- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ లిక్కర్ కేసు: నేడు ఈడీ విచారణకు బుచ్చిబాబు
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ బుధవారం ఢిల్లీలోని ఆఫీస్‌లో విచారించనున్నది. ఇప్పటికే రెండుసార్లు నోటీసు జారీచేసినా.. కొన్ని వ్యక్తిగత కారణాలతో హాజరు కాని బుచ్చిబాబు చివరకు బుధవారం హాజరవుతున్నారు. ఈ కేసులో సౌత్ గ్రూపు తరఫున ఎమ్మెల్సీ కవితకు కూడా ప్రమేయం ఉన్నదని ఈడీ ఆరోపిస్తున్న సమయంలో ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చిబాబును తాజాగా విచారణకు పిలుస్తుండడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి గతేడాది అక్టోబరు 18, 20 తేదీల్లో బుచ్చిబాబు విచారించిన ఈడీ.. ఆయన నుంచి వాంగ్మూలాన్నీ రికార్డు చేసింది. ఇప్పుడు కవితను విచారించడానికి ఒక రోజు ముందు మళ్లీ పిలుస్తుండడం కీలకంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కిక్‌బ్యాక్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు వెళ్లింది సౌత్ గ్రూపు నుంచేనని ఈడీ రెండు చార్జిషీట్‌లలో, పలువురిని అరెస్టు చేసి కోర్టు సమర్పించిన రిమాండ్ రిపోర్టుల్లోనూ పేర్కొన్నది. ఈ గ్రూపులో కవితతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి తదితరులు కూడా ఉన్నారన్నది ఈడీ ఆరోపిస్తున్నది. కవిత తరఫున ఈ గ్రూపు నుంచి ప్రతినిధిగా పిళ్లయ్, ఆడిటర్ బుచ్చిబాబు, బోయిన్‌పల్లి అభిషేక్ ఉన్నట్టు ఈడీ పేర్కొన్నది. ఇందులో ఆడిటర్ బుచ్చిబాబును, బోయిన్‌పల్లి అభిషేక్‌ను, మాగుంట రాఘవను ఇప్పటికే విచారించిన అధికారులు.. ఈ నెల 16న కవితను రెండోసారి విచారించనున్నారు. దీనికి ఒక రోజు ముందే బుచ్చిబాబును ఎంక్వయిరీకి పిలవడం గమనార్హం.
గత స్టేట్‌మెంట్లలో బుచ్చిబాబు చెప్పిందేంటి?
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఆడిటర్ బుచ్చిబాబు గతేడాది అక్టోబరు 18, 20 తేదీల్లో ఈడీకి స్టేట్‌మెంట్లు ఇచ్చారు. 2021 మేలో పిళ్లయ్ తనను సంప్రదించారని, ఇండో స్పిరిట్స్ కంపెనీతో జాయింట్ వెంచర్ గురించి మాట్లాడారని తెలిపారు. ఆ కంపెనీ ఎండీగా సమీర్ మహేంద్రుతో మీటింగులు కూడా జరిగాయన్నారు. శరత్‌చంద్రారెడ్డికి ఢిల్లీ లిక్కర్ బిజినెస్ గురించి వివరించాలనుకుంటున్నట్టు తెలిపారని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే శరత్‌చంద్రారెడ్డి తనను కలిసి ఆర్థికంగా లాభ నష్టాల గురించి అధ్యయనం చేసి సహకారం ఇవ్వాల్సిందిగా కోరారని.. ఆ ప్రకారం హైదరాబాద్‌లోని కోహినూర్ హోటల్‌లో దినేశ్ అరోరా, అర్జున్ పాండే, విజయ్ నాయర్‌తో పరిచయాలు ఏర్పడ్డాని బుచ్చిబాబు తెలిపారు. లిక్కర్ పాలసీలో టాక్స్ స్ట్రక్చర్, లైసెన్సు ఫీజు తదితర అంశాల్లో ఉన్న లోపాలను సమీర్ మహేంద్రుకు చెప్పానని, ఆ సందర్భంలోనే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పరిచయం చేయాల్సిందిగా ఆయన కోరారని తెలిపారు. అందులో భాగంగానే సమీర్‌ను ఢిల్లీలో (లోథి రోడ్డు)ని ఎంపీ మాగుంట ఇంటికి తీసుకెళ్లానని, ఆ తర్వాత ఢిల్లీ సిటీలో ఐదు రిటెయిల్ జోన్స్ శరత్‌చంద్రారెడ్డికి దక్కాయని పేర్కొన్నారు. ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో 2021 సెప్టెంబరు 20న సమీర్ మహేంద్రు, పిళ్లయ్, బోయిన్‌పల్లి అభిషేక్, ఎంపీ మాగుంట, శరత్‌చంద్రారెడ్డి తదితరులతో ఫిజికల్ మీటింగ్ (డిన్నర్) జరిగిందని, దానికి లిక్కర్ తయారీ సంస్థ పెర్నార్డ్ రికార్డు తరపున రాజేశ్ మిశ్రా కూడా హాజరయ్యారని తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లో విస్తరణపై పిళ్లయ్ దృష్టి
సమీర్ మహేంద్రుతో తనకు తొలుత పరిచయం జరిగింది పిళ్లయ్ ద్వారానేనని, విజయ్ నాయర్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్సులో అభిషేక్ తన గురించి వివరించినట్టు తెలిపారు. దాదాపు ఏడు లేదా ఎనిమిది రాష్ట్రాల్లో లిక్కర్ వ్యాపారాన్ని (హోల్‌సేల్) విస్తరింపజేయాలన్న ఆలోచనతో లోతైన రాజకీయ సంబంధాలు, ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యక్తులు, కంపెనీల గురించి వెతుకున్నట్టు పిళ్లయ్ వివరించారని బుచ్చిబాబు ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. చివరకు లిక్కర్ బిజినెస్, పాలసీ తదితరాలన్నింటినీ అధ్యయనం చేసి శరత్‌చంద్రారెడ్డికి వివరించినట్టు పేర్కొన్నారు. పాలసీ ఎలా ఉంటే లాభం వస్తుందనే ఐడియాలను శరత్‌చంద్రారెడ్డికి వివరించానని, చివరకు విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అరుణ్ పిళ్లయ్ చర్చించుకున్నారని గుర్తుచేశారు. పెర్నార్డ్ రికార్డు తయారీ, హోల్‌సేల్ బిజినెస్‌ను ఇండో స్పిరిట్స్ కంపెనీకి అప్పగించినట్లయితే అరుణ్ పిళ్లయ్‌ను వ్యాపార భాగస్వామిగా చేయడం గురించి చర్చలు జరిగాయని, చివరకు అదే జరిగిందని బుచ్చిబాబు తెలిపారు. ఈ డీల్ ఓకే అయిన తర్వాత తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో 2021 సెప్టెంబరులో ‘థాంక్స్ గివింగ్’ పేరుతో ఒక డిన్నర్ మీటింగ్ జరిగిందని గుర్తుచేశారు. ఆ మీటింగులోనే డీల్ ఓకే అయినందున కిక్ బ్యాక్ రూపంలో రిటన్ గిఫ్ట్ అందించడంపై విజయ్ నాయర్, పిళ్లయ్ మధ్య చర్చలు జరిగినట్టు తెలిపారు. తనను కూడా వ్యాపార భాగస్వామిగా చేసేలా ప్రతిపాదనలు వచ్చినా ఆసక్తి లేదనే కారణంతో ఇండో స్పిరిట్స్ కంపెనీకి దూరంగా ఉన్నానని, 2021 అక్టోబరు తర్వాత ఇక అందులో తాను వేలు పెట్టలేదని తెలిపారు.
ఇక సౌత్ గ్రూపు ఆర్థిక అంశాలపైనే ఈడీ ఫోకస్
బుచ్చిబాబును రెండుసార్లు ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఈడీ.. మరోసారి ఎంక్వయిరీకి పిలవడం ఆసక్తి రేకెత్తిస్తున్నది. కవితను ప్రశ్నించడానికి ముందురోజే బుచ్చిబాబును కూడా ఎంక్వయిరీ చేయడానికి ఈడీ వద్ద నిర్దిష్ట కారణాలు ఉండొచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. సౌత్ గ్రూపు ద్వారానే ఆర్థిక లావాదేవీలు జరిగాయని, హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరాయని, కోహినూర్ హోటల్ కేంద్రంగా జరిగిన చర్చలతో పాటు ఆ తర్వాత జరిగిన పలు మీటింగుల్లో చర్చకు వచ్చిన అంశాలతో ఆమ్ ఆద్మీ పార్టీతో డీల్ ఓకే అయిందన్నది ఈడీ వాదన. సౌత్ గ్రూపు, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై బుచ్చిబాబుకు సమగ్రమైన సమాచారం ఉంటుందన్న కోణం నుంచే ఈడీ మరోసారి ఎంక్వయిరీకి పిలిచింది. కవిత ద్వారానే ఆర్థిక లావాదేవీలు హవాలా మార్గంలో జరిగాయని ఈడీ అనుమానిస్తున్నది. ఆ కారణంగానే ఆమెకు గతంలో ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చిబాబును లిక్కర్ స్కామమ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, సౌత్ గ్రూపు మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీయాలనుకుంటున్నట్టు ఈడీ వర్గాల సమాచారం. ఇప్పటికే రెండుసార్లు స్టేట్‌మెంట్ తీసుకున్నా మరుసటి రోజున కవితను విచారిస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈడీ తనకు అవసరమైన అంశాలపై మరోసారి బుచ్చిబాబు ద్వారా రాబట్టాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే పిళ్లయ్ ఈడీ కస్టడీలో ఉన్నందున అవసరమైతే ఇద్దరినీ కలిపి జాయింట్ ఎంక్వయిరీ చేసే అవకాశమున్నదని, దాని ద్వారా వచ్చే వివరాలను ఆధారం చేసుకుని మరుసటి రోజున కవితను ఎంక్వయిరీ చేసే టైమ్‌లో ఎవరెవరిని కలపాలనేదానిపై స్పష్టత రానున్నదని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.