- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ వదిలిన బాణం ఆర్ఎస్పీ.. బీఎస్పీని నట్టేట ముంచారని విమర్శలు!
దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ కుటుంబ పాలన అంతమవ్వాలంటూ ధ్వజమెత్తిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కసారిగా తన స్వరాన్ని మార్చారు. మొన్నటి వరకు కుటుంబ పార్టీ అంటూ తీవ్ర విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు అదే పార్టీకి గులాంగా మారారు. బహుజనవాదినంటూనే ఆయన ఇప్పుడు అగ్రవర్ణాల జపం చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై తనను నమ్మి వచ్చిన వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఉన్నపళంగా పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన్ను నమ్మి వచ్చిన వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పలువురు నేతలు ఆయన నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి తన ముసుగును తొలగించి నిజస్వరూపాన్ని బయటపెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన వీఆర్ఎస్ తీసుకుని బీఎస్పీలో చేరిన సమయంలోనే ఆర్ఎస్‌పీని.. కేసీఆర్ వదిలిన బాణంగా రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇప్పడు ఆ విశ్లేషకుల మాటలే.. నిజమయ్యాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ పదవికి వీఆర్ఎస్ ఇచ్చి మరీ బహుజనవాదం పేరుతో బీఎస్పీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి గత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టినా..లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి సీన్ పూర్తిగా మారిపోయింది. కేవలం 951 రోజుల్లో బీఎస్పీని నట్టేట ముంచారనే విమర్శలు వస్తున్నాయి. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది తెలంగాణాలో మరోమారు రుజువుకానుంది. ఒకప్పుడు దొరల పాలన నుంచి తెలంగాణను విముక్తి కలిగించాల్సిన అవసరముందన్న ఆయనే ఇప్పుడు వారితోనే చేతులు కలపడంపై రాజకీయ వర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సాక్ష్యాలతో పలుమార్లు అయన విమర్శలు ఎక్కుపెట్టారు. అలాంటి ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఆశించి భంగపడ్డారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి అనుమతి లేకుండా ప్రవీణ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ప్రకటించడంపై ఆమె సీరియస్ అయినట్లు తెలిసింది. ఆ తర్వాత పొత్తుకు మాయావతి ఓకే చెప్పిందని, ఒప్పందం కుదిరిందని మీడియాకు చెప్పారు. పొత్తులో భాగంగా బీఆర్ఎస్..బీఎస్పీకి రెండు పార్లమెంట్ స్థానాలను కూడా కేటాయిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు నాగర్ కర్నూల్ స్థానాన్ని కేటాయిస్తానని చెప్పి రోజు తిరగకముందే.. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఎవరితోనూ పొత్తు లేదని, ఒంటరిగానే పోరు ఉంటుందని మాయావతి స్పష్టం చేయడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
రేపు గులాబీ గూటికి ఆర్ఎస్‌పీ!
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం గులాబీ గూటికి లాంఛనంగా చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గులాబీ బాస్ కేసీఆర్.. కీలకమైన పోస్టు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్, కేసీఆర్‌తో..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జతకట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తీసుకున్న నిర్ణయంపై అభిమానులు, మేధావులు, సామాజికవేత్తలు పెదవి విరుస్తున్నారు.మొత్తంగా 951 రోజుల ఆర్ఎస్పీ తన రాజకీయ ప్రయాణంలో బీఎస్పీ పార్టీని కేవలం వారం రోజులో తీసుకున్న సత్వర నిర్ణయాలు, పరిణామాలతో పార్టీకి గుడ్ బై పలకడం గమనార్హం.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ జర్నీ
= 8 ఆగస్టు 2021న బీఎస్పీలో చేరిక.
= 10 మార్చి 2024న బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు ఖరారని వెల్లడించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
= అదే రోజు ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ట్విటర్ వేదికగా వెల్లడి.
= 13 మార్చి 2024న కేసీఆర్ నివాసంలో బీఎస్పీ-బీఆర్ఎస్ నేతల కీలక భేటీ. భేటీకి హాజరైన బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సమన్వయ కర్త రాంజీ గౌతమ్, ఆర్ఎస్‌పీ, రాష్ట్ర కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్, ఇరు పార్టీల మధ్య చర్చలు సఫలం.
= మార్చి 15న నాగర్ కర్నూల్‌లో కాన్షీరాం జయంతిలో బీఎస్పీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు ఖరారని స్పష్టం, పొత్తులో భాగంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలు బీఎస్పీకి కేటాయించారని ప్రకటన.
= మార్చి 16న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా, బీఎస్పీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు విఫలం, 16 మార్చి 2024 నాటికి 951 రోజుల పాటు ఆయన బీఎస్పీలో కొనసాగారు.
= ఈ నెల 18న ఆర్ఎస్పీ బీఆర్ఎస్‌లో చేరే అవకాశముంది.