ఆందోళన వద్దు.. సకాలంలో కౌన్సిలింగ్ పూర్తి చేస్తాం! మంత్రి దామోదర రాజనర్సింహ

by Geesa Chandu |   ( Updated:2024-09-13 19:43:27.0  )
ఆందోళన వద్దు.. సకాలంలో కౌన్సిలింగ్ పూర్తి చేస్తాం! మంత్రి దామోదర రాజనర్సింహ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా తెలిపారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇచ్చిన గడువులోగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌ను పూర్తి చేసి, తరగతులను ప్రారంభిస్తామని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ విషయంలో ఎలాంటి వదంతులను, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆయన సూచించారు.

తెలంగాణ ప్రాంత విద్యార్థులకే సీట్లు దక్కాలన్నది తమ ఆలోచన అని, ఈ విషయంలో రాజీ పడేది లేదన్నారు. వారం రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందని, ఈలోగా వెబ్‌ ఆప్షన్ల నమోదు కోసం విద్యార్థులు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వివరాలు, సీట్ల వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌( https://www.knruhs.telangana.gov.in/ ) లో అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే, గతేడాది ఏయే ర్యాంకు విద్యార్థులకు ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయన్న వివరాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఆయా వివరాలను పరిశీలించి, తమ ర్యాంకులకు అనుగుణంగా వెబ్‌ ఆప్షన్ల కోసం జాబితాను సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.

Advertisement

Next Story