క్రమబద్ధీకరణ ఫీజు పెంపునకు కసరత్తు.. 'దిశ' కథనంపై అధికారుల చర్చ

by Vinod kumar |
క్రమబద్ధీకరణ ఫీజు పెంపునకు కసరత్తు.. దిశ కథనంపై అధికారుల చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సామాన్యలు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ఫీజుల అంశం గందరగోళంగా మారింది. ఏ ప్రాతిపదికన లెక్కలు వేస్తున్నారో అంతుచిక్కడం లేదు. 2014 మార్కెట్ విలువలకు బదులుగా సొంత లెక్కలు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫీజులపై విమర్శలు తలెత్తుతున్న నేపధ్యంలో రెవెన్యూ శాఖ పునరాలోచనలో పడింది. ఎలాగూ ఖజానాకు భారీగా రాబడిని తెచ్చి పెట్టే స్కీం ద్వారా మరింత సంపాదించేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

విమర్శలకు తావివ్వకుండా జీవో 59 ని సవరించే యోచన చేస్తున్నారు. 'అంతా ఆన్ లైన్.. మాకేం తెలియదు. జీవో 59 దరఖాస్తుల పై అధికారుల సమాధానం' అంటూ స్థలాల క్రమబద్ధీకరణలో సర్కారు దోపిడీపై 'దిశ' సోమవారం కథనాన్ని ప్రచురించింది. సిస్టం జనరేటెడ్ పేరిట కొత్త మార్కెట్ విలువలతో ఫీజులను విధిస్తూ పంపిస్తున్న నోటీసులతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న అంశంపై సాక్ష్యాధారాలతో సహా ఇచ్చాం. దీనికి స్పందించిన ప్రభుత్వం ఫీజుల పెంపు వైపే మొగ్గు చూపింది. జీవో 59 లో పేర్కొన్న 2014 నాటి మార్కెట్ విలువల ఆధారంగా కాకుండా ప్రస్తుత విలువలతో లెక్కించేటట్లుగా నిర్ణయం తీసుకోనుంది.

ఇప్పటికే సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సమీక్షించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు లేదా సర్క్యులర్ జారీ చేయనున్నట్లు తెలిసింది. స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియతో రూ.వేల కోట్లు మూటగట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఐతే ప్రస్తుత మార్కెట్ విలువల కంటే అత్యధికంగా ఫీజులు లెక్కించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా నిర్మాణం జరిపిన స్థలానికి తోడు, ఖాళీగా ఉన్న చిన్న పాటి స్థలానికి కూడా రెగ్యులరైజేషన్ కు వసూళ్ల పర్వాన్ని మొదలు పెట్టడం వల్ల ఫీజు మొత్తం భారీగా పెరిగిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల పరిశీలన రెవెన్యూ అధికారులతో చేయించలేదు. ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారుల చేత చేయించడం వల్ల అవగాహనారాహిత్యం కొట్టొచ్చినట్లుగా కనిపించిందంటున్నారు. గతంలో మాదిరిగా కాకుండా చిన్న పాటి స్థలాల్లోనూ నిర్మాణం, ఖాళీ జాగ.. వేర్వేరుగా లెక్కలు వేశారని సమాచారం.

49 గజాలకు రూ.17 లక్షలు

ప్రభుత్వం ఇష్టారాజ్యంగా సామాన్యుల నుంచి వసూలు చేసేందుకు యత్నిస్తున్నది. 125 గజాల వరకు ఉచితంగానే క్రమబద్ధీకరించనున్నట్లు జీవో 58 స్పష్టం చేస్తున్నది. కొందరు అమాయకులు మీ సేవా కేంద్రానికి వెళ్తే వాళ్లకు నచ్చినట్లుగా దరఖాస్తు చేశారు. 125 గజాల కంటే తక్కువ స్థలాలను కూడా జీవో 59 కింద దరఖాస్తు చేశారు. అదే అదనుగా భావించిన రెవెన్యూ యేతర అధికారులు పరిశీలించి పెద్ద మొత్తంలో పెనాల్టీ వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. హైదరాబాద్​దిల్ సుఖ్ నగర్ దగ్గర మూసీ పక్కన ఓ కుటుంబానికి ఎన్నో ఏండ్ల నుంచి కొంత జాగ ఉన్నది. అది ప్రభుత్వానికి తెలిసిన తర్వాత క్రమబద్ధీకరించేందుకు అప్లై చేశారు.

కొలతలు వేస్తే 49 గజాలుగా తేలింది. దానికి గాను క్రమబద్ధీకరణ ఫీజు రూ.17,03,400లుగా వేసి నోటీసులు జారీ చేశారు. ఇదేమని అడిగితే అదంతే? కట్టండి. లేకపోతే రెగ్యులరైజ్ చేయలేం అని అధికారులు చెప్పారు. దీంతో కలెక్టరేట్ కి వెళ్లి మొర పెట్టుకుంటే ఓ దరఖాస్తు సమర్పించండి. ప్రభుత్వానికి పంపిస్తాం. అక్కడి నుంచి వచ్చే రిప్లై ని బట్టి ఫీజు ఉంటుందన్నారు. ఏ ప్రాతిపదికన చూసినా 49 గజాలకు అంత పెద్ద మొత్తంలో పెనాల్టీ రాదు. ఇంతకీ లెక్కలు వేసిన ఆ అధికారులెవరో, ఏ డేటా, ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం నోటీసులు జారీ చేశారో అంతుచిక్కడం లేదు. ఇలాంటి అనేక విమర్శల నుంచి తప్పించుకునేందుకు ప్రస్తుత మార్కెట్ విలువల ఆధారంగానే క్రమబద్ధీకరణ ఫీజులను విధించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

జీవో 59 ప్రకారం..

250 గజాల్లోపు స్థలం: 2014 జూన్ 2 నాటి మార్కెట్ విలువలో 50 శాతం సొమ్ము చెల్లించాలి.

500 గజాలలోపు స్థలం: 2014 జూన్ 2 నాటి మార్కెట్ విలువలో 75 శాతం చెల్లించాలి.

500 గజాలకు పైగా స్థలం: 2014 జూన్ 2 నాటి మార్కెట్ విలువలో 100 శాతం చెల్లించాలి.

కానీ ప్రస్తుతం ఇష్టారాజ్యంగా పెనాల్టీలు వేశారు. దీనికి పరిష్కారంగా చేర్పులు మార్పులు చేయనున్నారు.

Advertisement

Next Story