- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Dharani: టిప్పన్.. ‘నాట్ అవేలబుల్’..! ధరణి పోర్టల్‌లో పనిచేయని ‘ఆప్షన్’

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌లో ‘టిప్పన్’ ఆప్షన్ పని చేయడం లేదు. డౌన్‌లోడ్ అని క్లిక్ చేస్తే ‘నాట్ అవేలబుల్’ అని చూపిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలకు చెందిన గ్రామనక్షలు అప్ లోడ్ చేయలేదు. ముఖ్యంగా భూముల ధరలు అధికంగా ఉన్న విలేజెస్‌కు సంబంధించి క్యాడస్ట్రల్ మ్యాప్స్ సామాన్యులకు అందుబాటులో ఉంచకుండా చేశారు. చాలా రెవెన్యూ గ్రామాల డేటా తెలియకుండా దాచి పెట్టారు. ఇప్పుడు టిప్పన్స్ సైతం కనిపించకపోవడంతో వివాదాస్పద భూములు ఏవో గుర్తించడం కష్టంగా మారుతున్నది. టిప్పన్స్ లేని కారణంగా సర్వే చేయలేమంటూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు ఫిర్యాదుదారులకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తున్నారు. అది కూడా సర్వే కోసం రెండు, మూడేండ్లు తిరిగిన తర్వాత తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. కనీసం భూభారతి అమల్లోకి తీసుకొచ్చే ముందే అన్ని గ్రామాల నక్ష, టిప్పన్స్ అందుబాటులో ఉండేలా చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రారంభమైనప్పటి నుంచి ఆంక్షలే
ధరణి రాక ముందు.. వీఆర్వో దగ్గరికి వెళ్తే 1 బీ రిజిస్టర్ చూసి ఆయా గ్రామాలకు సంబంధించి భూముల వివరాలన్నీ చెప్పేవారు. విలేజ్ మ్యాప్ చూపించేవాళ్లు. సరిహద్దులో ఏయే సర్వే నంబర్లు వస్తాయో వివరాలు తెలిసేది. ధరణి పోర్టల్ తీసుకొచ్చాక.. వాస్తవ సమాచారాన్ని ఇతరులెవరూ తెలుసుకోకుండా ఆంక్షలు పెట్టారు. ఏయే సర్వే నంబరులో ఎంత భూమి ఉన్నది? ఆ సర్వే నంబర్లలో సబ్ డివిజన్లు ఎన్ని? ఆయా సబ్ డివిజన్లలో ఉన్న విస్తీర్ణమెంత? సరిహద్దుల వివరాలేమిటో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.
ఖరీదైన భూములున్న గ్రామాల్లో..
అత్యంత ఖరీదైన భూములున్న అనేక గ్రామాల క్యాడస్ట్రల్ మ్యాపులను ధరణిలో అప్‌లోడ్ చేయలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, శంషాబాద్, గండిపేట, శేరిలింగంపల్లి, మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్, శామీర్‌పేట, దుండిగల్, మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల మ్యాప్స్ అప్‌లోడ్ చేయలేదు. మేడ్చల్, సంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోని అనేక గ్రామాల మ్యాపులు సైతం కనిపించడం లేదు. విలేజ్ డాటా నాట్ అవేలబుల్ అని చూపిస్తున్నది. అప్పటి సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ఆవిష్కరించిన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లికి గ్రామనక్ష లేదు. మూడు నెలల్లోనే రూపొందిస్తామన్న ప్రభుత్వానికి ఐదేండ్లు పట్టింది. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. దీన్ని బట్టి గ్రామనక్షకు ఎంత విలువ ఉన్నదో, దాని తయారీ వెనుక ఎంత శ్రమ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. వివాదాస్పద భూములకు పరిష్కారం లభించాలంటే మ్యాప్స్ ఆధారంగా బౌండరీస్ తెలుసుకునే వీలుంది. ఎవరైనా కొనుగోలు చేయాలనుకునే వారు కూడా వివాదాలు ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని మ్యాప్స్ ఆధారంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఆ వెసులుబాటు ఇవ్వకుండా రెవెన్యూ యంత్రాంగం సమస్యలను జఠిలం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివాదాస్పద భూములు గుర్తించాలంటే..
ధరణి పోర్టల్‌లో జిల్లా, డివిజన్, మండలం, గ్రామం సెలెక్ట్ చేయగానే క్యాడస్ట్రల్ మ్యాప్ వస్తుంది. అందులో మనకు కావాల్సిన సర్వే నంబర్ మీద క్లిక్ చేస్తే విస్తీర్ణం ఎంత? సబ్ డివిజన్లు ఎన్ని? ఏయే సబ్ డివిజన్ లో ఎంత విస్తీర్ణం? ఇలా వివరాలన్నీ దర్శనమిస్తాయి. సర్వే నంబర్ మొత్తం విస్తీర్ణం పక్కనే చిన్న ఫొటో గుర్తు ఉంటుంది. దాని పై క్లిక్ చేస్తే ఆ సర్వే నంబర్ టిప్పన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఆ సర్వే నంబరు సరిహద్దులు కొలతలతో సహా ఉంటుంది. ఏ దిక్కున ఎన్ని గజాలు తిరిగిందో స్పష్టంగా ఉంటుంది. దాన్ని బట్టి గజం తేడా రాకుండా భూములను కొలిచే వీలుంటుంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి సర్వే నంబర్ల వారీగా టిప్పన్స్ డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే గడిచిన వారం రోజులుగా ఆ ఆప్షన్‌ను తొలగించారు. డౌన్‌లోడ్ పై క్లిక్ చేస్తే ‘టిప్పన్ నాట్ అవేలబుల్’ అని వస్తున్నది. వివాదాల్లేని భూములను గుర్తించాలంటే ఈ టిప్పన్ ఎంత ఉపయోగమే ల్యాండ్ ఎక్స్పర్ట్స్ కి తెలుసు. దాని ద్వారానే భవిష్యత్తులోనూ సర్వే లేదా సమగ్ర భూ సర్వే నిర్వహించేది. అత్యంత ప్రాధాన్యత కలిగిన టిప్పన్ మ్యాప్స్ కనిపించకుండా మాయం చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని భూ చట్టాల నిపుణులు, రియల్టర్లు అనుమానిస్తున్నారు.
ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం యెలిమినేడు రెవెన్యూ గ్రామంలో రియల్ ఎస్టేట్ బూమ్ తో భూముల విలువలు పెరిగాయి. అక్కడ కొంత కాలం క్రితమే వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మేశారు. కానీ నేటికీ అగ్రికల్చర్ ల్యాండ్స్ గా ధరణి రికార్డుల్లో కొనసాగుతున్నాయి. వాటిని బౌండరీస్ తెలియడం ద్వారా ఆ వివాదాస్పద భూముల జోలికి వెళ్లకుండా ఉండొచ్చు. అయితే ధరణి పోర్టల్ లో టిప్పన్ డౌన్ లోడ్ కావడం లేదు. ఇలా అనేక వివాదాస్పద భూములు కలిగిన గ్రామాల్లో క్యాడస్ట్రల్ మ్యాప్స్ కూడా అప్‌లోడ్ చేయలేదు. ఇప్పుడేమో టిప్పన్స్ కూడా డౌన్ లోడ్ కావడం లేదు. ఏ ప్రభుత్వ, ప్రైవేట్ సర్వేయరైనా ఈ మ్యాప్ ఆధారంగానే సర్వే చేస్తారు.
అనుమతి ఉత్తదేనా?
ధరణి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ ఫార్మాట్‌లో భూమి రికార్డులను వీక్షించడానికి ప్రభుత్వం పౌరులను అనుమతిస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. దీనికి అదనంగా ల్యాండ్ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లోనూ అందుబాటులో ఉన్న భూ మ్యాప్‌లను అందిస్తుంది. గ్రామాల కాడాస్ట్రల్ మ్యాప్‌లను కూడా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్‌సైట్ ఉపయోగించి పొందొచ్చునని ప్రకటించారు. అయితే ఈ అనుమతులు ఉత్తవేనా అని రైతులు ప్రశ్నిస్తున్నరు. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన టిప్పన్ ఆప్షన్ ను ఎందుకు రద్దు చేశారో అర్థం కావడం లేదు. ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామంటూనే పాత ఆప్షన్లను తొలగించడం విస్మయానికి గురి చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా టిప్పన్ డౌన్ లోడ్ సదుపాయాన్ని కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సర్వే చేయలేం.. అధికారుల జవాబులు ఇలా..
- మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట యన్మన్ గండ్లలో ఓ పెద్ద చెరువు ఉంది. అది నిండితే ఓ మూడు ఎకరాల వరకు ఇప్పటికే మునుగుతుంది. అయితే ఇటీవల కొందరు చెరువు మధ్యలోనే రోడ్డు వేశారు. దీంతో సర్వే చేయాలంటూ ధర్మపురం వెంకటరమణ మూడేండ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే సర్వే చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారు. గట్టిగా అడిగితే టిప్పన్లు లేనప్పుడు తాము ఎట్లా సర్వే చేస్తామంటూ అధికారులు ఫిర్యాదుదారుడినే మందలిస్తున్నారు. నవాబుపేట, మహబూబ్నగర్, హైదరాబాద్ లోని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కలిసి విజ్ఞప్తి చేసినా సర్వేకు ససేమిరా అంటున్నారు. తాము చేయలేమంటూ రిటర్న్ గా ఇవ్వడం గమనార్హం.
- మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్ గండ్ల సర్వే నం.135, 136 ల విస్తీర్ణం సర్వే చేసేందుకు మోఖా మీదికి మండల సర్వేయర్ వెళ్లారు. ‘సర్వే నంబర్లకు సంబంధించిన నకలు టిప్పన్లు లేని కారణంగా గ్రామ నక్ష సాయంతో హద్దులు గుర్తించాం. ఈ రెండు సర్వే నంబర్లలో రెవెన్యూ రికార్డుల్లో పూర్తి విస్తీర్ణానికి 2.20 ఎకరాల భూమి తక్కువగా ఉంది’ అని లిఖితపూర్వకంగా ఇచ్చారు. కబ్జా చేశారంటూ గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
- ఈ ఊరికి టిప్పన్లు లేవని ఎండార్స్‌మెంట్ చేస్తూ నవాబుపేట తహశీల్దార్ 2023 ఆగస్టు 29న ఫైల్ నం.ఎంఎస్/389/2023 ద్వారా స్పష్టం చేశారు.
- ఈ సమస్య పరిష్కారానికి మాకు ఎలాంటి సంబంధమూ లేదని, ఆర్డీవో కార్యాలయంలో అధికారులను సంప్రదించి సర్వే చేయించుకోవాలంటూ మహబూబ్‌నగర్ జిల్లా భూమి కొలతలు, రికార్డుల శాఖ సహాయ సంచాలకులు ధర్మపురం వెంకటరమణకు లిఖితపూర్వకంగా 2024 సెప్టెంబరు 18న రిప్లయ్ ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కి దరఖాస్తు చేసుకుంటే ఇలాంటి రిప్లయ్ వచ్చింది. అసలు సర్వే చేయాల్సిన శాఖ అధికారులు కూడా చేతులెత్తేశారు. తమ దగ్గర టిప్పన్లు లేవంటూ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఓ వైపు ల్యాండ్ కబ్జాకు గురైందని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.