ప్రతీ ఒక్కరికీ మంచం ఉండాల్సిందే : డిప్యూటీ సీఎం భట్టి

by M.Rajitha |
ప్రతీ ఒక్కరికీ మంచం ఉండాల్సిందే : డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను, వసతులను అధికారులు త్వరితగతిన సమకూర్చాలని, పిల్లలెవరూ నేలపై పడుకోకుండా ప్రతీ ఒక్కరికీ మంచం ఉండాల్సిందేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు. పాఠశాలల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించడంతో పాటు డిజైన్లను కూడా సిద్ధం చేయాలన్నారు. సుమారు ఐదు వేల కోట్ల రూపాయలతో కట్టించే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లపై రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై ఒక చెక్ లిస్టును అధికారులు రెడీ చేసి ఈ నెల 29 వరకు ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే రిలీజ్ చేసేలా ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించుకునే బాద్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్సులను ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్మించాలని భావిస్తున్నందున జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని తగిన స్థలాన్ని ఎంపిక చేయాలని, నిర్మాణ డిజైన్లను కూడా ఫైనల్ చేయాలని ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ కాంప్లెక్సులలో సుమారు 120 పాఠశాలలను నిర్మించాలనే ఆలోచన ఉన్నందున వీలైనంత తొందరగా అవి గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సోమవారం రివ్యూ సందర్భంగా సంబంధిత ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. విద్యార్థులను సమాజ సంపదగా ప్రభుత్వం భావిస్తున్నందున మానవ వనరులను అభివృద్ధి చేసుకోవడానికి ఈ బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చి నిధులను ఎక్కువ కేటాయించినట్లు గుర్తుచేశారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్సులు గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినందున స్థల సేకరణ ప్రాసెస్‌ను స్పీడప్ చేయాలని, రానున్న ఎనిమిది నెలల వ్యవధిలోనే భవన నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థి మంచంపైనే పడుకోవాలని, నేలపైన పడుకునే పరిస్థితి ఉండొద్దని స్పష్టం చేశారు. దాదాపు వెయ్యికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటికే మంచాలు, బెడ్స్, బెడ్ షీట్స్ ఎన్ని ఉన్నాయో... ఇంకా ఎంతమందికి అవసరమో జాబితాను తయారు చేసి ప్రతిపాదనలు పంపితే వాటిని పరిశీలించి కొనుగోలు చేసేందుకు నిధులను మంజూరు చేస్తామన్నారు.

ప్రతీ గురుకుల పాఠశాలతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు తప్పనిసరిగా టాయిలెట్స్, బాత్రూమ్స్, రన్నింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, వసతి గదులకు డోర్స్, విండోస్ ఉండాలని, దోమలు రాకుండా కచ్చితంగా మెష్ ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి అన్ని సౌకర్యాలపై చెక్ లిస్టు తయారు చేయాలని, ప్రతీ హాస్టల్‌లో వీటిని ప్రదర్శించాలన్నారు. ఈ నెల 29 లోగా సమర్పించాలని ఆదేశించారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. బకాయిల జాబితాను అందజేయాలన్నారు. విదేశీ విద్యకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఏటా నిర్ణీత గడువులోగానే నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారులదేనిని గుర్తుచేశారు. ఈ ఏడాది బీసీలకు 800, ఎస్సీ/ఎస్టీ/మైనార్టీలకు 500 మంది చొప్పున ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తామన్నారు.

పెద్దాపూర్ పాఠశాలపై స్పెషల్ ఫోకస్ :

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఇటీవల సందర్శించిన డిప్యూటీ సీఎం... ఆ విజిట్ తర్వాత తీసుకున్న చర్యల గురించి గురుకులాల సెక్రటరీ రమణ కుమార్‌ను ఆరాతీశారు. విద్యార్థులకు మంచాలు, బెడ్స్ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు నేలపై పడుకోవడానికి వీల్లేదని, ప్రస్తుత భవనాలు సరిపోకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.‌ పాఠశాల గ్రౌండ్‌ను వినియోగించుకునే తీరులో ల్యాండ్ లెవెల్ చేయాలని, టాయిలెట్స్, బాత్‌రూమ్‌ల‌ నిర్మాణం జరగాలన్నారు. స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ, కావలసిన భద్రతా చర్యలుండాలన్నారు. నూతన భవనాల నిర్మాణం కోసం కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, అలుగు వర్షిణి, శరత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed