తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి కారణమదే.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-30 06:26:49.0  )
తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి కారణమదే.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేయ్య లేదని, కేసీఆర్ అహంకారం, కుటుంబ పాలన అంతం చేయాలని వేశారని మల్కాజ్ గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం బోయిన్‌పల్లిలో పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో లేదని.. కేంద్రంలోకి వెళ్లి కొట్లాడితే రూపాయి వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేయలేదని.. కేసీఆర్ అహంకారం, కుటుంబ పాలన.. చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని గ్రహించి కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని తెలిపారు.

కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని నాలుగున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ చేయలేకపోయారని గుర్తు చేశారు. రుణమాఫీ చేయకపోతే గ్రామాల్లోకి వెళ్తే రానివ్వరని భయంతో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న భూములు అమ్మి ఆ డబ్బులు తీసుకొని వచ్చి కడితే వడ్డీకి సరిపోయిందన్నారు. కానీ అసలు ఇంతవరకు బ్యాంకులకు చేరలేదన్నారు. లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేయలేకపోయారని అలాంటింది.. రేవంత్ రెడ్డి రెండు లక్షల కోట్ల విలువైన హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చుపెట్టగలగే శక్తి ఈ రాష్ట్ర ఖజానాలో లేదన్నారు.

మాజీ ఆర్థిక శాఖ మంత్రి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏ లంక బిందెలు అయితే ఉన్నాయి అనుకొని అధికారంలోకి వచ్చామో.. అదే లంకె బిందెలు తీసుకొచ్చి హామీలు నెరవేరుస్తామంటున్నారాని ఎద్దేవా చేశారు. 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ దేశం సురక్షితంగా, సుభిక్షంగా, ప్రపంచ చిత్రపటంలో ఆర్థికంగా ఎదగాలన్నా, ఈ దేశంలో ప్రశాంతత రావాలంటే మళ్లీ బిజెపి ప్రభుత్వమే అధికారంలో కి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు రాజేందర్ అన్నారు. పద్మశాలీల కోసం ఎన్ని హామీలు గతంలో ఉండేనో అవన్నీ రద్దు చేయబడినప్పుడు మళ్లీ ఆ హక్కులను కల్పించాలని చెప్పి త్రిఫ్ట్ ఫండ్ కోసం అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినట్లు చెప్పారు.

యాంత్రిక రంగం పెరిగిన తర్వాత మొట్టమొదట ఉపాధి కోల్పోయిన వృత్తి చేనేత వృత్తి అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా వారిని నేనే పిలిపించుకొని అనేక రాయితీలు ఎప్పటికప్పుడు ఇచ్చినట్లు తెలిపారు. రాబోయే కాలంలో మీకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని, పరిష్కారంలో మా పాత్ర ఉంటుందని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ సౌమ్యులు, ప్రేమను పంచేవారు, ఏ పని అయినా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేసేవారని తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తప్పకుండా రెండు ఓట్లు (ఎమ్మెల్యే, ఎంపీ) బిజెపికి వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈటల విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బానుక మల్లికార్జున్, పిట్ల నగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed