Drugs Gang: ప్లీజ్ అర్థం చేసుకోండి.. హైదరాబాద్ కు రాలేము.. జంకుతున్న డ్రగ్స్ ముఠా!

by Prasad Jukanti |
Drugs Gang: ప్లీజ్ అర్థం చేసుకోండి.. హైదరాబాద్ కు రాలేము.. జంకుతున్న డ్రగ్స్ ముఠా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. డ్రగ్స్ రాకెట్లలో సెలబ్రిటీలు, ఎంత పెద్ద బడాబాబులు ఉన్నా ఉపేక్షించవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలతో తెలంగాణ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ తో డ్రగ్స్ సరఫరా ముఠాలు హైదరాబాద్ కు రావడానికి భపడుతున్నారు. ఇప్పట్లో నగరానికి రాలేమని అవసరం అనుకుంటే వాడకందార్లే బెంగళూరుకు వచ్చి తాము చెప్పిన చోట నుంచి డ్రగ్స్ తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణలో ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి.

బెంగళూరులో ఉన్న కింగ్ పిన్ ను పట్టుకోవడానికి ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బెంగళూరు వెళ్లారు. డ్రగ్స్ విషయంలో తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో మాదకద్రవ్యాలు విక్రయాల విషయంలో ఈ ముఠా సభ్యులు రోజు రోజుకు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాదకద్రవ్యాలు విక్రయాలు జరిపే సమయంలో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తే రెండు గంటల తర్వాత డ్రగ్స్ ఎక్కడ పెట్టారో ముఠా సభ్యులు వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారట. ఈ వ్యవహారం అంతా ఎవరికి అనుమానం రాకుండా చెత్త డబ్బాలో రెడ్ కలర్ కవర్ లో, చెట్టు కింది భాగంలో బ్లూకలర్ కవర్ లో, రోడ్డు పక్కనే ఉన్న బండి కింద పెట్టి వాడకం దారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు దారులకు తమ ముఖాలు కనబడకుండా డ్రగ్స్ ముఠా సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గుర్తించారు.

కాగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడవద్దని అధికారులకు ఆదేశించారు. డ్రగ్స్ రాకెట్ లో ఎంతపెట్ట సెలబ్రెటీలు ఉన్నా వదిలిపెట్టవద్దని, బడా డ్రగ్స్ రాకెట్స్ చేదించే పోలీసులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకం సైతం అందజేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో పోలీసులు పకడ్బంధీగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ కు వచ్చి డ్రగ్స్ విక్రయించడం శ్రేయస్కరం కాదని భావిస్తున్న డ్రగ్స్ ముఠాలు.. క్రమంగా రూట్ మారుస్తున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed