ఒకే సమావేశంలో బండి, ఈటల.. కారణమిదే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-01 09:55:06.0  )
ఒకే సమావేశంలో బండి, ఈటల.. కారణమిదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ సభ ఫైనల్ కావడంతో దాన్ని గ్రాండ్‌గా నిర్వహించి సక్సెస్ చేయడంపై బీజేపీ రాష్ట్ర యూనిట్ కసరత్తు మొదలుపెట్టింది. రైల్వే సహా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు ప్రధాని చేతుల మీదుగా జూలై 8న జరగనున్నాయి. వివిధ విభాగాలు ప్రోగ్రామ్ షెడ్యూలులో బిజీగా ఉన్నాయి.

ఇటీవల రాష్ట్రంలో బీజేపీ ప్రభావం తగ్గిపోయిందనే అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పాల్గొనే సభకు ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆయనపైన తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కలిసి వరంగల్‌లో ఆదివారం సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సభ సక్సెస్ చేయడంపైనా, సభకు చేయాల్సిన ఏర్పాట్లపైనా, జన సమీకరణపైనా వీరు చర్చించనున్నారు.

మోడీ సభకు సన్నాహక సమావేశంగా జరుగుతున్నందున పొరుగు జిల్లాల నుంచి జనాన్ని సమీకరించడం, మరోసారి ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని బీజేపీ స్టేట్ యూనిట్ భావిస్తున్నది. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనను మార్చే అవకాశముందని, ఈ నెల 3న ఢిల్లీలో జరిగే కీలక సమావేశంలో నిర్ణయం జరుగుతుందని వార్తలు వెలువడుతున్న సమయంలో పార్టీ స్టేట్ చీఫ్‌గా ఆయన అధ్యక్షతన సన్నాహక సమావేశం జరుగుతుండడం గమనార్హం.

ముగ్గురు నేతలతో పాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల పార్టీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎడమొహం, పెడమొహంగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒకే వేదిక మీదకు హాజరుకావడంపై పార్టీలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ప్రధాని మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున మండల స్థాయి పార్టీ లీడర్లనూ ఈ సమావేశానికి స్టేట్ ఆఫీస్ ఆహ్వానించింది.

Read more : అధ్యక్షుడిగా బండిని తొలగిస్తే.. బీజేపీలో ఉన్నవాళ్లు కూడా పోతారు: విజయరామారావు సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed