GHMC: ఆపరేటర్ల నుంచి ఆఫీసర్ల వరకు పనితీరుపై ప్రత్యేక నిఘా

by Gantepaka Srikanth |
GHMC: ఆపరేటర్ల నుంచి ఆఫీసర్ల వరకు పనితీరుపై ప్రత్యేక నిఘా
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంపై అటు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు, ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఫోకస్ పెట్టారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఆపరేటర్ల నుంచి ఆఫీసర్ల వరకు ఉన్నవాళ్ల పనితీరుపై ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతోపాటు కాంట్రాక్టర్ల పనితీరుపై విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పెండింగ్ బిల్లుల విషయంలో కాంట్రాక్టర్లు చేపట్టిన ఆందోళనలు, పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం వంటి సంఘటనల నేపథ్యంలో అధికారుల పాత్రపై ప్రభుత్వం ఆరా తీసినట్టు బల్దియా వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కాంట్రాక్టర్లపైనా..

జీహెచ్ఎంసీ పరిధిలో రెగ్యులర్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పనితీరుపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే రూ.2వేల కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కానీ సుమారు రూ.1,000 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో చేసిన పనులకు మాత్రమే బిల్లులు చెల్లించాలని, అంతకుముందు చేసిన పనులకు పరిశీలించాలని కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు జీహెచ్ఎంసీ, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలో కొంత మంది కాంట్రాక్టర్లు చేసిన పనులపై విజిలెన్స్ విచారణ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. హెడ్ ఆఫీసు, జోనల్, సర్కిళ్ల వారీగా వివాదాస్పద కాంట్రాక్టర్లను జాబితాను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్టు తెలిసింది.

అధికారులపైనా నిఘా..

కాంట్రాక్టర్ల పనితీరుపై అధికారులతో సమావేశమైనట్టే కాంట్రాక్టర్లతోనూ కమిషనర్ సమావేశమయ్యారు. ఇంజినీరింగ్ పనులు, టెండర్లు, బిల్లుల చెల్లింపు ప్రక్రియ, కమీషన్ల బాగోతం వంటి వాటిపై చర్చించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇంజినీరింగ్ విభాగంలోని ఆపరేటర్ల నుంచి ఆఫీసర్ల వరకు ప్రతి ఒక్కరి వివరాలు సేకరించారు. 5 ఏండ్లకు మించి ఎక్కువ కాలం పనిచేస్తున్న కంప్యూటర్ ఆఫరేటర్ల వివరాలను కమిషనర్‌కు అందజేశారు. దీంతో పాటు ఇంజినీర్ల జాబితా కమిషనర్‌కు చేరిందని సమాచారం. కాంట్రాక్టర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా అధికారులను బదిలీ చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని కమిషనర్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతుంది.

అన్ని విభాగాల్లోనూ బదిలీలు..

ఇంజినీరింగ్ విభాగంతో పాటు మిగిలిన విభాగాల్లోనూ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను జీహెచ్ఎంసీ సేకరించింది. ఈ నివేదిక కమిషనర్‌కు చేరింది. ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్లకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. వీరితో పాటు అటెండర్లు, రికార్డు అసిస్టెంట్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల వరకు బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేశారు.

Next Story