Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ట్వీట్

by Anjali |
Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని సోషల్ మీడియా వేదికన ఫైర్ అయ్యారు. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు 10 వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శమని నొక్కి చెప్పారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టిందని మరోసారి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మంజూరైన అనేక పనులను నిలిపివేయడంతో పాటు, ఇప్పటికే ప్రారంభమైన అనేక పనులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించొద్దని, మధ్యంతరంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చిందని ధ్వజమెత్తారు. దాదాపు పూర్తి కావొస్తున్న ప్రాజెక్టులకు సైతం బిల్లుల చెల్లింపులు నిలిపివేసిందని మండిపడ్డారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్, మున్సిపల్, రోడ్లు-భవనాలు, నీటిపారుదల తదితర శాఖలపరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు.

ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియకు ఆటంకం కలిగిందని తెలిపారు. దీంతో ఎంతో మంది ఉపాధి కూడా కోల్పోతున్నారని వెల్లడించారు. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక అజెండాతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నదని ఓ రేంజ్‌లో విరుచుపడ్డారు. ఈ ప్రభుత్వానికి కొత్త పనులను చేపట్టే శక్తిసామర్థ్యాలు లేవని ఇప్పటికే తేలిపోగా, మంజూరైన పనులను పూర్తి చేసే కనీస నైతిక బాధ్యత కూడా లేదని పనుల రద్దుతో స్పష్టమైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. అభివృద్ది నిరోధకులుగా ముఖ్యమంత్రి వ్యవరిస్తున్నారన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గాలకు కేటాయించిన ఎస్డీఎఫ్ నిధులను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందని తెలిపారు. అయితే ఈ నిధుల నుండే మార్చి నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు 10 కోట్ల చొప్పున మంజూరు చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు ఇచ్చి తన కురచ బుద్ధిని, పక్షపాత ధోరణిని చూపిందని, కాంగ్రెస్ పార్టీ గెలవని నియోజకవర్గాలపై కక్షతో ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం దుర్మార్గమని అన్నారు. నిధులు కేటాయించకపోగా పురోగతిలో ఉన్న పనులకు సైతం నిధులు నిలిపివేయడం మరో దుర్మార్గమని అన్నారు.

ఇప్పటివరకు రద్దు చేసిన ఎస్డీఎఫ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రాష్ట్రస్థాయిలో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు సైతం రద్దు చేసిన పనులకు సంబంధించి ఎలాంటి సమీక్షా జరపలేదు. కనీసం పురోగతిలో ఉన్న పనుల నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంలో విఫలమయ్యాయని చెప్పారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో ప్రజల అవసరాలు మారవని, మారేది కేవలం ప్రభుత్వాలు మాత్రమేనని గుర్తు చేశారు. గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన అనాలోచిత చర్యలతో తన ఆనవాలునే ప్రజల్లో లేకుండా చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. గత ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ అవి ప్రజల అవసరాల కోసమే కాబట్టి ఆ పనులను పూర్తి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story