- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్: రాష్ట్రంలో ఫీవర్ ‘‘ఫియర్’’.. ఆసుపత్రులకు క్యూ కడుతోన్న పేషెంట్స్..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున ప్రతి ఇంట్లో దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పుల లాంటి ఏదో ఒక లక్షణం ఎవరో ఒకరిలో కచ్చితంగా ఉంటున్నది. కనీసం నాలుగు రోజులు వరకు లక్షణాలు తగ్గట్లేదని బాధితులు చెబుతున్నారు. గడిచిన పది రోజులుగా వాతావరణ మార్పులతో బాధితుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఫీవర్, ఉస్మానియా, గాంధీతో పాటు బస్తీ దవాఖాన్లు, పల్లె దవాఖాన్లకు పేషెంట్లు క్యూ కడుతున్నారు.
సాధారణ రోజుల్లో ఫీవర్ ఆస్పత్రిలో సుమారు 400 ఓపీ ఉండగా, గత వారం రోజుల నుంచి సగటును 800 మంది వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు ఉస్మానియాలోనూ ఓపీ పెరిగింది. ప్రయివేట్ క్లీనిక్‌లు, పీహెచ్‌సీల్లోనూ బాధితులు జ్వర లక్షణాలతో క్యూ కడుతున్నారు. సాధారణ రోజుల్లో పీహెచ్‌సీలకు కనీసం 50 నుంచి 60 మంది పేషెంట్లు వస్తుండగా.. ఇప్పుడు 100కు తగ్గకుండా వస్తున్నారని మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నది.
4 రోజులు మెడిసిన్స్..
జ్వరం, దగ్గు, నీరసం, జలుబు, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్‌కు మొదట నాలుగు రోజులకు మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత తగ్గకుండా ఉంటే ఆస్పత్రికి మరోసారి రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రెండోసారి వచ్చిన పేషెంట్లకు బ్లడ్ టెస్టులకు రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో శాంపిళ్లు సేకరించి టీ –డయాగ్నస్టిక్ కేంద్రాలకు పంపుతున్నారు. సాధారణ రోజుల్లో 24 గంటల నుంచి 48 గంటల్లో రిపోర్టులు వచ్చేవి. కానీ ఇప్పుడు టెస్టింగ్ కేంద్రాలకు శాంపిళ్ల లోడ్ పెరగడంతో మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని స్వయంగా డాక్టర్లు పేర్కొంటున్నారు. అప్పటి వరకు కొన్ని చోట్ల వైద్యసేవల్లో జాప్యం జరుగుతున్నదని పేషెంట్లు ఆరోపిస్తున్నారు.
మలేరియా, డెంగ్యూ తక్కువే..
సాధారణంగా మలేరియా, డెంగ్యూ విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ సీజనల్ మార్పులతో ఈ సారి ఫ్లూ లక్షణాలతో కూడా ఫీవర్లు పెరుగుతున్నాయి. కొందరికి వారం రోజుల లోపు తగ్గుతుండగా, మరి కొందరికి నెల రోజులైనా తగ్గడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. అయితే సీజనల్ మార్పులతో వచ్చే జ్వరాలతో ఎలాంటి టెన్షన్ లేదని డాక్టర్లు చెబుతున్నారు. లక్షణాలను బట్టి డాక్టర్లు సూచించిన మెడిసిన్స్ వాడితే సరిపోతుందంటున్నారు. ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం మళ్లీ చలి ఇలా విభిన్న వాతారణ పరిస్థితులతోనూ ప్లూ సింప్టమ్స్‌తో కూడిన జ్వరాలు వేధిస్తున్నట్లు డాక్టర్లు వివరిస్తున్నారు.
డీసీజ్ కమిటీలు ఏం చేస్తున్నాయి..?
సీజనల్ మార్పులతో వచ్చే రోగాలు, ఇతర అరుదైన వ్యాధులు ప్రబలుతున్న సమయంలో డీసీజ్ కమిటీలు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. జిల్లాకో కమిటీ ఉన్నది. వ్యాధులు ప్రబలుతున్న ఏరియాని ఎంపిక చేసి, అక్కడ టీమ్‌ల వారీగా ఏర్పడి తొలుత ఫీవర్ సర్వే నిర్వహించాలి. ఆ తర్వాత ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టు(ఆర్డీఎస్) కిట్లను అందుబాటులో ఉంచుతారు. పీహెచ్ సీ కేంద్రంగా ర్యాండమ్‌గా అందరికీ టెస్టులు చేయాలి. వైరల్, మలేరియా, టైఫాయిడ్, స్వైన్ ప్లూ తదితర పరీక్షలు పూర్తి చేయాలి.
ఇక హై రిస్క్ఏరియాల్లో ఇండోర్ రెసిడ్యూయల్ స్ప్రే చేయిస్తారు. ఈ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి దోమ తెర, మందులు అందిస్తారు. అంతేగాక స్థానికంగా ఉండే వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖలతో కలిసి యాంటీలార్వ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీన్ని ఆశాలు, ఏఎన్ఎంలు కో ఆర్డినేటింగ్ చేయనున్నారు. ఏ వ్యాధులు పాజిటివ్ తేలినా పీహెచ్‌సీలో నే పూర్తి వైద్యం అందించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో జ్వర బాధితులు సంఖ్య పెరుగుతున్నా.. డిసీజ్ కమిటీలు ఏం చేస్తున్నాయనేది ఎవరికీ అర్థం కావడం లేదనే విమర్శలు స్వయంగా వైద్యశాఖ నుంచే వస్తున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -డాక్టర్ అన్వేష్
వాతావరణ మార్పుల సమయంలో ప్లూ ఫీవర్లు రావడం సహజమే. కానీ గతంతో పోల్చితే ఈ సారి ఎక్కువ రోజులు ఉంటున్నది. కరోనా తర్వాత జనాల్లో ఇమ్యూనిటీ తగ్గడం వలనే ఇలాంటి పరిస్థితి ఉన్నది. దగ్గు ఎక్కువ రోజులు ఉంటుంది. డాక్టర్లను సంప్రదించి మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. అన్ని ఆస్పత్రుల్లోనూ జ్వరాలతో పేషెంట్లు క్యూ కడుతున్నారు. మరో వారం పాటు ఇలాంటి పరిస్థితి ఉండే చాన్స్ ఉన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.