Floods: వానలు ఆగాలని రెండు ప్రదక్షిణలు ఎక్స్‌ట్రా.. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుల నిర్ణయం

by Ramesh Goud |
Floods: వానలు ఆగాలని రెండు ప్రదక్షిణలు ఎక్స్‌ట్రా.. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుల నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వానలు ఆగాలని కోరుకుంటూ భక్తులు మరో రెండు ప్రదక్షిణలు చేయాలని చిలుకూరు బాలాజీ అర్చకులు కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. దీనికోసం వరుణుడు శాంతించి వర్షాలు ఆగాలని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వరుణుడు శాంతించాలని కోరుకుంటూ రెండు ప్రదక్షిణలు ఎక్కువగా చేయాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు. అలాగే వరద సహాయానికి అన్ని విధాలుగా సహకరించిన ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించారు.

దీనిపై ఆలయ పూజారి సిఎస్ రంగరాజన్ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు వరుణదేవుని ఉగ్రతను ఎదుర్కొన్నాయని, ఇటువంటి విపత్కర పరిస్థితులలో చిల్కూరు బాలాజీ మళ్లీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మనల్ని మరింత విధ్వంసం నుండి రక్షించాలని ప్రార్థించడం జరిగిందన్నారు. తుఫాన్, రాబోయే ప్రమాదం నుండి మరింత వర్షాలు పడకుండా జల ప్రళయం కలగకుండా సుదర్శన అష్టకం పఠించడంతో పాటు గోవింద నామస్మరణతో శక్తివంతమైన ప్రదక్షిణలు చిలుకూరులో నిర్వహించామని, సకల జీవుల భద్రత కోసం ప్రార్థనలు చేశామని చెప్పారు. వరదలు, విధ్వంసం, అనారోగ్యం, గాయం, విపత్తు మరియు ఆకస్మిక మరణాల నుండి రక్షణ కోసం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సంక్షోభ సమయంలో గోవింద నామస్మరణతో కూడిన ప్రదక్షిణం నిర్వహించడాన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సత్వర సహాయం కోసం విరివిగా విరాళాలు అందించాలని కోరారు.

Advertisement

Next Story