ధాన్యం తడిచినా ఎంఎస్‌పీకే కొనుగోలు చేస్తాం: పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్

by Disha Web Desk 1 |
ధాన్యం తడిచినా ఎంఎస్‌పీకే కొనుగోలు చేస్తాం: పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అకాల వర్షాలతో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లు తడిచిపోయాయని, వీటిని కొనడానికి ఐకేపీ సిబ్బంది నిరాకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టిన పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ జగిత్యాలలోని రామన్నపేట, గంగాధర, కొత్తపల్లి, మల్యాల కేంద్రాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల సమస్యలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నదని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగిన ప్రత్యామ్నాయాలను చేపడుతుందన్నారు. తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తేమ పేరుతో కోత పెట్టే అవకాశమే లేదని, ఎంఎస్పీ (కనీస గిట్టుబాటు ధర)కే కొంటుందని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న భరోసా కల్పించారు.

పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న డీఎస్ చౌహాన్... ఇకపైన ప్రతీ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం విక్రయాలపై తనిఖీలు చేయడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నామినేట్ చేయనున్నామని, ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి, గంగాధర, జగిత్యాల జిల్లాలోని రామన్నపేట, మల్యాల, సిరిసిల్ల జిల్లాలోని అంకిరెడ్డిపల్లి, జిల్లెల్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆ తర్వాత జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి ధాన్యం కొనుగోలు విధానంపై స్పష్టత ఇచ్చారు. కొనుగోలు వ్యవస్థ ద్వారా రైతులు సరైన ప్రయోజనాలను పొందేలా, వ్యాపారుల చేతిలో మోసపోకుండా నిరోధించడానికి, అన్ని కొనుగోలు కేంద్రాల్లో తనిఖీల కోసం ప్రతీ మండలానికి ఒక జిల్లా అధికారిని నామినేట్ చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించినట్లు గుర్తుచేశారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందించనున్నట్లు డీఎస్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రమంతటా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో పౌరసరఫరాల శాఖ సీరియస్‌గా ఉన్నట్లు తెలిపారు. ప్రతికూల సమయాల్లో వారికి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు నొక్కిచెప్పారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ట్యాగ్ చేయబడిన రైస్ మిల్లులకు పొడి లేదా తడిసిన వరిని తక్షణమే బదిలీ చేయనున్నట్లు తెలిపారు.

Next Story