BJLP leader Eleti : తెలంగాణలో కాంగ్రెస్ అవినీతి పాలన : ఏలేటి

by Y. Venkata Narasimha Reddy |
BJLP leader Eleti : తెలంగాణలో కాంగ్రెస్ అవినీతి పాలన : ఏలేటి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అవినీతిమయమైన పరిపాలన సాగిస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి( BJLP leader Eleti Maheshwar Reddy) విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి, వసూళ్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, అదే సమయంలో అడ్మినిస్ట్రేషన్ మాత్రం సరిగ్గా కొనసాగడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో అన్ని అంశాలు అవినీతిమయమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టులు, కమిషన్ల దందా సాగుతోందని విమర్శించారు. జీవోలను కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదన్నారు. కేవలం ఢిల్లీకి వందల కోట్ల చెల్లించేందుకు వసూళ్లు చేయడమే తప్పా ప్రజలకు ఇచ్చిన హామీలపై ధ్యాస లేదన్నారు. 1150కోట్ల సివిల్ సఫ్లయ్ కుంభకోణంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల నుంచి రికవరీ చేయకుండా మళ్లీ ధాన్యం అప్పగిస్తున్నారన్నారు. దీని వెనుక చీకటి ఒప్పందం ఏమిటని నిలదీశారు. ఇందులో సీఎంకు, సివిల్ సఫ్లయ్ మంత్రుల ప్రమేయం ఏమిటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలకులు మిల్లర్ల నుంచి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో జీవో ఎంఎస్ 27తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకే బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. 20వేల కోట్ల ధాన్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉందని చెప్పిన సివిల్ సఫ్లయ్ మంత్రి రికవరీ ఎందుకు చేయడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని, ప్రజా క్షేత్రంలో పోరాడుతామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనా విధానాలనే అనుసరిస్తూ వందల కోట్ల దోపిడికి కాంగ్రెస్ పాలకులు పాల్పడుతున్నారన్నారు. మిల్లర్లు, కాంట్రాక్టర్ల డీ ఫాల్టర్ల లిస్టును బయటపెట్టమంటే ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు. సన్ని బియ్యం నిబంధనల అమలు సాధ్యం కాదని మిల్లర్లు చెప్పినా ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూడటం లేదన్నారు.

Advertisement

Next Story