- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ సర్కార్ ఎదుట BIG టాస్క్.. బయటపడేదెలా?
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. గత పదేండ్ల పాలనలో పాలకుల నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే ట్రాన్స్ కో, జెన్ కో.. రెండు డిస్కంలు సంక్షోభంలో చిక్కుకుపోయాయని అందులో వెల్లడించింది. రెండు డిస్కంలు సుమారు రూ. 62,461 కోట్ల నష్టాల్లో ఉంటే, అందులో ప్రభుత్వ కార్యాలయాల నుంచి వసూలు కావాల్సినవే సుమారు రూ. 28,842 కోట్ల మేరకు ఉన్నాయి. కాళేశ్వరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులకు వినియోగిస్తున్న లిఫ్టు పంపుల కరెంటు బిల్లులే దాదాపు రూ. 14,193 కోట్లు ఉన్నాయి. సిద్దిపేట, గజ్వేల్, పాతబస్తీ ప్రాంతాల్లో వసూలు కావాల్సిన బకాయిలు గణనీయంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు డిస్కమ్ లను గాడిలో పెట్టడం, నష్టాలను పూడ్చడం, అప్పుల నుంచి గట్టెక్కించడం, వ్యవసాయానికి ఇప్పుడున్నట్లుగానే 24 గంటలూ ఉచితంగా కరెంటు ఇవ్వడం, సిక్స్ గ్యారెంటీస్‌లో ఒకటైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది. పదేండ్ల పాలనలోని లోపాలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని చక్కదిద్దడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
భారమంతా మళ్లీ ప్రభుత్వంపైనే..
ప్రభుత్వ విభాగాల్లో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, జలమండలి, మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు.. ఇలాంటి ప్రభుత్వ విభాగాల బకాయిలు వేల కోట్లల్లోనే ఉన్నాయి. వీటిని వసూలు చేసుకోవడంతో డిస్కంలు ఒకింత నష్టాలను పూడ్చుకునే అవకాశమున్నా.. అవి చెల్లించాలంటే మళ్లీ ప్రభుత్వ బడ్జెట్ నిధులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. చివరకు ప్రభుత్వానికే భారంగా మారనున్నది. ఏకకాలంలో అప్పులను తీర్చడం, నష్టాల నుంచి గట్టెక్కించడం ప్రభుత్వానికి చాలెంజింగ్ టాస్క్.
బయటపడేదెలా?
రాష్ట్ర అవసరాలకు తగినంత విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం ప్రభుత్వానికి అనివార్యం. దీనికి క్రమం తప్పకుండా చెల్లింపు చేయడంతోపాటు లీకేజీలను నివారించుకోవడం, మొండి బకాయిలను వసూలు చేసుకోవడం తక్షణ కర్తవ్యంగా మారింది. మరోవైపు సింగరేణికి, జెన్ కో సంస్థలకు డిస్కంలు పడిన బకాయిలను చెల్లించకుంటే అవి కూడా మరింత సంక్షోభంలోకి కూరుకుపోతాయి. గత ప్రభుత్వ వైఫల్యాలను వైట్ పేపర్ రూపంలో రిలీజ్ చేసి అసెంబ్లీ వేదికగా చర్చించి ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. కానీ అధిగమించడానికి, ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి, నష్టాల నుంచి బైటపడడానికి సర్కారు ఎలాంటి వ్యూహాన్ని రూపొందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
పదేండ్ల కాలంలో విద్యుత్ రంగాన్ని రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావు సక్సెస్‌ఫుల్‌గా నడిపారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ఆయనను ప్రశంసించారు. కానీ పదేండ్లలో ఆయన నిర్వహణ కంటే నిర్వాకమే ఎక్కువగా ఉన్నదని, లెక్కలేవీ బయటకు రాకుండా ఇంతకాలం గోప్యంగా ఉంచి ప్రజలను మభ్యపెట్టారని కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఆరోపించారు. పాత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమైనా.. ఇప్పుడు సమర్థవంతంగా విద్యుత్ రంగాన్ని సంస్కరించడం, రానున్న రోజుల్లో నిరంతరాయంగా కరెంటును సరఫరా చేసి నష్టాల ఊబి నుంచి బయటకు లాగడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందు ఉన్న అతి పెద్ద సవాలు.
కొనుగోలు ఒప్పందంపై దర్యాప్తు!
ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సహా భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లలోని కుంభకోణంపై దర్యాప్తునకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఇప్పుడూ (కార్యదర్శులు, సీఎండీలు మినహా) పనిచేస్తున్నందున ఎలాంటి పనితనం చూపిస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తున్నది. పరిమిత వనరులతో ఏ రంగానికీ విద్యుత్ లోటు లేకుండా స్వయంప్రతిపత్తితో విద్యుత్ వ్యవస్థలు ఫంక్షన్ కావడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు పరీక్షగా మారింది.