Eatala : పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలి.. ఎంపీ ఈటల డిమాండ్

by Ramesh N |   ( Updated:2024-12-01 08:44:26.0  )
Eatala : పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలి.. ఎంపీ ఈటల డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ కిష్టన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మన ముదిరాజ్ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడు పోలీసు కిష్టయ్యకు ఇవాళ అసెంబ్లీ ముందున్న గన్‌పార్క్ అమరుల స్తూపం వద్ద ఈటల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడు పోలీసు కిష్టయ్య అని, 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ జాతి విముక్తి కోసం తన ప్రాణాలను అర్పించారని వివరించారు. అమరవీరుల త్యాగాలను స్మరించడం అంటే వారి ఆశయాలను కొనసాగించడమేనని, వారి ఆశయ సాధనకు ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వాలు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

వారి కుటుంబాలకు ఉద్యోగాలు, ఇల్లు నిర్మించి ఇవ్వాలి, నెలవారి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పోలీస్ కిష్టన్న విగ్రహం ఏర్పాటు చేసి.. జయంతి వర్ధంతి ఉత్సవాలు గొప్పగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా, కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్‌ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం అమరుడయ్యాడు. 1 డిసెంబర్ 2009న కామారెడ్డి పట్టణం నడిబొడ్డున తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు.

Advertisement

Next Story