మాజీ మంత్రి జూపల్లి చేరికకు ముహూర్తం ఫిక్స్

by Rajesh |   ( Updated:2023-05-05 01:54:51.0  )
మాజీ మంత్రి జూపల్లి చేరికకు ముహూర్తం ఫిక్స్
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున తాను ఎంచుకున్న పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. తెలంగాణ కల సాకారం అయిన రోజునే శుభదినంగా భావించి రాజకీయంగా మరింత వేగంగా అడుగులు ముందుకు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూపల్లి ఏ పార్టీలో చేరినా కొల్లాపూర్ నియోజకవర్గంలో విజయం సాధించడంతో పాటు మరికొన్ని నియోజకవర్గాలలోనూ ఆయన ప్రభావం ఉంటుందని జాతీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్ర నాయకులు తరచూ జూపల్లితో సంప్రదింపులు జరుపుతున్నారు.

అయితే ఇప్పుడేమి చెప్పలేనని, పరిస్థితులను బట్టి ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటానని అగ్ర నాయకులకు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జూపల్లి తన అనుచర వర్గంతో పాటు వనపర్తి జిల్లాలో బహిష్కరణకు గురైన జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎంపీపీలు మెగా రెడ్డి, కిచ్చారెడ్డిలతో కలిసి ఏదో ఒక పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే.

అధికార పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా...

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీలోనే ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తూ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే తన క్యాడర్ దెబ్బతినకుండా కాపాడుకుంటూ వచ్చారు. చివరకు పొంగులేటితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తదితరులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం జూపల్లిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ క్రమంలో జూపల్లి ఏ పార్టీలో చేరాలి అనే అంశంపై తక్షణ నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు.

అన్ని మండల కేంద్రాలలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి ఏ పార్టీలో చేరాలి అన్న అంశాలపై అభిప్రాయాలను సేకరించడంతో పాటు... ఏ పార్టీలో చేరిన మేము మీ వెంటే ఉంటాము అని జూపల్లికి భరోసా ఇచ్చారు. అప్పటినుంచి జూపల్లి కృష్ణారావు, ఆయన అనుచర వర్గం బీజేపీలో చేరతారని... కాదు కాదు కాంగ్రెస్‌లో చేరతారు అంటూ ప్రచారం జరిగింది. దీనికి తోడు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నాయకులు సైతం జూపల్లితో సంప్రదింపులు జరిపారు. జూపల్లి ఏ పార్టీలో చేరిన కొల్లాపూర్ నియోజకవర్గంలో విజయం సాధించడంతోపాటు మరికొన్ని నియోజకవర్గాలలోనూ ఆయన ప్రభావం ఉంటుందన్న నమ్మకంతో జాతీయ పార్టీలు రెండు ఆయనను తమ తమ పార్టీలలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు సాగించారు.

కానీ ఎక్కడ కూడా జూపల్లి ఫలన పార్టీలో చేరుతున్నాం అన్న విషయాన్ని బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఆయన ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తారని కూడా ఆయన అనుచరులలో కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ ఆయన స్వతంత్రుడిగా ఉంటే ఆయన ప్రభావం కేవలం కొల్లాపూర్ వరకే పరిమితమై ఉంటుందని, మిగతా నియోజకవర్గాలపై ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పైగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలంటే ఏదైనా ఒక పార్టీలో చేరాల్సిందే అన్న నిర్ణయంతో ఆయన వచ్చారని సమాచారం. దాదాపుగా నెల రోజులు దాటిపోతున్నా నేటికీ ఏ పార్టీలో చేరాలి అన్న నిర్ణయాన్ని తీసుకోకపోవడం వల్ల పార్టీ శ్రేణులలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

కొలిక్కిరాని బీజేపీ నేతల భేటీ

ఖమ్మంలో బుధవారం బీజేపీ చేరికల కమిటీ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు భారతీయ జనతా పార్టీలో చేరాలని సంప్రదింపులు జరిపారు. బీజేపీ నాయకులు చెప్పిన మాటలను విని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తామూ నిర్ణయించుకోవడానికి ఇంకా కొంత సమయం కావాలని చెప్పినట్లు సమాచారం. అధికార బీఆర్ఎస్‌ను ఓడించడమే తమ లక్ష్యమని ఇరువురు నేతలు బీజేపీ నేతలకు చెప్పినట్లు సమాచారం. కొంతమంది కాంగ్రెస్, కొంతమంది బీజేపీలో చేరితే ఓట్లు చీలి మళ్లీ అధికార పార్టీకే అవకాశం వస్తుంది. ఆ అవకాశం లేకుండా పరిస్థితులను బట్టి ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని జూపల్లి, పొంగులేటి బీజేపీ నేతలకు చెప్పినట్లు సమాచారం. నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది.

జూన్ 2న ఉత్కంఠకు తెర

రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జూపల్లి కృష్ణారావు ఎంచుకున్న పార్టీలో చేరడానికి ముహూర్తాన్ని నిర్ణయించినట్లు సమాచారం. తన అనుచర వర్గంతో పాటు వనపర్తి జిల్లాలో బహిష్కరణకు గురైన జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, ఎంపీపీలు మెగా రెడ్డి, కిచ్చారెడ్డి సైతం జూపల్లి‌తో పాటు చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ రెండవ తేదీకి ముందు నాలుగైదు రోజులు ముందుగానే ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఉత్కంఠకు తెరపడాలంటే ఈ నెలాఖరు వరకు ఆగవలసిందే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కర్ణాటక ఫలితాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు

కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనే పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.. ఆ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఎటోచ్చి తీసుకునే నిర్ణయం అధికార బీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసేదిగా ఉండాలని ఇరువురు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీలో చేరాలి అనే అంశం తేలేలోపు మరి కొంతమంది ముఖ్య నాయకులు కార్యకర్తలతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి తమ వెంట నడిచేలా సన్నద్ధం చేసేందుకు ఇరువురు నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story