Eatala Rajender: దేవుడిపై ఒట్లు వేసి ఇప్పుడు సప్పుడు జేస్తలే.. రుణమాఫీపై ఈటల రాజేందర్ విమర్శలు

by Prasad Jukanti |
Eatala Rajender: దేవుడిపై ఒట్లు వేసి ఇప్పుడు సప్పుడు జేస్తలే.. రుణమాఫీపై ఈటల రాజేందర్ విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయమంటే పిల్లి గంతులు వేస్తూ దిక్కులు చూస్తున్నారే తప్ప చప్పుడు చేయడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డితో సహా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే 6 గ్యారంటీలు ఇచ్చారని, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి రుణాలు లేని రైతులు వెంటనే బ్యాంకుకు వెళ్లి రుణం తీసుకోవాలని, ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పారన్నారు. హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వరకు రుణమాఫీ చేయలేదన్నారు. రైతులకిచ్చిన హామీలను నెరవేర్చేలా.. ప్రభుత్వం మెడలు వంచి ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు 24 గంటలపాటు ఇందిరాపార్క్ దగ్గర రైతు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులందరూ పాల్గొంటారని వెల్లడించారు.

నమ్మకం పోతుందని మొదలు పెట్టి..

రేవంత్ రెడ్డి అబద్ధాలే జీవితంగా బ్రతుకుతున్నారని ఈటల విమర్శించారు. రైతన్నలకు నష్టం చేస్తే మంచిది కాదనే సోయి రేవంత్ రెడ్డికి లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రేవంత్ రెడ్డి మాటలు చూస్తే ఇవి అమలు చేసే విధంగా కనిపించడం లేదన్నారు.ప్రభుత్వం మెడలు వంచడానికి మీ పక్షాన మేము చేస్తున్న దీక్షకు తరలిరావాలని రైతులకు పిలుపునిచ్చారు. ఘట్ కేసరిలో 1206 మంది రైతులు రుణం తీసుకుంటే ఇంకా 1006 మందికి రుణమాఫీ కాలేదు. పూడూరు సొసైటీలో కూడా రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ విషయంలో ప్రజల్లో నమ్మకం పోతుందన్న క్రమంలో మిగతా అన్ని కార్యక్రమాల నిధులు ఆపి రైతు రుణమాఫీ మొదలుపెట్టారని అందులోనూ రకరకాల నిబంధనలతో దాన్ని తగ్గించే ప్రయత్నం చేయబోతే రైతుల ఆగ్రహానికి తోక ముడిచి అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని ఒక ప్రకటన చేశారు తప్ప ఇప్పటివరకు ఎంత రుణమాఫీ అయిందనేది అధికారుల దగ్గర కూడా లెక్కలేదన్నారు. రుణమాఫీ జరగలేదని మేడ్చల్లో ఎంపీడీవో ఆఫీసులో ఒక రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. రైతులకు భరోసా కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులందరూ కలిసి ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఏ పాల్వాయి హరీష్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed