Tpcc Chief : టీపీసీసీ నియామకంలో వైఎస్సార్ నాటి స్ట్రాటజీ.. మరింత హోరాహోరీగా తెలంగాణ రాజకీయం!

by Prasad Jukanti |
Tpcc Chief : టీపీసీసీ నియామకంలో వైఎస్సార్ నాటి స్ట్రాటజీ.. మరింత హోరాహోరీగా తెలంగాణ రాజకీయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త బాస్ ఖరారయ్యారు. టీపీసీసీ చీఫ్‌గా బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమిస్తూ ఇవాళ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు టీపీసీసీ బాధ్యతలు నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డిని పార్టీ అభినందించింది. పీసీసీ రేస్‌లో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్ పేర్లు బలంగా వినిపించినా అధిష్టానం మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్‌కుమార్ వైపు మొగ్గు చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2 వారాల క్రితమే ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన ఏఐసీసీ తాజాగా అధికారికంగా ప్రకటించింది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగో పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ రికార్డుకెక్కారు.

సీఎం సౌత్ తెలంగాణ, పీసీసీ నార్త్ తెలంగాణ..

పీసీసీ ఎంపిక విషయంలో అధిష్టానం వైఎస్సార్ హయాంలో అనుసరించిన ఈక్వేషన్‌నే మరోసారి రిపీట్ చేసిందనే చర్చ జరుగుతున్నది. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత డి.శ్రీనివాస్‌కు పీసీసీ పగ్గాలు అప్పగించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి కొనసాగుతుండగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించింది. ఇక సీఎం రేవంత్ దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి కాగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తర తెలంగాణకు చెందినవారు. పదవుల విషయంలో అధిష్టానం ప్రాంతాల మధ్య సమ ప్రాధాన్యత కల్పించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా పార్టీలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లకు సన్నిహితుడిగా మహేశ్ కుమార్‌కు పేరుంది.

ఎన్ఎస్‌యూఐ‌తో రాజకీయ ప్రస్థానం..

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం రహమత్‌నగర్‌కు చెందిన మహేశ్‌కుమార్‌గౌడ్ ఎన్ఎస్‌యూఐతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 90వ దశకంలో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేపట్టారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న వయసులోనే డిచ్‌పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పీసీసీ కార్యదర్శి, అధికార ప్రతినిధి, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2021లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సీటు ఆశించగా కామారెడ్డిలో సీఎం రేవంత్ పోటీకి దిగడంతో తన సీటును షబ్బీర్ అలీకి త్యాగం చేశారు.

మహేశ్ ముందు స్థానిక ఎన్నికల టాస్క్..

కొత్త పీసీసీగా అధ్యక్షుడికి స్థానిక సంస్థల ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అమీతుమీకి రెడీ అవుతున్న క్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌‌కు సవాలుగా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ, పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాల పట్ల ఆయన కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠ..

పీసీసీ అధ్యక్షుడి విషయంలో ఉత్కంఠకు తెరపడటంతో అందరి దృష్టి బీజేపీపై పడింది. కమలం పార్టీ అధ్యక్షుడి విషయంలో కసరత్తు చేస్తున్నప్పటికీ ఎటూ తేలడం లేదు. 2028లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీబీజేపీ కొత్త అధ్యక్షుడి విషయంలో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ పేరు ముందు వరుసలో వినిపిస్తుంది. డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, రామచంద్రరావు పేర్లు సైతం బలంగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది.

Advertisement

Next Story

Most Viewed