- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అంత హడావుడి ఎందుకు?.. గాంధేయవాదిగా పేరున్న ఆమెపై తొలిసారి విమర్శలు

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తీరుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇన్‌చార్జి హోదాలో ఉన్న ఆమె ప్రభుత్వానికి, పార్టీకి సపోర్టుగా ఉండాలి. కానీ, ఆమె వ్యవహారశైలి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్‌సీయూ భూ వివాదం పరిష్కారం పేరుతో ఆమె చేసిన హడావుడి వలన అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మేలు కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోందని సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన నటరాజన్.. మంత్రులు, స్టూడెంట్స్, సివిల్ సొసైటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీంతో మీనాక్షి తీరుపై అటు విపక్షాలు, ఇటు సొంత పక్షం నుంచి విమర్శలొస్తున్నాయి.
ఇరకాటంలో ప్రభుత్వం..
గాంధేయవాదిగా, నిరాడంబర నాయకురాలిగా పేరున్న మీనాక్షి నటరాజన్‌పై తొలిసారి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇన్‌చార్జిల కన్నా ప్రజాస్వామిక వాదిగా వ్యవహరిస్తారని అందరూ భావించారు. కానీ, ప్రస్తుత పర్యటనలో ఆమె పనితీరును సొంత పార్టీ లీడర్లే తప్పు పడుతున్నారు. ఆమె ఏ హోదాలో మంత్రుల కమిటీతో సెక్రెటేరియట్‌లో సమావేశం అవుతారు? ఏ హోదాలో సెంట్రల్ వర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్‌తో భేటీ అయ్యారు? ఏ అధికారంతో సివిల్ సోసైటీ ప్రతినిధులతో మంతనాలు జరుపుతారు? అని సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ పనులన్నీ సీఎం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నిర్వర్తించాలి. కానీ, ఆ కమిటీని సెక్రెటేరియట్‌కే పరిమితం చేసి ఆమె రంగంలోకి దిగడం ఏంటీ? ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వం కంటే పార్టీ ఇన్‌చార్జి హోదా ఎక్కువనా? అని చర్చించుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం అటు ప్రభుత్వాన్ని, ఇటు సీఎంను ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇవి భవిష్యత్‌లో విపక్షాల విమర్శలకు అస్త్రంగా మారుతాయని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించాల్సిన పార్టీ ప్రతినిధే సమస్యగా మారడం సరైంది కాదని ఆవేదన చెందుతున్నారు.
మంత్రుల కమిటీ ప్రకటన తెల్లారే రంగంలోకి..
సెంట్రల్ వర్సిటీని ఆనుకుని ఉన్న భూములపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఈనెల 3న సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. అందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జేఏసీ, సివిల్ సోసైటీ గ్రూప్స్, స్టూడెంట్స్ ప్రతినిధులు, ఇతర స్టేక్ హోల్డర్స్‌తో సంప్రదింపులు జరుపుతారని పేర్కొన్నారు. కానీ, మరుసటి రోజే ఇన్‌చార్జి నటరాజన్ హైదరాబాద్‌కు వచ్చి ఆ కమిటీ చేయాల్సిన పనులను ఆమె చేయడం మొదలెట్టింది. మంత్రులతో మాట్లాడటం, యూనివర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్‌తో చర్చలు జరపడం, సివిల్ సోసైటీ ప్రతినిధులతో మంతనాలు చేయడం వల్ల ప్రభుత్వ గ్రాఫ్‌ను తగ్గించే విధంగా ఆమె వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి.
ఇంటర్నల్ పనులు పబ్లిక్‌లో చేస్తారా?
రాష్ట్ర ప్రభుత్వాలు గాడి తప్పినప్పుడు జాతీయ పార్టీలు రంగంలోకి దిగడం సహజం. ఆ సమయంలో పార్టీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి సమస్యను స్టడీ చేసి పరిష్కారం చూపేందుకు చొరవ చూపుతారు. కానీ, ఇదంత నాలుగు గోడల మధ్య లేకపోతే పార్టీ ఆఫీసులో జరగాల్సిన పని. హెచ్‌సీయూ వివాదంలో మాత్రం నటరాజన్ సీఎంను, మంత్రులను గాంధీభవన్‌కు పిలిచి ప్రభుత్వ ఆలోచనలు తెలుసుకోవచ్చు. వీలుకాకపోతే ఆమెనే స్వయంగా సీఎం, మంత్రుల ఇంటికి వెళ్లి అక్కడే మంతనాలు జరపొచ్చు. అలాగే.. యూనవర్సిటీ స్టూడెంట్స్‌ను, సివిల్ సోసైటీ ప్రతినిధులను తను బస చేస్తోన్న హోటల్ లేదా గెస్ట్ హౌజ్‌కు పిలిచి మాట్లాడవచ్చు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత వివాద పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను సీఎం, మంత్రులకు వివరించి.. వాటిని ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించాలి. కానీ. పబ్లిక్‌గా నటరాజన్ వ్యవహరించిన తీరు వల్ల కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదముందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.
వరుస హడావుడి..
హెచ్‌సీయూ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో ఆమె రాష్ట్రానికి వచ్చారు. వచ్చి రాగానే ఈ నెల 5న సెక్రెటేరియట్‌కు వెళ్లి మంత్రుల కమిటీతో సమావేశం అయ్యారు. భూ వివాదంపై ప్రభుత్వ వైఖరిని అడిగి తెలుసుకున్నారు. తెల్లారి 6వ తేదీన సెంట్రల్ వర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్‌తో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వివాదాస్పదమైన భూమిలోకి వెళ్లేందుకు నటరాజన్ ప్రయత్నించగా పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. అదే రోజూ సివిల్ సొసైటీ ప్రతినిధులతో జూమ్‌లో మీటింగ్ నిర్వహించారు. మళ్లీ ఈనెల7న సెక్రెటేరియట్‌కు వచ్చి మంత్రుల కమిటీతో సమావేశమై వెళ్లిపోయారు.