మాజీ మంత్రి తలసానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఏసీబీ..!

by GSrikanth |
మాజీ మంత్రి తలసానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఏసీబీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి అప్పటి మంత్రులు, అధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి. గొర్రెల స్కీమ్‌లో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిక్కుల్లో చిక్కుకున్నారు. కేసులు, ఎఫ్ఐఆర్ సంగతి ఎలా ఉన్నా.. మంత్రి కనుసన్నల్లోనే అధికారులు ఈ అవినీతికి పాల్పడ్డారనే అంశంతో ఆయన నైతికంగా నిందలను మోయాల్సి వస్తున్నది. విజయ డెయిరీ విషయంలో ఇప్పటికే పలు ఆరోపణలు రాగా, ఇప్పుడు గొర్రెల స్కీమ్ అవకతవకలూ వెలుగులోకి వచ్చాయి. వాటితో ఆయనకున్న సంబంధం గురించి తలసాని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పశుసంవర్థక శాఖ అధికారులపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ స్కామ్‌లో మంత్రి ప్రమేయం ఏ మేరకు ఉన్నదనేది దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నది. కాగా, త్వరలో ఈ శాఖపై ఉన్నత స్థాయిలో రివ్యూ నిర్వహించనున్నట్లు సమాచారం.

అవినీతి నిజమేనన్న కాగ్

పశుసంవర్ధక శాఖ తరఫున జరిగిన ఉచిత గొర్రెల పంపిణీ స్కీమ్‌లో రెండేండ్ల క్రితమే అవకతవకలు జరిగాయంటూ ఉదాహరణలు, వివరణలతో సహా ‘కాగ్’ బయటపెట్టింది. అసెంబ్లీకి సమర్పించిన నివేదికలోనే ఈ అంశాలను బహిర్గతం చేసింది. ఏయే రూపాల్లో ప్రజాధనం ఎలా దుర్వినియోగమైందో, లబ్ధిదారులకు ఎలా నష్టం జరిగిందో, తప్పుడు లెక్కలతో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎన్ని జరిగాయో ఆ నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. ఈ అవినీతి మచ్చ ఉండగానే ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు రూ. 2.17 కోట్లు మోసపోయామంటూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయంగా దక్కాల్సిన నిధులు బినామీల ఖాతాల్లోకి దారి మళ్లాయని వాపోయారు.

ఏసీబీకి కేసు బదిలీ

ఈ కేసును అవినీతి నిరోధక శాఖకు పోలీసులు బదిలీ చేశారు. దీంతో ప్రకాశం జిల్లా నుంచి బాధితుల్ని పిలిపించిన ఏసీబీ పోలీసులు వివరాలను సేకరించారు. తెలంగాణ పశు సంవర్ధక శాఖ తరఫున గొర్రెలను కొనుగోలు చేయడానికి ప్రకాశం జిల్లాకు వెళ్లి సంప్రదింపులు జరిపిన అధికారుల పేర్లను ఆరా తీశారు. బాధితుల నుంచి స్టేట్‌‌మెంట్లను రికార్డు చేశారు. రెండో దశ గొర్రెల స్కీమ్ అమలు కోసం ప్రకాశం జిల్లాకు వచ్చి తమను సంప్రదించారని, 130 యూనిట్లను (ఒక్కో యూనిట్‌కు 21) 17 మంది అమ్మారని, వాటికి డబ్బులు చెల్లిస్తామంటూ తమ ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్‌ను తీసుకున్నారని, ఇప్పటివరకు జమ చేయలేదని.. ఇలాంటి అంశాలన్నింటినీ ఏసీబీ అధికారులకు బాధిత రైతులు వివరించారు.

తెలంగాణ పశు సంవర్ధక శాఖ తరఫున విక్రమ్ అనే అధికారితో పాటు వెటర్నరీ డాక్టర్ శివసాయి, మధ్యవర్తిగా మొహియుద్దీన్ కలిసి వచ్చారని, గతేడాది విక్రయించినా ఇప్పటికీ డబ్బులు తమ ఖాతాల్లో పడకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. అధికారుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చడంతో వారిని కూడా ఏసీబీ అధికారులు పిలిచి ప్రశ్నించే అవకాశమున్నది. మంత్రికి తెలియకుండా ఈ అవినీతి జరిగిందా?.. లేక మంత్రి ఆదేశాలతోనే జరిగిందా అనేది ఏసీబీ దర్యాప్తు అనంతరం స్పష్టం కానున్నది. ఏసీబీ ఎంక్వయిరీలో పశు సంవర్ధక అధికారులు మంత్రి పేరును వెల్లడిస్తారా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

‘డిపార్ట్ మెంట్’లో చర్చలు

గతంలో ఫార్ములా ఈ-రేస్ విషయంలో మంత్రి (కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ) మౌఖిక ఆదేశాలతోనే ప్రభుత్వ డబ్బును ప్రైవేటు కంపెనీకి ఇచ్చినట్లు అప్పటి పురపాలక శాఖ స్పెషల్ సీఎస్, ఐఏఎస్ అధికారి అరవింద్ చెప్పారు. ఇప్పుడు గొర్రెల స్కామ్ విషయంలోనూ అలాంటిదే రిపీట్ అవుతుందా అనేది తేలాల్సి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పశు సంవర్ధక శాఖకు సంబంధించిన ఫైళ్లను రహస్యంగా వ్యాన్‌లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దానిపై నాంపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. దానిపైనా దర్యాప్తు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రకాశం జిల్లా రైతుల ఫిర్యాదుతో మరో కేసుపై ఏసీబీ రంగంలోకి దిగింది. ఇవన్నీ ఏ మలుపు తిరుగుతాయో.. చివరకు అప్పటి మంత్రి తలసాని మెడకు ఎలా చుట్టుకుంటుందోనని డిపార్టుమెంటు సిబ్బందిలో చర్చలు మొదలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed