హౌసింగ్ చీఫ్ పోస్టు.. యమా డిమాండ్ గురూ..!

by karthikeya |
హౌసింగ్ చీఫ్ పోస్టు.. యమా డిమాండ్ గురూ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ పోస్టుకు పలువురు అధికారులు పోటీ పడుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఎవరి లాబీ వారు చేసుకుంటున్న పరిణామాలు సచివాలయవర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నది. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ పోస్టుకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పోస్టు కోసం ప్రధానంగా ఇద్దరు, ముగ్గురు ఇంజినీర్లు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

ఇద్దరు అధికారుల గట్టి ప్రయత్నాలు

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్లికేషన్లను ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారుల నుంచి స్వీకరించింది. దీని నిర్వహణ బాధ్యత మొత్తం చీఫ్ ఇంజినీర్ చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ పోస్టుకు ప్రాధాన్యత పెరిగింది. కొన్ని నెలల క్రితం రిటైర్డ్ అయిన చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్.. ఈ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారని తెలిసింది. దీంతో పాటు ప్రస్తుతం సర్వీసులో ఉన్న మరో ఉన్నతాధికారి సైతం పోటీలో ఉన్నట్టు తెలిసింది. రిటైర్డ్ ఉన్నతాధికారులు ఇరువురు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

ఎక్స్‌‘టెన్షన్’

సాధారణంగా ప్రతి శాఖలోనూ రిటైర్డ్ ఆఫీసర్లు తమకు ఎక్స్‌టెన్షన్ కావాలని కోరుతూ పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేసుకోవడం పరిపాటే. అయితే, హౌసింగ్ కార్పొరేషన్‌లో మాత్రం సర్వీస్‌లో ఉన్న అధికారులకు ప్రమోషన్లు ఆగిపోతాయని కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 14 ఏళ్ల పాటు సీఈగా పని చేసి రిటైర్డ్ అయిన అధికారి ఓ కీలక మంత్రి ద్వారా ఎక్స్‌టెన్షన్ అడుగుతున్నారని చెబుతున్నారు. ఇన్నాళ్లూ సీఈగా చేసి ఇంకా ఎక్స్‌టెన్షన్ అడగటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

సీఎం వద్దకు ఫైల్

నియామకాల ఫైల్ సంబంధిత శాఖ మంత్రి పేషీ నుంచి సీఎం దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తున్నది. ఇదే అంశంపై అటు కార్పొరేషన్‌లోనూ, సెక్రెటేరియట్‌లోనూ తీవ్రంగా చర్చ జరుగుతున్నది. గత ప్రభుత్వం పదేళ్ల పాటు రిటైర్డ్ అయిన కొంతమంది అధికారులను సర్వీసులో ఉంచడం వల్ల రాష్ట్రంలో వందలాది మంది అధికారులకు ప్రమోషన్లు రాకుండానే వారు ఉద్యోగ విరమణ పొందారని, ఫలితంగా బెనిఫిట్స్‌ కోల్పోవడంతో పాటు జీవితంలో ఉన్నత హోదాతో రిటైర్డ్ అయ్యామన్న సంతృప్తి దూరమైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed