Harish Rao : ఇప్పటికైనా పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ఆపాలి : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : ఇప్పటికైనా పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ఆపాలి : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : వికారాబాద్(Vikarabad) రైతుల, ప్రజల ఆగ్రహం చూశాకైనా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పచ్చని పొలాల్లో ఫార్మా కంపనీల ఏర్పాటు ఆలోచన విరమించుకోవాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. వికారాబాద్ లగచర్ల గ్రామంలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటన వీడియోను ఎక్స్ లో పోస్టు చేసిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పాలన విధానాలపై మండిపడ్డారు. గరీబి హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుండి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని విమర్శించారు. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని, ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడిందన్నారు. అందుకే రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారన్నారు. రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఎఎస్ లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారని ఆరోపించారు.

ఫార్మా సిటీ కోసం కేసీఆర్ హైద్రాబాద్ కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్దం చేశాడని, పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు బెడుతున్నాడని దుయ్యబట్టారు. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని, ఫార్మసిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందని హరీష్ రావు ఆరోపించారు. నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed