డిజిటల్ మీడియాపేరుతో కోట్ల రూపాయల నిధులు మాయం

by Mahesh |
డిజిటల్ మీడియాపేరుతో కోట్ల రూపాయల నిధులు మాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్(BRS) హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దొంగ బిల్లులతో రూ.కోట్ల నిధులు దుర్వినియోగం (Misappropriation of funds) చేసినట్టు సమాచారం. దీనిపై ఫోకస్ పెట్టిన ప్రస్తుత సర్కారు.. ఆ దిశగా ఆరా తీస్తున్నట్టు టాక్. డిజిటల్ మీడియా(Digital media) పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నామంటూ గత సర్కారు రూ.కోట్ల నిధులు మింగేసినట్టు అధికారులు గుర్తించారని తెలిసింది. నిధుల దుర్వినియోగం‌పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికల ముందు..

డిజిటల్ మీడియా ప్రచారం పేరుతో బీఆర్ఎస్ సర్కారు రూ.వందల కోట్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గత ఏడాది మే 22న (జీవో 742 ద్వారా) నాటి సర్కారు రూ.15 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించింది. ఈ నిధులను డిజిటల్ మీడియాకు విడుదల చేయాల్సిందిగా అప్పటి ఎక్స్‌అఫిషియో స్పెషల్ సెక్రటరీ కే అశోక్ రెడ్డి పేరు మీదుగా జీవో విడుదలైంది. ఈ నిధులను ఇష్టారీతిన ఖర్చు చేయడంతో పాటు తప్పుడు బిల్లులు సమర్పించినట్టు తాజాగా అధికారులు గుర్తించారు.

సోషల్ మీడియాలో వైరల్..

రూ.15 కోట్లకు సంబంధించిన ఓ జీవో కాపీ సోష‌ల్ మీడియాలో తాజాగా వైర‌ల్ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ నిధులు ఏమయ్యాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో పాపులర్ అయిన ఒక పాట కోసం, బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా అవసరాల నిమిత్తం పనిచేసిన వారి కోసం ఈ నిధులు వినియోగించారని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. డిజిటల్ మీడియా పేరుతో గత పదేండ్లలో రూ.వందల కోట్లను అప్పటి ప్రభుత్వం కాజేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ డబ్బుతో పార్టీ ప్రచారం!

ప్రభుత్వ డబ్బుతో పార్టీ ప్రచారం చేస్తూనే.. మరో వైపు ప్రతిపక్ష పార్టీలపై రాజకీయంగా తమకు గిట్టని వారిపైనా దుష్ప ప్రచారం చేస్తున్నారని, నాటి ప్రతిపక్ష పార్టీలు నేతలు ఆరోపించారు. ప్రతిపక్షాలతో పాటుగా డిజిటల్ మీడియా దుర్వినియోగంపై అందులో పనిచేసిన వారు సైతం స్వయంగా వివరాలను వెల్లడించారు. కానీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని బుజ్జగించి, బెదిరించి వివాదం తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసుకున్నట్టు టాక్.

డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్‌పై అవినీతి ఆరోపణలు

ఐటీ శాఖలో వివాదాలకు కేంద్ర బిందువుగా డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ నిలిచినట్టు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీలోనూ ఆయన చేస్తున్న పనులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, అసంతృప్తి అప్పట్లో వ్యక్తమైంది. కనీస పరిజ్ఞానం లేని వారిని, తనకు నచ్చిన వారికి, బంధువర్గానికి వేలల్లో జీతాలు ఇస్తూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం ఫోకస్ పెడితే మరిన్ని వివరాలు బయటకు..

ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి సారిస్తే.. డిజిటల్ మీడియా పేరుతో జరిగిన అవినీతి మొత్తం వెలుగులోకి వస్తుందని జీవో కాపీని చూపిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఫార్ములా- ఈ కార్ రేస్ వ్యవహరంలో నిబంధ‌న‌ల‌కు తుంగలో తొక్కి.. విదేశీ కంపెనీల‌కు రూ.55 కోట్లు కట్టిన బెట్టిన వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం ఆధారాలు సేకరించింది. ఈ నిధులు తన ఆదేశాల ద్వారానే ఇచ్చినట్టు స్వయంగా కేటీఆర్ అంగీకరించారు. తాజాగా డిజిటల్ మీడియా పేరుతో నిధుల దుర్వినియోగం వెలుగులోకి బయటకు రావడంతో బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. అధికార పార్టీపై పోరాటం చేయాలా? లేక తాము చేసిన వాటికి వివరణలు ఇచ్చుకోవాలా? అనే విషయం అర్థం కాక గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story