను చర్చించి పరిష్కరం చేసినట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో పత్తి మార్కెట్లు, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద యధాతధంగా కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేసింది. కావున రైతులు ఆందోళన చెందనవసరం లేదని, రైతులు వారికి దగ్గరగా ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి పంటను నేరుగా అమ్ముకోవచ్చని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Advertisement

Next Story