ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగేనా మాట్లాడేది: శ్రీనివాస్ గౌడ్

by GSrikanth |
ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగేనా మాట్లాడేది: శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతీది విమర్శ చేయడం, నిందలు మోపడం కాదు.. రైతుల కష్టాలపై దృష్టి సారించాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షం అంటే ఖాళీగా కూర్చోవడం కాదని, ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడమే లక్ష్యం అన్నారు. రైతు సమస్యలను తెలుసుకునేందుకు ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు కేసీఆర్ కాలుపెట్టగానే కాంగ్రెస్‌కు ఎందుకంతా ఉలిక్కి పాటు అని ప్రశ్నించారు. మంత్రులు, అధికారుల బృందం వెళ్లి వాస్తవాలు ఏమిటో చెప్పాలని సూచించారు. ఎండిన పంటపొలాలు ఎక్కడున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలని సూచించారు. పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి.. కానీ, ప్రశ్నించడమే పాపం అన్నట్లు వ్యవహరించడం తగదన్నారు.

ఢిఫెన్స్‌లో పనిచేసిన వ్యక్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకుంటుందని ఉత్తమ్ వ్యాఖ్యలను ఖండించారు. దేశంలో కాంగ్రెస్‌కు ఎన్నిసీట్లు వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయపార్టీగా తక్కువ సీట్లు వస్తే మూతపడినట్లేనా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కరెంటుకోతలు, తాగునీటిపై సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. రండి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పంటలను పరిశీలించి మార్గాలను అన్వేషిద్దామన్నారు. నాలుగునెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ప్రాజెక్టులను సందర్శించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను ఎప్పటివరకు పూర్తి చేస్తారో క్లారిటీ ఇవ్వాలన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయొద్దన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొట్టుకపోతాయి.. అయినంత మాత్రానా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు జరిగితే ఎల్అండ్‌టీ కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్ల వల్ల, అధికారుల వల్ల నష్టం జరిగితే జరగొచ్చు అని, అలాగే వదిలితే నష్టం జరుగుతుందన్నారు. ఎవరి తప్పని కాలయాపన చేసి ప్రజలకు నష్టం చేయొద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు. రెండు సీట్లు ఉన్న బీజేపీ దేశంలో అధికారంలోకి రాలేదా? అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో, రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఏందో తెలుస్తుందన్నారు. సీట్లు ముఖ్యం కాదని, ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యమన్నారు.

తప్పుడు ప్రకటనలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దని సూచించారు. ప్రతిపక్ష నేతలను వేధించడం, కేసులు పెట్టడం సరికాదని, ప్రజలు హర్షించరన్నారు. పాలనపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రధానప్రతిపక్షంగా ప్రజల వద్దకు వెళ్తాం.. ప్రజాపక్షాన ఉంటామన్నారు. అధికారులను భయపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పులుజరిగితే విచారణ చేసుకోవాలని, లోపాలు జరిగితే సరిదిద్దాలని సూచించారు. ప్రాజెక్టులు నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యంతో ఇవ్వడం లేదని మండిపడ్డారు. అధికార, ప్రతిపక్షాల మధ్య రైతులు నలిగిపోవద్దని సూచించారు. నాయకులు పార్టీ మారినంత మాత్రానా పార్టీ పోదని, యువనాయకత్వం తయారవుతుందన్నారు.

Advertisement

Next Story