నష్టపరిహారం ప్రకటిస్తారా.. ఇక్కడే చావమంటారా? హైవే ఎక్కిన రైతులు

by Nagaya |
నష్టపరిహారం ప్రకటిస్తారా.. ఇక్కడే చావమంటారా? హైవే ఎక్కిన రైతులు
X

దిశ, భిక్కనూరు : వడగండ్ల వానతో పంట దెబ్బతిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తుందా లేక ఇక్కడే చావమంటారా అంటూ రైతులు హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ శివారులోని హైవేపై మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నాలుగు రోజుల క్రితం వడగళ్ల వానతో చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతింటే, అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేయలేకపోగా, పరిహారం కూడా ప్రకటించరా...? రైతులంటే అంత అలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ శాఖ ఏడీఏ అపర్ణ, ఏవో రాధా, తహసీల్దార్ కె.శివప్రసాద్ రైతులను సముదాయించే ప్రయత్నం చేస్తూ.. పంట నష్టాన్ని అంచనా వేశామని, నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపామని చెప్పారు. దీంతో రైతులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఏ గ్రామానికి ఎప్పుడు వచ్చారంటూ గట్టిగా నిలదీశారు. రైతులంటే అంత చిన్న చూపా..? అని ప్రశ్నించారు. మా బాధ మీకు అర్థం కావడం లేదని పెట్టుబడితో పాటు, చేసిన కష్టం పూర్తిగా కోల్పోయి రోడ్డున పడ్డామని, మమ్మల్ని ఎవరు ఆదుకోవాలంటూ వాగ్వాదానికి దిగారు. నెల కాగానే మీకు జీతం వస్తుంది. మాకు అలా జీతాలు రావు కదా అంటూ మండిపడ్డారు. పరిహారం ప్రకటించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తెల్చి చెప్పారు.

దీంతో హైవేపై గంటన్నరకు పైగా ఆందోళన కొనసాగిస్తున్నారు. పడిపోయిన మక్కా, కర్బూజా, మామిడి వరి పంటలను రోడ్డుపైకి తెచ్చి అధికారుల చూపిస్తూ ఇది మా నష్టం.. ఇది మా ఆవేదన.. ఇది మా గోష అంటూ.ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి రావాలని నష్టపరిహారం ప్రకటించాలని అప్పటివరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీస్మించుకొని కూర్చున్నారు. కామారెడ్డి డీఎస్పీ డి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఎంత నచ్చజెప్పినా రైతులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ మొండికేస్తున్నారు. గంటన్నరకు పైగా రాస్తారోకో జరుగుతుండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులు మాత్రం ఆందోళనను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed