కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. చేరికకు కారణమిదే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-16 02:50:00.0  )
కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. చేరికకు కారణమిదే!
X

దిశ, మంచిర్యాల/మందమర్రి : చెన్నూర్ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొన్ని రోజులుగా ఆయన పార్టీని వీడనున్నారనే ప్రచారానికి తెర పడినట్లయింది. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో ఆయనతో పాటు ఆయన సతీమణి జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చారు.

వీరిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి స్వాగతించారు. తనకు చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ద్వారా నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గత యేడాదీ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరినా.. అప్పుడు కాంగ్రెస్‌లో జరిగిన చేదు అనుభవాలకు తోడు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు అప్పుడు తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు.

అయినా తనకు బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యత లభించడం లేదని, అడుగడుగునా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ద్వారా అవమానాలు ఎదురవుతున్నాయనే అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు వెళ్తారని ప్రచారం జరిగినా మళ్లీ కాంగ్రెస్‌లో చేరి అందరి అంచనాలు తలకిందులు చేశారు. ఆ పార్టీ కండువా కప్పుకుని బీఆర్ఎస్‌కు షాకిచ్చారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సేవలందించిన ఓదెలు కాంగ్రెస్ లో చేరడంతో నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోరు రసవత్తరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రాధాన్యత లేకుండా పోయిందనే...

నియోజకవర్గంలోని మందమర్రి పారిశ్రామిక పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటు ఉద్యమంలో బీఆర్ఎస్ లో చురుకైన పాత్ర పోషించారు. ఈ ప్రాంతంలో సీఎం కేసీఆర్‌కి నమ్మిన బంటుగా ఉద్యమంలో ఆయన వెన్నంటి నడిచారు. 2009 ఎన్నికల్లో, ఆ తర్వాత 2010 జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు.

సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో ప్రభుత్వ విప్‌గా కొనసాగారు. అయితే 2018 ఎన్నికల్లో ఆయనను కాదని అప్పటి పెద్దపల్లి ఎంపీ, ఇప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ టికెట్‌ను కేటాయించడంతో ఆయన నిస్తేజానికి గురయ్యారు. అప్పటి నుంచి తనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతూ అవమానాలకు గురి చేస్తున్నాడని అసహనంతో రగిలిపోతూ వస్తున్నారు.

గత యేడాది అసంతృప్తితో పార్టీని వీడి తన సతీమణి జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మితో సహా కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే కాంగ్రెస్‌లో ఎక్కువకాలం కొనసాగ లేకపోయారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ సాగర్ రావుతో పొసగలేక తిరిగి సొంత గూటికి చేరారు. తన సతీమణి నల్లాల భాగ్యలక్ష్మికి బీఆర్ఎస్ అధిష్టానం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కట్టబెట్టి ప్రాధాన్యత నిచ్చినప్పటికీ ప్రోటోకాల్ పదవులు సిట్టింగ్ ఎమ్మెల్యే సుమన్ తనకు రాకుండా చేస్తున్నారనే అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయనలో ఉన్న అసంతృప్తిని పోగొట్టేందుకు బాల్క సుమన్ ప్రయత్నాలు చేసినా మౌనం వహిస్తూ వచ్చారని ఆయన అనుచరులు అంటున్నారు.

టికెట్ హామీతోనే వెళ్లారా..?

రానున్న ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ హామీతోనే ఆ పార్టీలోకి వెళ్లారా, లేదా ఇతర పదవుల హామీతో వెళ్లారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ రేసులో కాంగ్రెస్ నాయకులు నూకల రమేష్, దుర్గం భాస్కర్, డాక్టర్ రాజా రమేష్, దాసరపు శ్రీనివాస్, రామిల్ల రాధిక తదితరులు పోటీపడుతున్నారు. అయితే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న పలువురి పేర్లను ఇప్పటికే పార్టీ అధిష్టానం ఢిల్లీలోని స్క్రీనింగ్ కమిటీకి పంపించి అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు మొదలుపెట్టింది.

స్క్రీనింగ్ కమిటీకి వెళ్లిన పేర్లలో నుంచి కాదని కొత్తగా చేరిన నల్లాల ఓదెలుకు పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదా అనే విషయం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. కాగా, వచ్చే ఎన్నికల ద్వారా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల కోరిక మేరకు తాను కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన తెలిపారు. ఏదేమైనా ఓదెలు కాంగ్రెస్‌లో చేరికతో చెన్నూర్‌లో రానున్న ఎన్నికల పోరు ఆసక్తి రేపునుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed