'ధరణి' పాపం సోమేశ్‌దే! సీఎంను తప్పుదారి పట్టించింది అతనేనా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-11 02:27:35.0  )
ధరణి పాపం సోమేశ్‌దే! సీఎంను తప్పుదారి పట్టించింది అతనేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి.. అమల్లోకి వచ్చి 25 నెలలైంది.. సమస్యలను పరిష్కరించడం అటుంచి కొత్త ప్రాబ్లమ్స్‌ను సృష్టించింది. లక్షలాది మందిని కార్యాలయాల చుట్టూ తిప్పించుకునేలా చేసింది. అయితే ఈ పోర్టల్ వెనక అదృశ్యశక్తి సీఎస్ సోమేశ్ కుమారేనని విమర్శలున్నాయి. సీఎంను తప్పు దారి పట్టించడమే కాకుండా.. సమస్యలు ముఖ్యమంత్రి దాకా వెళ్లకుండా అడ్డుకున్నారన్న అపవాదు ఉన్నది. ఇప్పుడు హై కోర్టు ఆదేశాలతో ఆయన ఏపీకి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్, భూ సమస్యలపై చర్చ జరుగుతున్నది.

33 మాడ్యూళ్లు ఇచ్చినా..

ధరణి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. అధికారులనడిగితే అంతా సీఎస్ సోమేష్ కుమార్‌కే తెలుసని తప్పించుకుంటున్నారు. ముందు ధరణి వల్ల అంతా బాగయిందని చెప్పారు. సమస్యలు వస్తుండడంతో 33 మాడ్యూళ్లు ఇచ్చారు. ఒకదాని తర్వాత ఒకటిగా ఇన్నేసి మాడ్యూళ్లు ఇచ్చినా సమస్యలకు పరిష్కారం లభించలేదు. అంతేకాకుండా ధరణి పోర్టల్ సమస్యలను సృష్టించిందన్న వాస్తవ నివేదికను సీఎం కేసీఆర్ దాకా చేరకుండా అడ్డుకున్నాడన్న వాదన బీఆర్ఎస్ వర్గాల్లోనే ఉన్నది. ఆఖరికి కేబినేట్ సబ్ కమిటీ సిఫారసులను కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో భూ సమస్యలన్నీ పేరుకుపోయాయన్న అపవాదును మూటగట్టుకున్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించే రిపోర్టును సీఎం కేసీఆర్‌కి సమర్పించకపోవడం వల్లే సమూల మార్పులకు ప్రభుత్వం ముందడుగు వేయలేదు. ఇప్పటికీ తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వారి సంఖ్య వందల్లో కనిపిస్తున్నది.

వివాదాల సృష్టికర్త

ధరణి పోర్టల్ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులతోనే అనేక సమస్యలు వచ్చాయి. స్థానిక విచారణ తీసేయడంతో కుటుంబ వివాదాలు చుట్టుముట్టాయి. డబుల్ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ప్లాట్లకు వ్యవసాయ భూముల పాస్ బుక్కులు వచ్చాయి. ఎల్ఆర్ యూపీ టైం ఇవ్వకపోవడం, సరైన రికార్డు లేక తప్పులతడకగా చేయించారు. ఉద్యోగులకు సరైన శిక్షణ కూడా ఇవ్వలేదు. వీఆర్వోల అంశంలోనూ పంతానికి వెళ్లి ఆ వ్యవస్థను రద్దు చేశారు.

రీ డిప్లాయ్ మెంట్ పేరుతో ఆగం చేశాడు. పౌతీ/విరాసత్ విషయంలో వాళ్లు తెచ్చిన విధానాలు, ధరణిలో నాలా అంశంలోనూ ఎలాంటి విచారణ లేకుండా చేయడంతో ఎన్నో భూములు కబ్జా అవుతున్నాయి. రియల్ టైం పహానీ ఏమిటండి? కనీసం ప్రతి సంవత్సరం ఏదో ఒక నిర్ణీత తేదీ పెట్టి, ఆ రోజుకి రికార్డు ప్రింట్ తీసి ఆఫీసులో భౌతికంగా అందుబాటులో ఉంచితే భవిష్యత్ అవసరాలకు రెఫరెన్సుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడా పహానీ అర్థమే మార్చేసిన ఘనత సీఎస్ సోమేష్ కుమార్‌కి దక్కుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అమలేది?

2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. కానీ నేటికీ భూముల లావాదేవీల్లో ఎదురవువుతున్న అడ్డంకులు తొలగిపోలేదు. ధరణి పోర్టల్‌లో సమస్యలపై చర్చించి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సభ్యులుగా ఉన్న సబ్‌కమిటీ చర్చించింది. క్రెడాయ్‌, ట్రెడా, ట్రెసా వంటి సంస్థలతోపాటు ప్రజలు, ప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులను, వివిధ రకాల అంశాలను పరిశీలించింది. సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించేలా ధరణి పోర్టల్‌ మరింత సరళంగా మార్చేలా, ఎలాంటి భూ సమస్యలనైనా పరిష్కరించేలా సబ్‌కమిటీ పలు సూచనలు చేసింది.

తప్పుగా నమోదైన పట్టాదారు పేరు, వివరాలను సరి చేయడంతోపాటు పొరపాటున పట్టాభూములు ప్రభుత్వ భూములుగా నమోదవడం, భూమి ఉపయోగంలో/తరగతిలో/వివిధ రకాల భూములకు సంబంధించిన మార్పు చేర్పులు, మిస్సింగ్‌ సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం సరిచేయడం, ఒకరికంటే ఎక్కువగా కొనుగోలుదారులు/అమ్మకందారులను అనుమతించడం తదితర అంశాల్లో పరిష్కారాలను చూపాలని సూచించింది. కానీ సీఎస్ పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. టీఎం 33 పేరిట మాడ్యూల్ ఇచ్చినా దరఖాస్తులు మాత్రం అపరిష్కృతంగానే ఉన్నాయి.

ఓఆర్సీ పెండింగ్

ఓఆర్సీ, పీటీ సర్టిఫికెట్ల జారీ నిలిపివేసి ఏండ్లు గడుస్తున్నది. ఇందుకు సంబంధించి ధరణిలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఆక్యుపెన్సీ రైట్స్‌ సర్టిఫికెట్‌/ప్రొటెక్టెడ్‌ టెనెంట్స్‌ సర్టిఫికెట్లను కొత్తగా ఇవ్వాలంటే ఒక్కో కేసును ప్రత్యేకంగా పరిశీలించేందుకు, ప్రత్యేకంగా ఒక మాడ్యూల్‌ను అభివృద్ధి చేయాలని కేబినెట్ సూచించింది. కానీ ఆ ఆలోచనే చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ధరణిలో భూములకు సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం లేదు. వచ్చిన ఫిర్యాదులపై ప్రతిరోజూ తీసుకున్న చర్యలు, రిజెక్ట్‌ చేసిన దరఖాస్తుల వివరాలు తెలిసేలా, అందుకు కారణాలను వివరించేలా మాడ్యూల్‌ను తయారు చేయాల్సి ఉన్నదని కేబినెట్ తెలిపింది.

కానీ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు. కనీసం షార్ట్ ఫాల్స్ ఏమిటో కూడా వెల్లడించకుండా తిరస్కరిస్తుండడంతో మళ్లీ మళ్లీ అప్లయ్ చేయాల్సి వస్తున్నది. ఏజెన్సీలో భూములను వారసత్వంగా మార్చేందుకు మాడ్యూల్‌ను ఏర్పాటు చేయలేదు. ధరణికి ముందు జరిగిన లావాదేవీలను తగు కారణాలతో తిరస్కరించేందుకు వీలుగా మాడ్యూల్‌లో మార్పులు చేర్పులకు సబ్‌కమిటీ సిఫారసు చేసింది. కానీ ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ఇవన్నీ ఎప్పటికప్పుడు రివ్యూ చేయకుండా పెండింగ్‌లో ఉంచడం వల్లే లక్షలాది దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ అధికారులే చెప్తుండడం విశేషం. ఇక సీఎస్ సోమేష్ కుమార్ స్థానంలో వచ్చే వారైనా ఈ అంశంపై దృష్టి పెడతారేమోనన్న ఆశలు చిగురించాయి.

Read more:

బీఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్సే.. నెల దాటినా మారని పార్టీ పేరు

Advertisement

Next Story

Most Viewed