మూఢనమ్మకాలకు బానిసైన CM మనకు అవసరమా?.. ప్రధాని మోడీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-27 10:01:35.0  )
మూఢనమ్మకాలకు బానిసైన CM మనకు అవసరమా?.. ప్రధాని మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుగులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో భాగాంగా ఇవాళ మహాబూబాబాద్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అని తెలుగు ప్రసంగంతో స్టార్ట్ చేశారు. నా కుటుంబ సభ్యులారా అంటూ.. అధికారంలోకి వస్తే తెలంగాణ తొలి బీజేపీ సీఎం.. బీసీకి చెందిన వ్యక్తి అని స్పష్టం చేశారు.

బీజేపీ శక్తి గురించి కేసీఆర్‌కు తెలుసని, అందుకే బీజేపీతో దోస్తి చేసేందుకు ప్రయత్నం చేశారని, ఒకసారి ఢిల్లీకి కూడా కేసీఆర్ వచ్చారని తెలిపారు. కేసీఆర్ తనతో ప్రదేయపడ్డారని, కానీ బీజేపీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా ఉండదలుచుకోలేదని తెలిపారు. ఎన్‌డీఏలో చేర్చుకోవట్లేదని బీఆర్ఎస్ నేతలు తనను తిట్టడం మొదలు పెట్టారని వెల్లడించారు. బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌ను దగ్గరకు రానివ్వదని, ఇది మోడీ గ్యారంటీ అని, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అని తెలుగులో మాట్లాడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

అందుకే సచివాలయం కూల్చారు..

తెలంగాణ అంటే సంప్రదాయం, టెక్నాలజీ అని గుర్తింపు ఉండేదని, కానీ కేసీఆర్ ఈ ప్రదేశాన్ని అంధ విశ్వాసంలోకి నెట్టేశాడన్నారు. బీఆర్ఎస్ అధినేతకు అంధ విశ్వాసాలు ఎక్కువని, కేసీఆర్ అంధవిశ్వాసాలతో సచివాలయం కూల్చారని గుర్తుచేశారు. కేసీఆర్ మూఢనమ్మకాలతో ప్రజాధనం వృథా చేశారని, మూఢనమ్మకాలతో బానిసైన సీఎం మనకు అవసరమా? ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని సీఎం మనకు అవసరమా? తెలుగులో మాట్లాడారు. ఈ ఫామ్ హౌస్ సీఎంను డిసెంబర్ 3న సాగనంపాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ అవినీతిపరులను జైలుకు పంపుతాం

డబుల్ బెడ్ రూమ్, ల్యాండ్, లిక్కర్, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపుతామన్నారు. బీఆర్ఎస్ అవినీతిపరులను జైలుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దళితులను మోసం చేశారని ఆరోపించారు. అణగారిన వర్గాలకు సంక్షేమం అందిస్తోంది బీజేపీనే అని, సామాజిక న్యాయం బీజేపీ తోనే అని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed