ఆ స్థాయి కేడర్ ట్రాన్స్‌ఫర్స్‌లో అవకతవకలు.. ఆరోగ్యశాఖ బదిలీల్లో గోల్‌మాల్!

by Sathputhe Rajesh |
ఆ స్థాయి కేడర్ ట్రాన్స్‌ఫర్స్‌లో అవకతవకలు.. ఆరోగ్యశాఖ బదిలీల్లో గోల్‌మాల్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్యశాఖలో జనరల్ ట్రాన్స్‌ఫర్లను తప్పిదాలతోనే పూర్తి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పబ్లిక్ హెల్త్ విభాగంలోని డిప్యూటీ డైరెక్టర్(అడ్మిన్) కేడర్‌లో అక్రమ పద్ధతిలోనే కౌన్సెలింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆఫీసర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ, (లోకల్ టు లోకల్) మళ్లీ హైదరాబాదులోనే పోస్టింగులు ఇవ్వడం గమనార్హం. కూర్చీలు, బిల్డింగులు మాత్రమే మారాయి తప్ప.. స్టేషన్ ఛేంజ్ కాలేదు. సాధారణ బదిలీలు సందర్భంగా ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో నంబరు 80 ప్రకారం రూల్స్ పాటించలేదని స్వయంగా ఉద్యోగుల నుంచే ఆరోపణలు వస్తున్నాయి. స్పౌజ్ లేకున్నా పోస్టింగులు ఇచ్చినట్లు సమాచారం. కొంత మంది అధికారుల కుమ్మక్కుతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇదే అంశంపై ఓ సీనియర్ ఎమ్మెల్యే, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహాకు కూడా ఫిర్యాదు చేశారు. విచారణ చేసి పరిస్థితులను చక్కదిద్దాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ తప్పిదాలను సరిదిద్దకుండానే ఆయా ఆఫీసర్లకు పోస్టింగులు ఇచ్చేశారు. పైగా ఇతర అధికారులెవ్వరూ అబ్జక్షన్ చేయకుండా జూలై 27న ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్లు 31న సాయంత్రం విడుదల చేయడం గమనార్హం. దీంతో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్ ) జనరల్ ట్రాన్స్‌ఫర్లపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, ఆ తర్వాతనే పోస్టింగ్ ఇవ్వాలని ఓ అధికారి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అర్హులకు మాత్రమే పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రభుత్వం బద్నాం అయ్యే ప్రమాదముందని ఆయన వివరించారు.

తప్పిదాలు ఇవే..?

జీవో 80 ప్రకారం ఒకే స్టేషన్‌లో నాలుగేళ్లు, అంతకంటే ఎక్కువ పని చేసిన అధికారులను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటూనే, ఒకే స్టేషన్‌లో రెండేళ్లకు పైబడి పనిచేస్తున్న ఆఫీసర్లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పైగా కౌన్సెలింగ్‌కు లాంగ్ స్టాండింగుతో పాటు అప్లై చేసుకున్న ప్రతీ ఆఫీసర్‌ను పిలవాలి. కానీ డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ కేడర్ బదిలీల్లో ఇలాంటివేమీ జరగలేదు. ఇక కౌన్సెలింగ్ సమయంలో అన్ని ఖాళీలను చూపించాల్సి ఉంటుంది. కానీ వరంగల్, ఆదిలాబాద్ లోని ఖాళీలను చూపలేదనేది పోస్టింగ్ ఆర్డర్లను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. హైదరాబాద్ టు హైదరాబాద్ (ఒకే స్టేషన్‌లో) ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వకూడదనే రూల్ జీవో 80లో స్పష్టంగా ఉంది. కానీ ఈ రూల్స్‌ ఏవీ పాటించకుండా అధికారులకు నచ్చినట్లు కౌన్సిలింగ్ నిర్వహించుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ఇలా చేశారు..?

పబ్లిక్ హెల్త్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) కేడర్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది అధికారులు ఉండగా, హైదరాబాద్ పరిధిలో 11 మంది, వరంగల్‌లో ఒకరు, కరీంనగర్‌లో మరొకరు చొప్పున వర్క్ చేస్తున్నారు. వీళ్లలో సీనియారిటీ ప్రకారం 40 శాతం కింద ఐదుగురు ఆఫీసర్లను ఎంపిక చేశారు. వీరిలో ఒకరు హైదరాబాద్ పరిధిలో 12 ఏళ్లు, ముగ్గురు ఏడేళ్లు, ఒకరు ఐదేళ్లు చొప్పున పనిచేస్తున్నారు. ఇందులో కేవలం ఇద్దరికి మాత్రమే స్పౌజ్ కోటా ఉండగా, వాళ్లకూ హైదరాబాద్‌లో సర్వీస్ ఐదేళ్లు పూర్తయినట్లు తెలిసింది. కానీ ఏకంగా నలుగురికీ స్పౌజ్ వర్తింపచేసి ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా కోఠి హెడ్ ఆఫీసులోనే పోస్టింగులు ఇవ్వడం హాట్ టాఫిక్‌గా మారింది.

డీడీ(అడ్మిన్) పోస్టింగ్‌లు ఇలా...

జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ప్రధాన కార్యాలయంలో జాయింట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (నాన్ టెక్నికల్ ) హోదాలో పనిచేసిన జీ.నరేంద్రకుమార్‌ను బదిలీ చేస్తూ కోఠిలోని పబ్లిక్ హెల్త్ ఆఫీస్‌లో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) కేడర్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఇక పబ్లిక్ హెల్త్ ఆఫీస్‌లో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్ ) హోదాలో పనిచేసిన సీహెచ్.సోమశేఖర్‌ను జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (నాన్ టెక్నికల్)గా ఆరోగ్యశ్రీ ఆఫీస్‌కు బదిలీ చేశారు. హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్‌లో సెక్రటరీ హోదాలో పనిచేసిన సత్యచంద్రికను జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో ఆరోగ్యశ్రీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు.

నేషనల్ హెల్త్ మిషన్ ప్రధాన కార్యాలయం కోఠిలో చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా పనిచేసిన జీ.సుస్మితను, అదే క్యాంపస్ పక్క బిల్డింగులోని పబ్లిక్ హెల్త్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీలో జాయింట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా పనిచేసిన ఎన్.క్రిష్ణవేణిని, కోఠిలోని నేషనల్ హెల్త్ మిషన్ ఆఫీస్ లో చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా పోస్టింగ్ లు ఇచ్చారు. ఈ ఐదుగురు అధికారులకు హైదరాబాద్ టు హైదరాబాదులోనే పోస్టింగ్ ఇవ్వడంపై ఇప్పుడు ఉద్యోగుల్లో దుమారం రేపింది. వరంగల్ కాళోజీ వర్సిటీలో ఇదే కేడర్‌లో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు ఆదిలాబాద్ రిమ్స్‌లోనూ ఉన్నాయి. కానీ ఆ ఖాళీలను నింపకుండా ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్నా, ఒకే స్టేషన్‌లో పోస్టింగ్‌లు ఇవ్వడం వెనక అంతర్యమేమిటో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed