- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
10 గంటల్లో 14 ప్రశ్నలు సంధించిన ఈడీ.. వాటిపైనే స్పెషల్ ఫోకస్!
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు సోమవారం సుమారు 10 గంటలకు పైగా ప్రశ్నించారు. ఆమె నుంచి 14 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ఈ నెల 16న జారీ చేసిన నోటీసులో భాగంగా ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సిన కవిత అరగంట ముందుగానే ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. రాత్రి 9.15 గంటల వరకు ఆమెను విచారించారు. పది గంటలకు పైగా ప్రశ్నించిన ఆఫీసర్లు.. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మొత్తం విచారణ ప్రక్రియను ఈడీ వీడియోలో చిత్రీకరించింది. టార్చర్ పెడుతున్నారని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని కవిత ఈ నెల 16న ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈడీ ఈ జాగ్రత్తలు తీసుకున్నది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మళ్లీ విచారణకు రావాల్సిందిగా కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది.
అనుమానితురాలిగా..?
అరుణ్ రామచంద్ర పిళ్లయ్‌తో కలిపి జాయింట్ విచారణ జరిగినట్టు ఈడీ అధికారులు నొక్కిచెప్పినా.. సిసోడియా విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను ఒంటరిగానే ప్రశ్నించారని, ఎవరితో కలిపి జాయింట్‌గా విచారించలేదని కవిత సన్నిహిత వర్గాలు తెలిపారు. ఈడీ ఆఫీసర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు కవిత సమాధానాలు చెప్పి సహకరించారని, ఇన్వెస్టిగేటింగ్ టీమ్ సైతం సంతృప్తి చెందినట్టు పేర్కొన్నారు. విచారణ ప్రారంభం కావడానికి ముందు ఈడీ అధికారులను కవిత ‘నన్ను నిందితురాలిగా విచారణకు పిలిచారా..’ అంటూ అడగడంతో పాటు ఆడియో, వీడియో రికార్డు చేయాలని రిక్వెస్టు చేసినట్టు తెలిసింది. దీనికి స్పందించిన ఈడీ ఆఫీసర్లు.. ‘నిందితురాలిగా పిలవలేదు.. అనుమానితురాలిగా మాత్రమే..’ అంటూ రిప్లయ్ ఇచ్చినట్లు తెలిసింది.
ప్రణాళికాబద్ధంగానే ఎంక్వయిరీ
ఈడీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారమే కవిత నుంచి వివరాలు రాబట్టడానికి ప్రయత్నించారని, ఆమెను అనుమానితురాలిగా భావించి ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురి నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్లలో ఆమె ప్రమేయానికి సంబంధించిన వివరాలు ఉండడంతో వాటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఢిల్లీ లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూపు ప్రమేయంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో ఉన్న సంబంధాలు, ఎవరి ద్వారా పరిచయాలు ఏర్పడ్డాయి, ఎందుకు అవసరమయ్యాయని నిలదీసినట్టు తెలిసింది. గతంలో పిళ్లయ్, ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని అంశాల ఆధారంగా కవితను కార్నర్ చేసినట్టు సమాచారం. పిళ్లయ్‌తో జాయింట్ ఎంక్వయిరీలో కూడా వీటిపైనే ఈడీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అరుణ్ పిళ్లయ్ ఈడీ కస్టడీ సోమవారం మధ్యాహ్నానికి ముగుస్తుండడంతో లంచ్‌కు ముందే జాయింట్ ఎంక్వయిరీ పూర్తిచేసినట్టు తెలిసింది. సాయంత్రానికి మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాను కూడా కవితతో కలిపి విచారించినట్టు వార్తలు వచ్చినా ఈడీ వర్గాలు మాత్రం ధ్రువీకరించలేదు.
సౌత్ గ్రూపు, హవాలా డబ్బుపైనే ఫోకస్
ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ లాంఛనంగా ఫైనల్ కాకముందే సౌత్ గ్రూపు తరపున జరిగిన సంప్రదింపులు, టాక్స్ స్ట్రక్చర్‌లో జరిగిన మార్పులు, వాట్సాప్ ద్వారా జరిగిన సంభాషణలు, ముసాయిదా పాలసీ డాక్యుమెంట్‌ను సిగ్నల్ యాప్ ద్వారా షేర్ చేయడం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అడ్వాన్స్ కిక్‌బ్యాక్ రూపంలో.. హవాలా ద్వారా బదిలీ అయిన రూ.100 కోట్లు, ఫోన్లను తరచూ మార్చాల్సిన అవసరం.. ఇలాంటి పలు అంశాలపై కవిత నుంచి ఈడీ అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. కవితకు బినామీగా పిళ్లయ్ వ్యవహరించినట్టు ఈడీ అనుమానిస్తున్నందున.. ఆయనతో మధ్యాహ్నం వరకు ఆమెను జాయింట్‌గా విచారించినట్టు ఈడీ వర్గాల సమాచారం. గతంలోని స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు స్పెషల్ కోర్టులో ఆయన పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇద్దరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో లింకు కలపడానికి మీడియేటర్‌లుగా వ్యవహరించిన విజయ్ నాయర్, దినేశ్ అరోరా, సమీర్ మహేంద్రు తదితరుల గురించి ఆరా తీసిన ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో జరిగిన సమావేశం మొదలు కోహినూర్ హోటల్, ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్, ఒమెరాయ్ మెయిడెన్ హోటళ్లలో జరిగిన మీటింగులు, అందులో పాల్గొన్నవారు, జరిపిన చర్చలు, లిక్కర్ పాలసీలో అనుకూలంగా ఉండేలా నిబంధనలను మార్చాలని సిసోడియాకు పంపిన ప్రతిపాదనలు.. తదితరాలన్నింటి వివరాలను కవిత ముందు ఉంచి లోతైన వివరాలను రాబట్టినట్టు తెలిసింది.
మనీ లాండరింగ్ ఉల్లంఘనలపై ఆరా
ఇప్పటికే కవిత నుంచి పన్నెండు రకాల ఆర్థిక వివరాలను సేకరించిన ఈడీ అధికారులు.. ఢిల్లీకి తరలించిన కోట్లాది రూపాయల నగదు విషయాన్ని లోతుగా ప్రశ్నించినట్టు సమాచారం. హైదరాబాద్ కోహినూర్ హోటల్‌లో మొదలైన ముడుపుల వ్యవహారం చివరకు ఢిల్లీలోని బెంగాల్ మార్కెట్‌కు చేరే వరకు ఎవరి పాత్ర ఏ మేరకు ఉన్నదనే వివరాలను రాబట్టినట్టు సమాచారం. ఈడీ అధికారులు ఆశించిన సమాధానం కవిత నుంచి రాకపోవడంతో పక్కా ఆధారాలను ఆమె ముందు ఉంచి.. ఆమె వెల్లడించిన అంశాలను స్టేట్‌మెంట్ రూపంలో రికార్డు చేశారు. ఇక మొబైల్ ఫోన్లలో జరిగిన చాటింగ్, సిగ్నల్ యాప్ ద్వారా షేర్ అయిన డ్రాఫ్ట్ పాలసీ తదితరాలపై కూడా ప్రశ్నించిన అధికారులు.. పది మొబైల్ ఫోన్లను మార్చాల్సిన అవసరం, పాత ఫోన్లు ప్రస్తుతం ఎవరి దగ్గర ఉన్నాయో వివరాలను తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరిన ముడుపులు ఎవరికి చెందినవనే దానిపైనా ఆరా తీశారు. ఈ డబ్బుకు సంబంధించిన మూలాలను పసిగట్టడంపైనే ఈడీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. లిక్కర్ రిటైల్ జోన్లకు ఇంకా లైసెన్సులు జారీకాకముందే రూ.100 కోట్ల అడ్వాన్స్ కిక్‌బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇండో స్పిరిట్స్ కంపెనీ లాభాల్లో వాటా, పిళ్లయ్‌కు వ్యాపార భాగస్వామ్యం తదితరాల వివరాలను ఆరా తీసినట్టు తెలిసింది. సౌత్ గ్రూపు ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది, ఇందులో ఎంపీ మాగుంట, ఆయన కుమారుడు రాఘవ, శరత్‌చంద్రారెడ్డి తదితరుల పాత్ర ఏంటని ఆరా తీసినట్టు సమాచారం. వీటికి ఆమె ఏం సమాధానాలు చెప్పారనే విషయాలు ఈడీ సమర్పించే చార్జిషీట్ ద్వారా తెలియనున్నది.
ఏ తప్పూ చేయలేదు.. రాజకీయ కుట్ర
ఈడీ అధికారులు విచారణ ప్రారంభిస్తున్న సందర్భంలోనే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయమై కవిత ప్రస్తావించినట్టు తెలిసింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో మహిళగా తనను ఇంటి దగ్గరే విచారించాలని, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని వినియోగించుకుంటానని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఉదయం 11 గంటలకు రూమ్‌లోకి వెళ్లినా.. గంట తర్వాతనే ఇన్వెస్టిగేటింగ్ టీమ్ వచ్చినట్టు తన సన్నిహితులతో కవిత తెలిపిందనే లీకులు వెలువడ్డాయి. లిక్కర్ స్కామ్‌లో తాను ఏ తప్పూ చేయలేదని, తనకు ఎలాంటి సంబంధమూ లేదని, పలువురు వ్యక్తులు తన పేరును ప్రస్తావించడం వెనక రాజకీయ కుట్ర ఉన్నదంటూ ఈడీ అధికారులు వేసిన పలు ప్రశ్నలకు కవిత రిప్లయ్ ఇచ్చినట్టు ఆమె సన్నిహితులతో షేర్ చేసుకున్న అంశాలు బయటకు వచ్చాయి. మొబైల్ ఫోన్ల ధ్వంసం అంశం కూడా ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చి మీడియా ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నమేనంటూ ఆమె బాధపడినట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ప్రస్తావించిన కవిత.. దాని కన్నా ముందే ఎంక్వయిరీ తేదీలను ఈడీ ఫిక్స్ చేయడంపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గత విచారణ సందర్భంగా ఈడీ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్న ఫోన్ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించినట్టు సమాచారం. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ మొదలు కాకుండానే ఎంక్వయిరీ పేరుతో వేధించడంపై ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆమె తన సన్నిహితులతో పంచుకున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని ఈడీ అధికారులతోనే వాదించిన ఆమె.. ఇప్పటివరకు దాఖలు చేసిన రెండు చార్జిషీట్లలో తన పేరును ప్రస్తావించడంపై అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది.
ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
కవితను అరెస్టు చేసే అవకాశం ఉందనే అనుమానంతో ఉన్న బీఆర్ఎస్, భారత్ జాగృతి శ్రేణులకు.. సుమారు పది గంటల విచారణ తర్వాత కవిత బయటకు రావడం ఆనందం కలిగించింది. ఈడీ ఆఫీసు గేటు నుంచి వచ్చి కార్లో కూర్చున్న ఆమెకు గుమ్మడికాయతో దిష్టితీసి తీశారు. ఒకవైపు పారా మిలిటరీ బలగాల భద్రత పెరగడం, ఢిల్లీ పోలీసు ఎస్కార్టు వాహనం రావడం, కవిత తరఫున ముగ్గురు న్యాయవాదులను ఈడీ ఆఫీసుకి పిల్చుకోవడం, ఒక మహిళా వైద్యురాలితో కూడిన మెడికల్ టీమ్‌ను రావడాన్ని కళ్లారా చూసిన శ్రేణులు.. ఆమె అరెస్టు తప్పదనే అనుకున్నారు. పది గంటల విచారణలో ఆమె చెప్పిన వివరాలను స్టేట్‌మెంట్ రూపంలో రికార్డుచేసి ఆమె నుంచి సంతకాలు తీసుకుంటున్నట్టు న్యాయవాదుల ద్వారా తెలియడంతో బయటకు వస్తారని సంతోషపడ్డారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ తర్వాత రిలీఫ్ లభిస్తుందని కొండంత ఆశతో ఉన్న కవితకు.. మళ్లీ మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇకపైన ఏం జరుగుతుందోననే ఆందోళన కార్యకర్తల్లో, ఆమె సన్నిహితుల్లో మొదలైంది. జాయింట్ విచారణ పేరుతో సిసోడియా, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులతో కలిపి విచారిస్తారేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.