TGDRF: వరదలను ఎదుర్కొనేలా తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు: సీఎం

by Prasad Jukanti |   ( Updated:2024-09-02 15:22:01.0  )
TGDRF: వరదలను ఎదుర్కొనేలా తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు: సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: భవిష్యత్ లో తెలంగాణలో సంభవించబోయే భారీ వర్షాలు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (టీజీడీఆర్ఎఫ్) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై సోమవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్తు సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి నష్టాలను నివారించాలని చెప్పారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వాగులు, వంకలు పొర్లుతున్న దృష్ట్యా దెబ్బతిన్న రోడ్లు, వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు బృందాలుగా ఏర్పడి అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రాత్రికి ఖమ్మంలోనే సీఎం బస:

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఇవాళ హైదరాబాద్ లో అధికారులతో సమీక్ష అనంతరం అయన రోడ్డు మార్గంలో కోదాడకు బయలుదేరారు. అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్తారు. అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఖమ్మంలోనే బస చేయనున్నారు. రేపు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed