Waqf Board : తెలంగాణలో గందరగోళం.. పట్టా భూములన్నీ వక్ఫ్ ఆస్తులు అవుతాయా?

by Gantepaka Srikanth |
Waqf Board : తెలంగాణలో గందరగోళం.. పట్టా భూములన్నీ వక్ఫ్ ఆస్తులు అవుతాయా?
X

తెలంగాణలో ఐదేండ్లుగా నిషేధిత భూముల జాబితాపై అనేక అనుమానాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూములుగానే ఉంటాయి. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే గానీ అసలు విషయం బయటపడదు. ఆ సర్వే నంబర్ మొత్తం రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదంటారు. నిజానికి ఆ భూములన్నీ తరతరాలుగా చేతులు మారినవే.. తాత ముత్తాతల నుంచి అనుభవిస్తున్నదే. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్స్ వక్ఫ్ కి చెందిన ఆస్తులంటూ ధరణి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల వెబ్ సైట్‌లో పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో నమోదు చేసి వేలమందిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వక్ఫ్ బోర్డు 2007 లో నోటిఫై చేసినట్లుగా రికార్డులు చూపిస్తారు. ఇక్కడే అనుమానం కలుగుతుంది. 70 ఏండ్ల నుంచి పట్టాగా ఉంటే అప్పుడేం చేశారు? ఎన్నో చేతులు మారుతుంటే కళ్లు మూసుకున్నారా? తరతరాలుగా కుటుంబాలు ఆ భూమిని సాగు చేసుకుంటూ బతుకుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? ఇప్పుడు ఆకస్మాత్తుగా ఒక్క నోటిఫికేషన్ ద్వారా పట్టా భూములు వక్ఫ్ గా మార్చేస్తే సామాన్య రైతులు ఎక్కడికి పోవాలి? అయినా వక్ఫ్ బోర్డుకు లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? అది నిజంగా వక్ఫ్‌దే అయితే వాటి మీద ఆధారపడి బతుకుతున్న వారికి ఎలా న్యాయం చేస్తారు? దీనికి వక్ఫ్ బోర్డు, ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. = శిరందాస్ ప్రవీణ్ కుమార్

నోటీసుతోనే హక్కులు ఎలా వస్తాయి?

(మధ్యప్రదేశ్ హైకోర్టులో వక్ఫ్ ప్రాపర్టీపై న్యాయమూర్తి, లాయర్లకు మధ్య గత ఆగస్టు నెలలో జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ముస్లిం వక్ఫ్ బోర్డు ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంటును క్లెయిమ్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది)

న్యాయమూర్తి: లాయర్ గారు మీరు ఏ ప్రాపర్టీ అయితే వక్ఫ్ బోర్డ్ ది అని చెబుతున్నారో అది వక్ఫ్ బోర్డ్‌ది ఎలా అయింది?

లాయర్ : వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం 1989లో ముస్లింలకు కొన్ని హక్కులు కల్పించింది. అవి ఏమిటంటే ముస్లింలు ఎక్కడ స్థలం ఉన్నా, ఎటువంటి కన్స్‌స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ అయినా.. ప్రైవేటైనా, గవర్నమెంట్ అయినా.. వక్ఫ్ బోర్డ్ ఒక నోటీసు పంపిస్తే ఆ నోటీసు పంపించిన రోజు నుంచి వక్ఫ్ బోర్డుకు చెందుతుంది.

న్యాయమూర్తి: ఇప్పుడు మీ ఇంటికి వక్ఫ్ బోర్డు పేరుతో ఒక నోటీసు వస్తుంది. మీ ఇల్లు ఖాళీ చేయమంటారు. అప్పుడు మీరు ఇల్లు విడిచి వెళ్తారా? లేక ఆ ఇల్లు నాది అని కోర్టును ఆశ్రయిస్తారా?

లాయర్: అది కాదు సార్. 1989లో చట్టంలో సవరణల ప్రకారం వక్ఫ్ బోర్డ్ నోటీస్ ఇచ్చింది. కాబట్టి అది వక్ఫ్ బోర్డ్ ఆస్తిగా ప్రకటించుకోవచ్చు.

న్యాయమూర్తి: ఒక వ్యక్తి గాని ఒక సంస్థ గాని నోటీసు పంపించినంత మాత్రాన ప్రాపర్టీ వాళ్లదేనని ఎలా నిర్ధారిస్తారు? ప్రాపర్టీ అంతకుముందు ఎవరిది? ఆ ప్రాపర్టీ యజమాని ఎవరు? వక్ఫ్ బోర్డ్‌లోకి ఎలా వెళ్లింది? దాని వివరాలు ఇవ్వండి?

లాయర్: వక్ఫ్ బోర్డు అనే సంస్థను స్థాపించుకుని ఆ సంస్థ పేరు మీద ప్రాపర్టీ యజమానికి లేక ఒకవేళ ప్రాపర్టీ గవర్నమెంట్‌ది అయితే వాళ్లకు నోటీసులు ఇచ్చారు. కాబట్టి ప్రాపర్టీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వబడింది?

న్యాయమూర్తి: మరి అలాంటప్పుడు భారతదేశం మొత్తాన్ని వక్స్ బోర్డు ఆస్తిగా ప్రకటించుకుంటారు. అప్పుడు దేశమంతా బోర్డ్‌దే అయిపోతుందా? అలా ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా?

లాయర్: మా దగ్గర అటువంటి వివరాలు ఏమీ లేవు?

న్యాయమూర్తి: వక్ఫ్ బోర్డు ఏ ప్రాపర్టీ అయినా తమది అని చెప్పాలంటే వారికి ఆ ప్రాపర్టీ ఎక్కడ నుంచి వచ్చిందో దాని వివరాలు కోర్టుకి తెలియపరచాలి? అలా చేయలేకపోతే ఆ ప్రాపర్టీ ఏ వ్యక్తి నుంచి బలవంతంగా తీసుకున్నారో.. అది తిరిగి వారికే చెల్లుతుంది? ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్‌కి దక్కుతుంది.

తెలంగాణలో కూడా వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ పేరిట వేలమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం వారికేం నోటీసులు కూడా జారీ చేయలేదు. కానీ ధరణి పోర్టల్ లో పట్టా భూములను కూడా వక్ఫ్ బోర్డుగా పరిగణిస్తూ నిషేదిత జాబితాలో నమోదు చేశారు. దీనివల్ల ఆస్తిదారులు క్రయవిక్రయాలు, పేరు మార్పిడి అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెల్లని నిషేధిత జాబితా

రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం సెక్షన్ 22 ఎ ప్రకారం 1999 లో జారీ చేసిన గెజిట్ నం.23 ద్వారా పేర్కొన్న ఆస్తులపై పేచీ నడుస్తున్నది. వాటిలో పట్టా భూములను పేర్కొన్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. 19/2007 ప్రకారం రూపొందించిన జాబితాలో చాలా తప్పులు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. పట్టాభూములను కూడా ప్రభుత్వ జాబితాలో చేర్చారన్న అనుమానాలు ఉన్నాయి. పీవోబీ జాబితాకు వ్యతిరేకంగా, వాటిని సవాలు చేస్తూ అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దానిపై ఆరుగురు సింగిల్ జడ్జీలు తీర్పు ఇచ్చారు. 34319/15 కేసులోనూ ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. జాబితాను ప్రభుత్వం నోటిఫై చేస్తూ వాటిపై అభ్యంతరాలను స్వీకరించాలి. ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్షేపణలపై విచారణ జిల్లా కలెక్టర్ సమక్షంలో జరగాలి. ఐతే పీఓబీని రూపొందించడానికి తగిన మార్గదర్శకాలను మెమో నం.7797/రిజిస్ట్రేషన్-ఐ-ఎ/2016-17, తేదీ.27.5.2017 న ప్రొఫార్మాను తయారు చేశారు. కానీ హైకోర్టు తీర్పు ప్రకారం 2015 డిసెంబర్ నుంచి నాలుగు నెలల్లో రూపొందించాలి. కానీ ఇప్పటికీ తయారు చేయలేదు. ఇప్పటికీ 2007 లో తయారు చేసినదే అమలు చేస్తున్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా అభ్యంతరాలను, ఆక్షేపణలను పరిశీలించేందుకు ప్రభుత్వం 2016 జూలై 28న జీఓ నం.185 ప్రకారం ఉన్నత స్థాయి కమిటీని వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికలేమిటో ఎవరికీ తెలియదు.

ఆటో లాక్

2020 డిసెంబర్లో ధరణి పోర్టల్ వేలమంది రైతుల జీవితాలకు ‘ఆటోలాక్’ వేసింది. తరతరాలుగా వచ్చిన భూములపై హక్కులను ప్రశ్నార్థకం చేసింది. చేతిలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. క్షేత్రంలో వాళ్లే దున్నుకుంటున్నారు. తాతముత్తాతల కాలం నుంచి వాళ్లే హక్కుదారులు. కానీ, ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడేందుకు వాటిని ఆటోలాక్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత వెంటవెంటనే జీఓలు జారీ చేశారు. అయితే కొత్తగా రెండు విభాగాలు సమర్పించిన జాబితాలన్నింటినీ ‘ధరణి’ పోర్టల్ లో ఆటో లాక్ చేశారు. వాటిపై క్రయ విక్రయాలు జరగకుండా నిషేధించారు. భవన నిర్మాణాలకు అనుమతులను నిరాకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. నిజమైన హక్కుదారులను కూడా వాటిలో చేర్చడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. వారే హక్కుదారులనీ కళ్లముందు కనిపిస్తున్నా.. ఏ అధికారి వారి గోడును వినిపించుకోవడం లేదు. మరోవైపు అసైన్‌మెంట్, వక్ఫ్ భూములపై శాసనసభ కమిటీ కూడా వేశారు. అందులో అప్పటి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. వారేం నివేదిక సమర్పించారో ఇప్పటి వరకు పబ్లిక్ డొమెయిన్ లో పెట్టలేదు.

ఎక్కడి భూములు?

రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు గెజిట్ ప్రకారం 77,538 ఎకరాలు ఉంది. దాంట్లో 57,423 ఎకరాలు కబ్జాకు గురైంది. 6,938 మంది కబ్జాకు పాల్పడ్డారు. 6,074 మందికి నోటీసులు జారీ చేసినట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి నోటీసులు జారీ చేయకుండానే పీవోబీలో నమోదు చేశారు. ఐనా అన్ని వేల ఎకరాలు బోర్డుకు ఎలా వచ్చిందన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల వక్ఫ్ బోర్డు గెజిట్ పబ్లికేషన్ అంటూ కొత్త భూములను కూడా జాబితాలో చేర్చారు. ఖాస్రా పహాణీ మొదలు ప్రస్తుత ఆర్వోఆర్ రికార్డుల వరకు పట్టా భూములుగా ఉన్నప్పటికీ పేచీ పెడుతున్నారు. వక్ఫ్ బోర్డు నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలంటూ హుకూం జారీ చేస్తున్నారు. కానీ ఇచ్చేందుకు వక్ఫ్ బోర్డు అధికారులు ససేమిరా అంటున్నారు. ఆ అధికారులు ఎక్కడుంటారో? ఏ జిల్లాలో ఎవరిని సంప్రదించాలనే విషయం రైతులకు అంతుచిక్కడం లేదు. కానీ అక్రమంగా పట్టా భూములను వక్ఫ్‌గా నమోదు చేసిన అధికారులు, ఉద్యోగులపై మాత్రం చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. మొన్నటి వరకు పట్టా భూములుగా రికార్డుల్లో ఉన్నాయి. కానీ ఎప్పుడో పాత గెజిట్లను చూపి ఆటోలాక్ చేయడంతో ప్రతి జిల్లాలోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఆ మండలంలోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాలను వక్ఫ్ భూమిగా నమోదు చేసి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆ వక్ఫ్ బోర్డు కార్యాలయం ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. అలాంటి తమకు హైదరాబాద్‌కు వచ్చిన ఎన్‌వోసీ పొందడం సాధ్యమయ్యే పనేనా? ప్రభుత్వం ఆలోచించాలని రైతులు కోరుతున్నారు.

ఇవి చాలు

– సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ లో 6,800 ఎకరాలు ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాతా అందరికీ కొత్త పాసు పుస్తకాలొచ్చాయి. మొదటి విడత రైతుబంధు సాయం కూడా అందింది. కానీ కొన్ని రోజులకే వక్ఫ్ గెజిట్ 2001 అంటూ ఏకంగా 2,800 ఎకరాల పట్టా భూమిని వక్ఫ్ గా మార్చేశారు. మండలంలోనూ 6 వేల ఎకరాలకు పైగా నిషేధిత జాబితాలో చేర్చారు. తరతరాలుగా అనుభవిస్తున్న భూములంటూ రైతులు మొర పెట్టుకున్నారు. ఖాస్రా పహాణీ నుంచి తాతముత్తాతల పేర్లే ఉన్నాయని ఆధారాలు చూపినా తామేం చేయలేం.. గెజిట్ ప్రకారమే చేశామంటూ అధికారులు చేతులెత్తేస్తే 468 మంది రైతులు కోర్టుకు వెళ్లి న్యాయం పొందేందుకు ప్రయత్నించారు.

ఎంత అన్యాయం?

ఘట్కేసర్ పరిధిలో సర్వే నం.154 నుంచి 162 వరకు మొత్తం విస్తీర్ణం 67.34 ఎకరాల డ్రై ల్యాండ్స్, 8.15 ఎకరాల వెట్ ల్యాండ్స్ వక్ఫ్ ప్రాపర్టీ అంటూ వక్ఫ్ బోర్డు సీఈఓ ప్రకటించారు. 1989 లో గెజిట్ జారీ చేశారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. నిజానికి చెసాలా పహాణీ ప్రకారం సర్వే నం.154లో 14.06 ఎకరాలు, 155లో 18.17 ఎకరాలు, 156లో 12.21 ఎకరాలు, 158లో 22.25 ఎకరాలు, 159 లో 1.36 ఎకరాలు, 160లో 2.00 ఎకరాలు, 161లో 2.04 ఎకరాలు, 162లో 2.11 ఎకరాలు.. మొత్తం 76.00 ఎకరాలు మక్తాగా రికార్డయ్యింది. మక్తేదార్‌గా సయ్యద్ హబీబ్ సాబ్అని ఉంది. అలాగే ఈ భూమి మొత్తం ఉప్పునూతల కౌసల్యాదేవి పొజిషన్‌లో ఉందని 1959–60 పహాణీల్లో గుర్తించారు. పట్టేదార్ పేరు సయ్యద్ హబీబ్ సాబ్.. పొశిషన్‌లో ఉప్పునూతల కౌసల్యాదేవిగా ఉంది. ఆ తర్వాత పహాణీల్లో పట్టా భూమిగా నమోదైంది. సర్వే నం.154/పి, 155/పి లో 10.34 ఎకరాల భూమిని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ప్రొసీడింగ్స్ నం.ఎల్/865/2016 ప్రకారం ఏవీ కన్ స్ట్రక్షన్స్ అండ్ ప్రాజెక్ట్స్ పేరిట ల్యాండ్ కన్వర్షన్ చేశారు. ఆ తర్వాత హెచ్ఎండీఏ కూడా లే అవుట్ కు అనుమతులు జారీ చేసింది. లేఅవుట్ వేసి ప్లాట్లను విక్రయించి లాభాలు గడించిన రియల్టర్ క్షేమంగానే ఉన్నారు. కానీ పైసా పైసా పోగేసి ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రం ఆ స్థలాలు మీవి కావంటూ వక్ఫ్ బోర్డు పేచీ పెడుతున్నది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లోని సర్వే నం.154/ఎ, 155, 156 లో ప్రైమ్ ల్యాండ్ వెంచర్ వేశారు. ఏవీ కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ జక్కా వెంకట్రెడ్డి, ప్రైమ్ ల్యాండ్, ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎత్తేయాలని కోరారు. కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో కొనుగోలు చేశారని, ఆ ప్లాట్ల యజమానులు ఇప్పుడు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

ల్యాంక్ హిల్స్‌లో వక్ఫ్ బోల్తా

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగీర్ లో సర్వే నం.59, 65, 71, 102, 185 నుంచి 229, 231 నుంచి 237, 240, 241, 243, 244, 247 నుంచి 252, 254, 256 నుంచి 260, 262 నుంచి 266 వరకు ఉన్న 1653.32 ఎకరాలపై సుదీర్ఘ కాలం వివాదం నడిచింది. సేత్వార్ మొదలుకొని అన్ని రికార్డుల్లోనూ ఆ స్థలం మాఫీ ఇనాం, చౌతా ఇనాం, మక్తా, పొరంబోకు, పట్టాగా ఉంది. మొదట ఇందులో 5,506 చ.గ.ల స్థలంలో ఇల్లు ఉందని, అది ముత్తవల్లికి చెందినదంటూ వక్ఫ్‌ బోర్డు 1989లో ప్రకటించింది. ఆ తర్వాత మొత్తం 1654.32 ఎకరాల భూమి వక్ఫ్‌కి చెందుతుందంటూ 2006 మార్చి 13న మరో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆఖరికి అది వక్ఫ్‌ది కాదని.. అలాగే ప్రైవేటు వ్యక్తులదీ కాదని సుప్రీం‌కోర్టు తీర్పు ఇచ్చింది. రూ.50 వేల కోట్ల విలువైన స్థలం ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని జస్టిస్ హేమంత్ గుప్తా, వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది.

Advertisement

Next Story

Most Viewed