‘కమర్షియల్’ స్కాంలో సోమేష్ కుమార్‌కు బిగుస్తున్న ఉచ్చు..!

by Sathputhe Rajesh |
‘కమర్షియల్’ స్కాంలో సోమేష్ కుమార్‌కు బిగుస్తున్న ఉచ్చు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ రిటన్స్‌లో చోటుచేసుకున్న అవకతవకలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. కమర్షియల్ టాక్స్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేసిన సోమేశ్‌కుమార్ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే బదులు నష్టం కలిగించే తీరులో వ్యవహరించడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోమేశ్‌కుమార్‌ను ఏ-5గా చేర్చారు. రానున్న రోజుల్లో దర్యాప్తును ముమ్మరం చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. లబ్ధి పొందిన కంపెనీలకు త్వరలో నోటీసులు జారీ చేసే చాన్స్ ఉన్నది. మొత్తం కుంభకోణానికి సోమేశ్‌కుమార్ సూత్రధారి అంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం.

గొర్రెల స్కామ్‌పై ఏసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో ఈ స్కామ్ వెలుగులోకి రావడం విశేషం. ఈ కేసులో ఇప్పటికే కొద్దిమందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు తర్వాత వారిని విచారణకు పిలిచి స్టేట్‌మెంట్ రికార్డు చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. అరెస్టు చేసి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడంపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సోమేశ్‌కుమార్‌తో పాటు కమర్షియల్ టాక్స్ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, సాఫ్ట్‌వేర్‌ రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, ఆపరేషన్లను పర్యవేక్షించే ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థల ప్రతినిధులు సైతం నిందితులుగా ఉన్నారు.

కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులో గుబులు

కేసు దర్యాప్తులో భాగంగా రానున్న రోజుల్లో కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులో ఇంకా ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తాయనే గుబులు మొదలైంది. మొత్తం 11 సంస్థలు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ద్వారా లబ్ధి పొందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనందున ఆ కంపెనీల పేర్లు సైతం త్వరలో బయటకు రానున్నాయి. ఈ కంపెనీలపై సోమేశ్‌కుమార్ సహా ఆ శాఖ అధికారులకు ఎందుకు అంత ప్రేమ పుట్టింది... వాటి నిర్వాహకులతో ఉన్న సంబంధాలేంటి... వాటితో పొలిటికల్ లీడర్లకు ఏమైనా సంబంధాలున్నాయా... ఎవరి ఆదేశాలతో సోమేశ్‌కుమార్ ఈ ప్రయత్నానికి ఒడిగట్టారు... ఇలాంటి అంశాలన్నింటిపైనా అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా రూ.1,400 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు, రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో పాటు ఎక్కువగా లబ్ధి పొందించి రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ అని తేలినందున అవినీతి లోతు ఎంత అనేది కీలకంగా మారింది.

సోమేశ్ కుమార్ ఆదేశాలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు

పన్ను ఎగవేతదారులను పట్టుకునేందుకు, వారి నుంచి పెనాల్టీతో సహా వసూలు చేసేందుకు, సిబ్బందిని అలర్టు చేసేందుకు ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్‌ చివరకు దానికి విరుద్ధంగా మారింది. సోమేశ్‌కుమార్‌ ఆదేశాలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగాయని, థర్డ్ పార్టీకి డేటా వెళ్లిందని, ‘స్పెషల్ ఇనిషియేటివ్స్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి సాఫ్ట్‌వేర్‌కు లింక్ చేసింది కూడా సోమేశ్ ఆదేశాలతోనే అని ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు వెల్లడించడం గమనార్హం. తొలుత మౌఖిక ఆదేశాలకు పరిమితమైనా ఆ తర్వాత వాట్సాప్ గ్రూపు ద్వారా తగిన సూచనలు చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూపు ఇన్ఫర్మేషన్‌ను సేకరించిన పోలీసులు సోమేశ్‌కుమార్ ఎప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్నారో అనే విషయంపై ఆరా తీశారు. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలంటూ సూచనలు ఇవ్వడం ద్వారా ఎవరికి మేలు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయా కంపెనీలతో సోమేశ్‌కుమార్‌కు ఉన్న లింకులు, వాటి ద్వారా ఆయన పొందిన లబ్ధి తదితరాలపై రానున్న రోజుల్లో పోలీసులు లోతుగా స్టడీ చేసే అవకాశమున్నది.

సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశం

మరోవైపు దాదాపు 70కు పైగా కంపెనీలు ఈ స్కామ్ ద్వారా లబ్ధి పొందాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినందున ఈ కంపెనీల వ్యాపారం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనూ ఉండడంతో తదుపరి ఎంక్వయిరీనీ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సోమేశ్‌కుమార్ సహా ఆయనకు సహకరించిన కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంట్ అధికారులు, ప్రైవేటు కంపెనీలతో కుదిరిన అవగాహన తదితరాలన్నింటిపై కొంత వివరణ లభించే అవకాశమున్నది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఏ దిశగా తీసుకెళ్తుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story