థాక్రేపై కాంగ్రెస్ బీసీ నేతల గుస్సా.. YCP ఎంపీతో పనేంటని గరం గరం..!

by Satheesh |   ( Updated:2023-08-02 11:47:35.0  )
థాక్రేపై కాంగ్రెస్ బీసీ నేతల గుస్సా.. YCP ఎంపీతో పనేంటని గరం గరం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే, సీనియర్ నేత వి.హనుమంతరావు శనివారం భేటీ అయ్యారు. తమకు మాట అయినా చెప్పకుండా.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా థాక్రే, హనుమంతరావు నేరుగా కృష్ణయ్య ఇంటికి వెళ్లడంపై కాంగ్రెస్ బీసీ నేతల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. థాక్రే తీరు సొంత పార్టీ నేతలను అవమానపరిచేలా ఉందంటూ మండిపడుతున్నారు. థాక్రే మాత్రం ఆర్.కృష్ణయ్య చేస్తున్న పోరాటం.. కాంగ్రెస్ లక్ష్యం ఒకటే అని సర్దిచెబుతున్నారు. కృష్ణయ్య 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

అయితే.. థాక్రే వివరణను కాంగ్రెస్ శ్రేణులు అంగీకరించడం లేదని తెలుస్తోంది. కృష్ణయ్య ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, ఇతర పార్టీ నేతలను రాష్ట్ర ఇన్‌చార్జి ఎలా కలుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన వైసీపీకి చెందిన వ్యక్తితో ఎలా భేటీ అవుతారని శ్రేణులు గుస్స అవుతున్నాయి. అయితే.. పార్టీ అధిష్టానం మేరకే థాక్రే.. కృష్ణయ్యతో భేటీ అయినట్లు మరోవైపు శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. బీసీ అజెండాతోనే కృష్ణయ్యతో భేటీ అయ్యారని, అందుకే సీనియర్ నేత వి.హనుమంతరావును వెంటబెట్టుకొని వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీసీ రిజర్వేషన్ల కోసమే భేటీ..

కాగా.. థాక్రే భేటీపై కృష్ణయ్య వివరణ ఇచ్చారు. ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర విద్యా కోర్సుల్లో ఓబీసీ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచడం, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు వంటి 18 డిమాండ్లపై థాక్రేకు రిప్రజెంటేషన్ సమర్పించానని తెలిపారు. ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని, కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ మంత్రిని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ వచ్చిందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed