CM Revanth: లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే ఏదైనా సాధించొచ్చు

by Gantepaka Srikanth |
CM Revanth: లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే ఏదైనా సాధించొచ్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న రోజుల్లో తెలంగాణ ‘స్పోర్ట్స్ హబ్’గా మారుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని నెలకొల్పుతున్నామని, దాని ఆధ్వర్యంలోనే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి దక్షిణ కొరియా నుంచి కోచ్‌లను తెప్పించి శిక్షణ అందిస్తామన్నారు. ‘సీఎం కప్ – 2024’ పోటీలను ఎల్బీ స్టేడియంలో గురువారం ప్రారంభించి మస్కట్ లోగో, పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా క్రీడాభివృద్ధి, లక్ష్యాలను వివరించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి క్రీడా వేదికగా మారబోతున్నదన్నారు. పాతికేండ్ల క్రితమే హైదరాబాద్ నగరం ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ కు వేదికగా నిలిచిందని, క్రీడా రంగానికి తలమానికంగా నిలబడిందని సీఎం గుర్తుచేశారు. దురదృష్టవశాత్తూ గడచిన పదేండ్లలో క్రీడా రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, క్రీడలవైపు వెళ్ళాల్సిన యువత మత్తు పదార్ధాలు, వ్యసనాలకు బానిసలయ్యే పరిస్థితి తలెత్తిందని, ఇది చాలా బాధాకరమని అన్నారు.

క్రీడల పట్ల ఆసక్తితో మారుమూల ప్రాంతానికి చెందిన నిఖత్ జరీన్ ఇండియాకు బాక్సింగ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చారని, ఒలింపిక్స్ సహా అనేక అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించారని, మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్ని ఇచ్చిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. క్రీడల్లో రాణిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎలా గుర్తిస్తుందో, ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుందో ఇదే నిదర్శనమన్నారు. క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగాన్ని ఇచ్చిందని, ఇందుకు నిబంధనల్లోనూ కొన్ని సడలింపులు చేసిందని పేర్కొన్నారు. గతంలో పీవీ సింధు, అజారుద్దీన్ లాంటి హైదరాబాదీలు దేశానికే పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారని గుర్తుచేశారు. పుట్ బాల్ కోచ్ రహీమ్ సార్ హైదరాబాద్ నగరానికి చెందినవారు కావడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాలనే ఉద్దేశంతోనే అండర్-17 పుట్ బాల్ నేషనల్ టీమ్‌ను తెలంగాణ దత్తత తీసుకుంటోందని తెలిపారు.

చాలా చిన్న దేశం దక్షిణ కొరియా ఈసారి ఒలంపిక్స్ పోటీల్లో 36 పతకాలను సాధించిందని గుర్తుచేసిన సీఎం రేవంత్.. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి దానికింద పనిచేసేలా యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను నెలకొల్పి దక్షిణ కొరియా కోచ్‌లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇప్పిస్తామన్నారు. మతాలకు అతీతంగా అందరినీ కలిపేది, దేశ ప్రతిష్టను పెంచేదీ క్రీడా మైదానాలేనని అన్నారు. ఎల్బీ స్టేడియానికి అవసరమైన నిధులు కేటాయించి సౌకర్యాలను కల్పించి అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్దుతామన్నారు. యువత వ్యసనాల వైపు వెళ్లొద్దని పిలుపునిచ్చిన సీఎం రేవంత్.. క్రీడల్లో రాణిస్తే దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే అవకాశం ఉంటుందన్నారు. 2028లో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో మన దేశం తరపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైనట్లుగా క్రీడాకారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.

లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని నొక్కిచెప్పిన సీఎం తన స్వీయానుభవాన్ని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్న తాను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయానని, కానీ నిరుత్సాహపడకపోగా మరింత కసితో దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించానని గుర్తుచేశారు. వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి 2018లో పోటీ చేసి ఓడిపోయిన తాను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానని వివరించారు. ఎప్పటికైనా తెలంగాణకు సీఎం కావాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నానని, ఎన్ని అవమానాలు, ఛీత్కారాలు ఎదురైనా అధిగమి,చి కష్టపడి లక్ష్యాన్ని సాధించానని తెలిపారు. ఇప్పుడు క్రీడాకారులు సైతం అలాంటి లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడితే ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారమైనా అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ నొక్కిచెప్పారు. వారు ఎంచుకున్న రంగంలో గోల్ సాధించడం మాత్రమే కాక యువతకు సైతం స్ఫూర్తిగా నిలుస్తారని, వ్యసనాల నుంచి క్రీడలవైపు ఆసక్తి చూపడానికి దోహదపడుతుందన్నారు.

Next Story