కళ్లు గీత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ

by Satheesh |   ( Updated:2024-07-14 08:38:18.0  )
కళ్లు గీత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: కళ్లు గీత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించే కార్మికులు తరచూ ప్రమాదాలబారిన పడి గాయపడే సంఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ పథకం కింద గౌడన్నలకు ప్రభుత్వం సేఫ్టీ కిట్‌లను అందించనుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ గ్రామంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌడన్నలతో మాట్లాడిన రేవంత్ వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు.

పలువురు గీతకార్మికులకు కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి గౌడన్నలు కీలక విజ్ఞప్తి చేశారు. తాటివనాల పెంపును ప్రోత్సాహించాలని, ప్రతి గ్రామంలో దీని కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. అంతేకాకుండా తాటి వనాలకు వెళ్లేందుకు మోపెడ్లు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగం పెరగడం వల్లే తాటివనాలు తగ్గుతున్నాయన్నారు. ప్రభుత్వం చేపట్టే వనమహోత్సవంలో భాగంగా తాటిచెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల పక్కన తాటి చెట్లు నాటాలనే నిబంధన విధిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed