అధికారులే అమ్మా నాన్నయ్యారు! వైభవంగా అనాథ యువతి వివాహం

by Ramesh N |
అధికారులే అమ్మా నాన్నయ్యారు! వైభవంగా అనాథ యువతి వివాహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ అనాథ యువతికి ప్రభుత్వ అధికారులే అమ్మా నాన్నలు అయ్యి.. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఆ అమ్మాయికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగమే బంధువులయ్యారు. కరీంనగర్ లోని కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన అనాథ యువతి మౌనిక- సాయి తేజల పెళ్లికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆత్మబంధువుగా, అధికారులే బంధువులుగా మారి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. తనకు ఎవరూ లేరనే ఆలోచన రాకుండా.. నీ కోసం మేమంతా ఉన్నామంటూతన వెంట నిలిచి ఆ అమ్మాయి ముఖంలో సంతోషం నింపారు.

అమ్మానాన్నలు కన్యాదానం చేయాల్సిన ఈ పెళ్లికి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (PamelaSatpathy) పెళ్లి పెద్దగా వ్యవహరించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సొంత ఖర్చులతో పెళ్లి భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే నూతన వస్త్రాలు సమర్పించారు. పలువురు జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు తమ సొంత ఇంట్లో జరిగిన పెళ్లిగా భావిస్తూ.. పెళ్ళికి హాజరై నూతన వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. అనాథ యువతి మౌనికకు తల్లిదండ్రులు లేరని అన్నారు. అమ్మాయి మౌనిక నర్సింగ్ చదివిందని తెలిపారు. మౌనికను ఇంకా చదివించాలని సాయితేజా కుటుంబాన్ని రిక్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ పెళ్లికి చాలా మంది సహాయం చేశారని పేర్కొన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి, టీఎన్‌జీవో నుంచి పెళ్లికి సహాయం చేశారని అన్నారు. జిల్లా నుంచి ఒక కుటుంబంలా ప్రభుత్వం తరపు నుంచి ఏ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనాథలు ఎవరూ లేరని అనుకోవద్దు.. ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.

Next Story