Banks: ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరించే కుట్ర.. సీపీఐ కూనంనేని కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
Banks: ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరించే కుట్ర.. సీపీఐ కూనంనేని కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు పాలకులు చేస్తున్న కుట్రలను బ్యాంకుల ఉద్యోగులు సమర్ధవంతంగా ఎదుర్కొవాలని (Kunamneni Sambasiva Rao) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందు కోసం బ్యాంక్ యూనియన్లు (Unions) చేసే పోరాటాలకు సీపీఐ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా ఆర్థిక రంగంలో సైనికులైన బ్యాంకింగ్ ఉద్యోగులు కార్యాచరణతో ఉద్యమించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు చట్టం సాక్షిగా శ్రమ దోపిడీ చేపిస్తున్నారని, ఒక్క ఉద్యోగికి చెల్లించాల్సిన వేతనాన్ని పది కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ కార్మికులకు చెల్లిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో ఎంత పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చినా భారత్ తట్టుకుని నిలబడడానికి కారణం దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులేనని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ కాచిగూడలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎపీటీబీఈఎఫ్) 30వ త్రైవార్షిక మహాసభలలో ఆదివారం సభను ఉద్దేశించి కూనంనేని ప్రసంగించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు పాలకుల కనుసన్నల్లో పనిచేయకుండా, నిజాయితీగా నిలబడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుండడం వల్లనే జాతీయ బ్యాంకులు మనుగడను సాగిస్తున్నాయన్నారు.

Next Story

Most Viewed