4 నెలలుగా ఎన్నో అవమానాలు.. ఆఖరికి నాకు ఈ స్థితి : జీవన్ రెడ్డి ఆవేదన

by Rani Yarlagadda |   ( Updated:2024-10-23 06:50:24.0  )
4 నెలలుగా ఎన్నో అవమానాలు.. ఆఖరికి నాకు ఈ స్థితి : జీవన్ రెడ్డి ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అనుచరుడు, మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి హత్యతో ఆ పార్టీలో విబేధాలు బయటికొచ్చాయి. గంగారెడ్డిని హత్య (Gangareddy Murder) చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. నిన్న జీవన్ రెడ్డి ధర్నా చేసిన విషయం తెలిసిందే. మీకు, మీ పార్టీకో దండం అంటూ.. కాంగ్రెస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనానికి దారితీశాయి. తాజాగా మరోసారి కాంగ్రెస్ ను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ విధివిధానాలకు విరుద్ధంగా చేరికలు జరుగుతున్నాయని ఆరోపించారు.

బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్(Congress)లో చేరిన వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమన్న ఆయన.. మొదటి నుంచి ఫిరాయింపులు మంచి పద్ధతి కాదని తాను చెబుతూనే ఉన్నానన్నారు. పార్టీ ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన అనుభవం నేడు ప్రశ్నార్థకంగా మారిందని, 4 నెలలుగా అవమానాలకు గురవుతూనే ఉన్నానని వాపోయారు. తాను కూడా కాంగ్రెస్ నేతనే అని చెప్పుకునే స్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలన్న చట్టం ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చినవారిని, ఎంఐఎంను మినహాయించినా.. కాంగ్రెస్ కు కావలసినంత మెజారిటీ ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed